10 రోజుల్లో డబుల్ చేసిన మ్యాజిక్ బ్యాంక్ స్టాక్.. వివరాలు;
స్టాక్ మార్కెట్లో ఏదైనా జరగొచ్చు. అందుకు ఎక్కువ సమయం అవసరం లేదు. అవి లాభాలైనా లేక నష్టాలైనా సరే. అయితే ప్రస్తుతం ఒక బ్యాంకింగ్ షేర్ దూకుడు దీనినే సూచిస్తోంది. పైగా ఇదొక ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ కావటం చాలా మంది ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు కాసుల వర్షం కురిపిస్తున్న బ్యాంక్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బ్యాంకుల్లో డబ్బును దాచుకొని వడ్డీ ఆదాయాన్ని పొందుతూ సంతృప్తి పడేరోజులు పోయాయి. అదంతా పాతకాలం పద్దతి. కానీ ఇప్పుడు చాలా మంది స్టాక్ మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు. మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి త్వరగా తమ సంపదను రెట్టింపు చేసుకోవాలని భావిస్తున్నారు. అలా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ షేర్లలో పెట్టుబడి పెట్టిన వారు ఇప్పుడు పండుగ చేసుకుంటున్నారు.
గరిష్ఠాలకు స్టాక్;
నవంబర్ 14న పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ షేరు ధర రూ.18.4 వద్ద ఉంది. అయితే ఈరోజు మార్కెట్లు ముగిసే సమయానికి 10 శాతం అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయ్యి రూ.40.85 వద్ద ఎన్ఎస్ఈలో ఉంది. దీంతో షేర్ తన కొత్త 52 వారాల గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది.ఈ క్రమంలో స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.13 వద్ద ఉంది. ఇటీవలి కాలంలో ప్రభుత్వ రంగంలోని మాత్రమే కాక ప్రైవేటు యాజమాన్యంలోని బ్యాంకింగ్ షేర్లు సైతం మంచి పనితీరుతో తమ ఇన్వెస్టర్లకు లాభాలను తెచ్చిపెడుతున్నాయి.
లక్షను రూ.2 లక్షలు;
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ షేర్లు 13 ట్రేడింగ్ రోజుల నుంచి దాదాపుగా 99 శాతం మేర పెరిగాయి. అంటే ఎవరైనా ఇన్వెస్టర్ కేవలం ఈ బ్యాంక్ షేర్లలో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టినట్లయితే, ఇప్పుడు దాని విలువ రూ.2 లక్షలకు చేరుకునేది. ఇలా చాలా తక్కువ సమయంలోనే స్టాక్ తన ఇన్వెస్టర్లకు కనకవర్షం కురిపించింది. మెుత్తంగా స్టాక్ ఈ ఏడాది 148 శాతం వృద్ధిని నమోదు చేసింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ మంచి లాభాలను నమోదు చేసి, మెరుగైన పనితీరు కనబరచటం దీనికి కారణంగా నిలుస్తోంది.