ఇండియాలో మరికొన్ని వారాల్లో 5G నెట్వర్క్ సేవలు ప్రారంభం కానున్నాయి.
వచ్చే నెలలో 5G సేవలను ప్రారంభించే దిశగా టెలికాం సంస్థలు,ప్రభుత్వంపని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అత్యంత ఫాస్టెస్ట్ నెట్వర్క్ అయిన 5G మన దేశంలో అందుబాటులోకి వస్తే 4Gకి సపోర్ట్ చేసే స్మార్ట్ఫోన్ల ధరలు తగ్గుతాయా? లేదా? అనే చర్చ మొదలైంది. ఈ అంశంపై నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అక్టోబర్ 1న న్యూఢిల్లీలో జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022లో ప్రధాని మోదీ దేశంలోనే మొట్టమొదటి 5G మొబైల్ సేవలను అధికారికంగా ప్రారంభించనున్నారు. అక్టోబర్ 12 నాటికి 5G సేవలను పాన్-ఇండియాలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
5G సేవల ధరలు వినియోగదారులకు అందుబాటులో ఉండేలా
5G సేవల ధరలు వినియోగదారులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. 3G, 4G మాదిరిగానే, టెలికాం కంపెనీలు త్వరలో 5G టారిఫ్ ప్లాన్లను ప్రకటించనున్నాయి. భారతదేశంలోని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు తక్కువ ధరకే 5G ఫోన్లను లాంచ్ చేయాలని, 4G స్మార్ట్ఫోన్ల ధరలను తగ్గించాలని నిపుణులు భావిస్తున్నారు.
* తొలుత 13 నగరాల్లో..
దేశంలో 5G టవర్ల ఇన్స్టాలేషన్లు జరుగుతున్నాయి. టెలికాం ఆపరేటర్లు అంతరాయం లేని సేవలు అందించే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నారు. 5G సేవలు దశలవారీగా అందుబాటులోకి వస్తాయి. మొదటి దశలో అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై,
ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్ , జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పూణే వంటి 13 నగరాల్లో 5G మొబైల్ సేవలు ప్రారంభించే అవకాశం ఉంది.
* 4G ఫోన్ల ధరలు తగ్గుతాయా?
దేశంలో 4G స్మార్ట్ఫోన్ల ధరలు తగ్గుతాయని భావించట్లేదని ‘జీ బిజినెస్’తో చెప్పారు టెక్ఆర్క్ విశ్లేషకుడు ఫైసల్ కవూసా. 4G ఫోన్లు రిలవెంట్గా ఉంటాయని, స్థిరమైన డిమాండ్‌ను చూపుతాయని తెలిపారు. ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యాన్యుఫాక్చరెర్స్ధరలను స్థిరంగా ఉంచడం ద్వారా ప్రభావితం చేయగలవని చెప్పారు.
సైబర్‌మీడియా రీసెర్చ్‌లోని ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ విశ్లేషకుడు అమిత్ శర్మ ‘జీ బిజినెస్’తో మాట్లాడుతూ.. 4G స్మార్ట్‌ఫోన్ ధరలు తగ్గుతాయని అంచనా వేస్తున్నామని తెలిపారు. 5G సేవలు అందుబాటులోకి రాగానే పాత స్టాక్లను క్లియర్ చేయడంపై కంపెనీలు దృష్టి పెడతాయన్నారు. పండుగ సీజన్లో 4G టెక్నాలజీ ఫోన్లపై డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందించే అవకాశం ఉందని శర్మ పేర్కొన్నారు.
కౌంటర్‌పాయింట్ రీసెర్చ్‌లోని రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ మాట్లాడుతూ.. ‘4G స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ధరలను తగ్గించడానికి ముందుకు వస్తాయి. 1-2 సంవత్సరాలలో రూ.10 వేలు, అంతకంటే తక్కువ ధరకు లభించే ఫోన్ల స్టాక్లను క్లియర్ చేయడంపై దృష్టి పెడతాయి. ఆ తర్వాత రూ.15 వేల కంటే ఎక్కువ ఉన్న 4G ఇన్వెంటరీని వదిలించుకోవడానికి కూడా ప్రయత్నిస్తాయి. అయితే 200 డాలర్ల కంటే తక్కువ ధరలో ఒక గొప్ప 5G ఫోన్‌ను లాంచ్ చేయడానికి ఇంకా కొంత సమయం అవసరం. అందువల్ల ఆ రేంజ్‌లోని 4G ఫోన్లు కొంత కాలం కొనసాగే సూచనలు ఉన్నాయి. ఆ తర్వాత క్రమేపీ ఆ ఫోన్ల ధరలను కూడా తగ్గిస్తారు.’ అని వివరించారు.