ప్రపంచంలోని అగ్ర దేశాలన్నీ ఎలక్ట్రిక్ వాహనాల వైపు ద్రుష్టి సారించాయి. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి.
రాబోయే పదేళ్లలో రోడ్లపై నాలుగింట ఒక వంతు ఎలక్ట్రిక్ వాహనాలే పరుగులు పెట్టనున్నాయని నివేదికలు సైతం చెప్తున్నాయి. ప్రపంచమంతా ఇలా ఉంటే.. ఒక దేశం మాత్రం తమ దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ఆపేయడానికి సిద్దపడింది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ కార్ల వినియోగంపై నిషేధం విధించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి బలమైన కారణం కూడా ఉంది. ఇంతకీ.. ఆ దేశం ఏది? ఈ నిర్ణయం వెనుకున్న కారణమేంటి? అన్నది ఇప్పుడు చూద్దాం..
నివేదికల ప్రకారం.. స్విట్జర్లాండ్ ఈ శీతాకాలంలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి వీలు లేదని ప్రకటించింది. అందుకు కారణం.. విద్యుత్ కొరత. స్విట్జర్లాండ్ విద్యుత్ అవసరాల కోసం ఎక్కువగా హైడ్రోపవర్పై ఆధారపడుతుంది. దేశంలో వినియోగించే 60 శాతం విద్యుత్ హైడ్రోపవర్ నుంచే ఉత్పత్తి అవుతోంది. అయితే.. చలికాలంలో హైడ్రోపవర్ విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. ఆ సమయంలో స్విట్జర్లాండ్.. ఫ్రాన్స్, జర్మనీ దేశాల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఈ రెండు దేశాలతోపాటు యూరప్‌లోని పలు దేశాలు విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో ఫ్రాన్స్ ఇతర దేశాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేసింది.
ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్ ప్రభుత్వం విద్యుత్ వినియోగంపై ఆంక్షలు విధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అనుమతించిన కార్యక్రమాలకే ఈవీ వాహనాలను వాడాలని కొన్ని నిబంధనలు విడుదల చేసింది. అత్యవసర ప్రయాణాలకు, డాక్లర్లను సందర్శించడానికి, మతపరమైన కార్యక్రమాలకు, కోర్టుకు హాజరయ్యేందుకు, ఉద్యోగ ప్రదేశాలకు వెళ్లేందుకు తదితర కొన్ని పనులకు మాత్రమే ఈవీ వాహనాలను వాడుకోవచ్చని స్పష్టం చేసింది. విద్యుత్ సంక్షోభం మరింత తీవ్రమైతే ఈవీల వినియోగంపై పూర్తిగా నిషేధం విధించాలని ఆలోచిస్తోందట. ఇది అమలైతే ఈవీలపై నిషేధం విధించిన తొలిదేశం స్విట్జర్లాండ్ అవుతుంది. బహుశా ప్రపంచంలో ఇప్పటివరకు ఏ దేశమూ ఎలక్ట్రిక్ కార్లను నిషేదించలేదు. కావున ఎలక్ట్రిక్ కార్లను నిషేదించిన మొదటి దేశం బహుశా స్విట్జర్లాండ్ కావచ్చు.