అమెరికాలో నివసిస్తున్న 23 ఏళ్ల ఢిల్లీ కుర్రాడు జాబ్ కోసం శతవిధాలా ప్రయత్నించాడు. కంపెనీలకు వందల సంఖ్యలో మెయిల్స్ పంపించి, కాల్స్ చేసినా రెస్పాన్స్ లేదు.
అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ట్రై చేశాడు. చివరకు వరల్డ్ బ్యాంక్‌లో జాబ్ కొట్టేశాడు. ఇందుకు తాను ఎంచుకున్న మార్గాలను లింక్డ్‌ఇన్ వేదికగా పంచుకోగా అతడి పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది.
‘మరో 2 నెలల్లో గ్రాడ్యుయేషన్ పూర్తికావస్తున్నా నా చేతిలో ఎలాంటి జాబ్ లేదు. నేను యేల్ యూనివర్శిటీ విద్యార్థిని. కనీసం ఓ ఉద్యోగం సాధించలేని వాడిని ఈ యేల్ యూనివర్సిటీకి రావడం ఎందుకు అని నన్ను నేనే ప్రశ్నించుకున్నా. ఏం చేస్తున్నావు అని నా తల్లిదండ్రులు ఫోన్‌లో పలకరించినప్పుడు సమాధానం ఇవ్వడం కష్టంగా అనిపించింది’ అంటూ రాసుకొచ్చాడు. ‘భారత్‌కు తిరిగి వెళ్లడం సరైన నిర్ణయం కాదనుకున్నా. నా మొదటి సంపాదన డాలర్లలోనే ఉండాలని నిశ్చయించుకున్నా. జాబ్ అప్లికేషన్ ఫారమ్‌లు, జాబ్ పోర్టల్‌లు కాకుండా నెట్‌వర్కింగ్‌పై దృష్టిపెట్టాను’ అని తెలిపాడు.
రెండు నెలల వ్యవధిలో 1,500 కనెక్షన్ అభ్యర్థనలు, 600 ఈమెయిల్స్, 80 కాల్స్ చేయగా.. పెద్ద సంఖ్యలో తిరస్కరణలకు గురైనట్లు వత్సల్ పేర్కొన్నాడు. కాగా ఆ సమయంలో 2010 నాటి చిత్రం ‘ది సోషల్ నెట్‌వర్క్’లోని ‘ది జెంటిల్ హమ్ ఆఫ్ యాంగ్జైటీ’ పాట యూట్యూబ్‌లో తాను అత్యధికంగా విన్న పాటగా చెప్పుకొచ్చాడు.
‘ఎన్నో సంస్థల తలుపు తట్టగా.. నా ప్రయత్నం ఫలించింది. నాలుగు సంస్థలు నాకు ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. వాటిలో నేను ప్రపంచ బ్యాంకును ఎంచుకున్నా. గడువు ముగిసిన తర్వాత నా వీసాను స్పాన్సర్ చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. ప్రపంచ బ్యాంక్ డైరెక్టర్‌తో కలిసి పనిచేసేందుకు అవకాశం కల్పించారు. 23 సంవత్సరాల వయస్సు గలవారికి ఇది సాధ్యంకాని విషయం’ అంటూ పేర్కొన్నాడు. ‘ఏది ఏమైనా ముందుకుసాగండి. చిన్నదానితో సంతృప్తిపడకండి’ అంటూ నహతా ఆ పోస్ట్‌ను ముగించాడు.