నేటి ఆధునిక సాంకేతిక ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అలా ఇటీవల బాగా పాపులర్ అయిన టెక్నాలజీ చాట్ జిపిటి. డిసెంబర్ 1న పబ్లిక్ బీటా టెస్టింగ్ కోసం చాట్ జీబీపీ ప్లాట్‌ఫారమ్ అందుబాటులోకి వచ్చింది.
ప్రారంభించిన వారంలోపే చాట్ జిపిటి 1 మిలియన్‌కి మించి యూజర్లను చేరుకుంది. అందుకే ఈ ప్లాట్‌ఫారమ్ గూగుల్ సెర్చింగ్‌ను రీప్లేస్ చేయగలదని, భవిష్యత్తులో మనుషులకు బదులు ఇదే స్వయంగా చాట్ చేయగలదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసలు చాట్‌జీపీటీ అంటే ఏమిటి? చాట్ జీబీటీ ఎలా పనిచేస్తుంది? వంటి వంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.
చాట్ జిపిటి అంటే ఏంటి?
చాట్ జిపిటి అనేది ఒక చాట్‌బాట్ వంటిది. దీన్ని ఎలోన్ మస్క్ స్థాపించిన స్వతంత్ర పరిశోధనా సంస్థ ఓపెన్ఏఐ అభివృద్ధి చేసింది. ఈ సంస్థను 2015లో సామ్ ఆల్ట్మాన్, ఎలోన్ మస్క్ ఇద్దరూ కలిసి స్థాపించారు. చాట్ జిపిటి ప్రాంప్ట్‌లో సూచనలను అనుసరించడానికి, వివరణాత్మక ప్రతిస్పందనను అందించడానికి ఉపయోగడపడుతుంది. చాట్ జిపిటి ద్వారా యూజర్లు వారి సందేహాలు, ప్రశ్నలు అడగవచ్చు. చాట్‌బాట్ వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. అయితే ఇది ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ల కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. చాట్ జిపిటి, ఇతర ఏఐ చాట్బాట్ల వలె కాకుండా, అడగబోయే ప్రశ్నలను సైతం ఊహించి వాటికి సమాధానం ఇవ్వగలదు.
చాట్ జిపిటి ఎలా పని చేస్తుంది?
ఓపెన్ఏఐ ప్రకారం.. చాట్ జిపిటి అనేది ఒక ఫ్రీ సర్వీస్. అయితే కేవలం రిసెర్చ్ ప్రివ్యూ సమయంలో మాత్రమే ఇది ఉచితంగా లభిస్తుంది. ఆ తర్వాత ఉపయోగించాలంటే మాత్రం సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించడానికి ఓపెన్ఏఐ వెబ్‌సైట్‌కి వెళ్లి ట్రై చాట్‌జిపిటి బటన్‌పై క్లిక్ చేయాలి. సైన్ అప్ అవ్వడం ద్వారాచాట్ జిపిటి ప్లాట్‌ఫారమ్‌ని ప్రారంభించవచ్చు. ఓపెన్ఏఐ కంపెనీ ఈ మోడల్‌ను మరింత సులభంగా మార్చడానికి రీన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఫ్రమ్ హ్యూమన్ ఫీడ్‌బ్యాక్ ని ఉపయోగించింది. చాట్ జీపీటీపై ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ మాట్లాడుతూ.. మేము ఫైన్-ట్యూనింగ్ని ఉపయోగించి ప్రారంభ నమూనాకు ట్రైనింగ్ ఇచ్చామన్నారు. మానవ ఏఐ శిక్షకులు సంభాషణలను అందించారని తెలిపారు. కంపెనీ భవిష్యత్తులో ప్లాట్‌ఫారమ్‌ను మానిటైజ్ చేయనుందని, ప్రస్తుతం రిసెర్చ్ ప్రివ్యూ మాత్రమే ఉచితంగా లభిస్తుందని, భవిష్యత్తులో సబ్స్క్రిప్షన్ పెట్టి ఆదాయం సమకూర్చుకోవాలని చూస్తున్నామని చెప్పారు.
చాట్ జిపిటికి పరిమితులు ఉన్నాయా?
చాట్ జిపిటిఅనేది జనరేటివ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ టెక్నాలజీపై పనిచేస్తుంది. ఇది ఆటోమేటిక్‌గా మాటలను సృష్టించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. అయితే చాట్ జిపిటి కొన్నిసార్లు తప్పు లేదా అర్ధంలేని సమాధానాలను ఇచ్చే అవకాశం కూడా ఉందని కంపెనీ అంగీకరించింది.
చాట్ జిపిటి గూగుల్ సెర్చింగ్ లేదా మానవులను భర్తీ చేయగలదా?
చాలా మంది తమ ప్రశ్నలకు సమాధాన కోసం గూగుల్ సెర్ఛ్ చేస్తారు. దీని కోసం మనం చాట్ జిపిటి ఆధారపడవచ్చా? అనే ప్రశ్నకు నిపుణులు అవుననే సమాధానం ఇస్తున్నారు. లేటెస్ట్ టెక్నాలజీతో చాట్ జిపిటి వస్తున్నా.. ఇందులోనూ కొన్ని సమస్యలు లేకపోలేదని చెప్పారు. ఒక్కోసారి తప్పుడు సమాచారం కూడా ఇచ్చే అవకాశం ఉందన్నారు. అందుకే ఈ లోపాలను సరిదిద్డడంపై ఓపెన్ ఏఐ కంపెనీ దృష్టి పెట్టింది. అన్నీ సక్రమంగా జరిగితే చాట్ జిపిటి భవిష్యత్తులో గూగుల్ సెర్చింగ్ లేదా మానవులను భర్తీ చేయగలదని నిపుణులు చెబుతున్నారు.