రాష్ట్రంలో ఎవరైనా ఆనందంగా ఉన్నారా?
ప్రజల జీవితాలు బాగు పడాలంటే రాష్ట్రంలో ‘సైకో పాలన పోవాలి.
సైకిల్ పాలన రావాలి’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ సీఎం అయ్యాక మన రాష్ట్రంలో ఎవరైనా ఆనందంగా ఉన్నారా? మీ జీవితాల్లో మార్పు ఏమైనా వచ్చిందా? అని ఆయన ప్రశ్నించగా… లేదు.. రాలేదు.. అని జనం స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి, కొవ్వూరు మండలాల్లో ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. కొవ్వూరులో గురువారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ… ‘జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేశారు. ప్రాణ సమానంగా కాపాడుకుని, చిన్నపిల్లలా పెంచిన పోలవరం ప్రాజెక్టును, డయాఫ్రమ్ వాల్‌నూ గోదావరి పాలుజేశారు.
మేం రాష్ట్రానికి రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తే,జగన్ మూడున్నరేళ్లలో ఏమీ తేకపోగా,ఉన్న వారిని తరిమేస్తున్నారు. అప్పులు చేసే ముఖ్యమంత్రి సమర్థుడా..? సంపద సృష్టించే సీఎం సమర్థుడా..? ప్రజలే చెప్పాలి.
ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని నాశనం చేశారు. 34 వేల ఎకరాల భూములను ఇచ్చిన రైతులను కులం పేరిట అణగదొక్కారు.
నేను కులమతాలకు అతీతంగా పాలన సాగించా. ప్రాంతాల మధ్య సమతుల్యత పాటించా. ఈ సీఎం సొంత సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తున్నారు.
ప్రజలే నా వాలంటీర్లు: జగన్‌లా నాకు వాలంటీర్లు లేరు. ప్రజలు, కార్యకర్తలే నా వాలంటీర్లు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సమరానికి సిద్ధమవ్వాలి. ‘ఇదేం ఖర్మ… మన రాష్ట్రానికి’ అంటూ రోడ్లు, వ్యవసాయం, ఆక్వా, ధాన్యం కొనుగోళ్లు ఇలా సమస్యలపై సెల్‌ఫోన్‌లలో ఫొటోలు తీసి, సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయాలి.
96% ఎన్నికల హామీలు నెరవేర్చామని చెబుతున్న వైకాపా ప్రభుత్వానికి జనం సమస్యలు తెలియాలి. రాబోయే ఎన్నికల్లో జగన్‌కు బుద్ధిచెప్పాలని నా కంటే ప్రజలే ఎక్కువ ఆవేశంతో ఉన్నారు’ అని అన్నారు.
ఆయా కార్యక్రమాల్లో తెదేపా నేతలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జవహర్, ప్రత్తిపాటి పుల్లారావు, పితాని సత్యనారాయణ, ఆదిరెడ్డి భవానీ, ఆదిరెడ్డి అప్పారావు, రామకృష్ణ, సుబ్బరాయచౌదరి తదితరులు పాల్గొన్నారు.