పొగరాయుళ్లకు కేంద్రం భారీ షాక్‌! ఇక సిగరెట్లు అలా లభించడం కష్టమే

పొగరాయుళ్లకు కేంద్రం షాకివ్వనుంది. రానున్న రోజుల్లో విడిగా సిగరెట్ల అమ్మకాల్ని బ్యాన్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని అరికట్టేలా సింగిల్‌ సిగరెట్ల అమ్మకాల్ని బ్యాన్‌ చేయాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.

వదులుగా ఉన్న సిగరెట్ల అమ్మకాలు పొగాకు నియంత్రణపై చేస్తున్న ప్రచారాన్ని ప్రభావితం చేస్తున్నాయని కమిటీ సభ్యులు వాదించారు. దీంతో పాటు దేశంలోని అన్ని ఎయిర్‌పోర్ట్‌లలో స్మోకింగ్‌ జోన్‌లను తొలగించాలని కమిటీ సిఫార్స్‌ చేసింది.

స్టాండింగ్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తే, పార్లమెంట్‌ త్వరలో సింగిల్ సిగరెట్ల అమ్మకాల్ని నిషేధించవచ్చు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిఫారసు మేరకు 3 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం ఇ-సిగరెట్ల అమ్మకం, వాడకాన్ని నిషేధించిన విషయం తెలిసిందే.

జీఎస్‌టీ అమలు తర్వాత కూడా పొగాకు ఉత్పత్తులపై పన్నులో పెద్దగా పెరుగుదల లేదని స్టాండింగ్ కమిటీ గుర్తించింది. మద్యం, పొగాకు ఉత్పత్తుల వినియోగం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని కమిటీ హైలైట్ చేసింది.తాజా పన్ను శ్లాబుల ప్రకారం..బీడీలపై 22 శాతం, సిగరెట్లపై 53 శాతం, పొగలేని పొగాకుపై 64 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. మరోవైపు, పొగాకు ఉత్పత్తులపై 75శాతం జీఎస్టీ విధించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ప్రభుత్వాన్ని కోరింది.

ఏడాదికి 3.5లక్షల మందికి మరణం
పలు నివేదికల ప్రకారం, మన దేశంలో స్మోకింగ్‌ కారణంగా ఏడాదికి 3.5 లక్షల మంది మరణిస్తున్నట్లు తేలింది. 2018 లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ నిర్వహించిన ఒక సర్వేలో ధూమపానం చేసే వారిలో 46 శాతం మంది నిరక్షరాస్యులు, 16 శాతం మంది కాలేజీ విద్యార్ధులు ఉన్నారు.

ఫౌండేషన్ ఫర్ స్మోక్ ఫ్రీ వరల్డ్ నివేదిక ప్రకారం.. భారత్‌లో ప్రతి సంవత్సరం సుమారు 6.6 కోట్ల మంది సిగరెట్లు తాగుతుండగా, 26 కోట్లకు పైగా ఇతర పొగాకు ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. పొగాకు వాడకం వల్ల భారతదేశంలో సుమారు 21శాతం మందికి క్యాన్సర్ సోకుతున్నట్లు ఓ అధ‍్యయనం వెలుగులోకి తెచ్చింది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *