చిక్కుల్లో ట్విట్టర్‌.. టాప్‌ మేనేజ్‌మెంట్‌ నిష్క్రమణ!

ఎలన్‌మస్క్‌ టేకోవర్‌ చేశాక ట్విట్టర్‌ చిక్కుల్లో పడినట్లు తెలుస్తున్నది. టాప్‌ మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌లు వైదొలిగారని సమాచారం.

Twitter | ప్రపంచంలోనే అపర కుబేరుడిగా ఉన్న ఎలన్‌మస్క్‌ .. టేకోవర్‌ చేసుకోవడంతోనే సోషల్‌ మీడియా వేదిక ట్విట్టర్‌లో టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లతోపాటు మేనేజ్‌మెంట్‌ అధికారులు నిష్క్రమిస్తున్నారు. సంస్థ అడ్వర్టైజింగ్‌, మార్కెటింగ్‌ చీఫ్‌లు కూడా వైదొలిగిన వారిలో ఉన్నారు. గత వారం 44 బిలియన్ల డాలర్లకు ట్విట్టర్‌ను ఎలన్‌మస్క్‌ టేకోవర్‌ చేసిన సంగతి తెలిసిందే. ట్విట్టర్‌ను టేకోవర్‌ చేయగానే, ఆ సంస్థ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌, చీఫ్‌ ఫైనాన్సియల్‌ ఆఫీసర్‌ నెడ్‌ సెగల్‌, లీగల్‌ అఫైర్స్‌ అండ్‌ పాలసీ చీఫ్ విజయ గద్దె లను ఎలన్‌మస్క్‌ తొలగించేశారని వార్తలొచ్చాయి. మరోవైపు, ట్విట్టర్‌ భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుందని సమాచారం. పలు యాడ్‌ సంస్థలు తమ ప్రకటనలు నిలిపేస్తామని హెచ్చరించాయి. ఎలన్‌మస్క్‌కు హక్కుల సంఘాలు బహిరంగ లేఖ రాశాయి.

యాడ్‌ విభాగం బాస్‌, చీఫ్‌ కస్టమర్‌ ఆఫీసర్‌ సరాహ్‌ పర్సొనెట్టే కూడా గత వారమే ట్విట్టర్‌ను వీడినట్లు మంగళవారం ట్వీట్‌ చేశారు. ఎలన్‌మస్క్‌ చేతుల్లోకి వెళ్లిన తర్వాత ట్విట్టర్‌ భవితవ్యం ఎలా మారుతుందోనని ఇన్వెస్టర్లలో అనిశ్చితి నెలకొందని పేర్కొన్నారు. చీఫ్‌ పీపుల్‌ అండ్‌ డైవర్సిటీ ఆఫీసర్‌ డలానా బ్రాడ్‌ కూడా మంగళవారం తన లింక్డ్‌ ఇన్‌ పోస్ట్‌లో గతవారమే రాజీనామా చేసినట్లు తెలిపారు. కోర్‌ టెక్నాలజీస్‌ జనరల్‌ మేనేజర్‌ నిక్‌ కాల్డ్‌వెల్‌ తన నిష్క్రమణను ధృవీకరించారు. సోమవారం రాత్రి తన ప్రొఫైల్‌ బయోలో ‘ఫార్మర్‌ ట్విట్టర్‌ ఎగ్జిక్యూటివ్‌’ అని మార్పు చేశారు.

చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ లెస్లై బెర్లాండ్‌, ప్రొడక్ట్‌ హెడ్‌ జయ్‌ సుల్లివన్‌, గ్లోబల్‌ సేల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జీన్‌ ఫిలిప్పే మహేయు కూడా వైదొలిగారని సమాచారం. వీరందరినీ వైదొలగాలని మస్క్‌కోరారా.. వీరే రాజీనామా చేశారా అన్న సంగతి వెల్లడించలేదు. బెర్లాండ్‌ తన ట్విట్టర్‌ పోస్ట్‌లో ‘బ్లూ హర్ట్‌’ గుర్తు పోస్ట్‌ చేశారు. కాల్డ్‌వెల్‌ స్పందించేందుకు నిరాకరించారు. మిగతా ఐదుగురు ఎగ్జిక్యూటివ్‌లు కూడా స్పందించేందుకు అందుబాటులోకి రాలేదు.

కంపెనీ భవితవ్యం గురించి సమాచారం చెప్పడానికి చాలా మంది నిరాకరిస్తున్నారని రాయిటర్స్‌పేర్కొంది. గురువారం జరుగాల్సిన ఆల్‌ స్టాఫ్‌ మీటింగ్‌ రద్దయింది. పలువురు కస్టమర్లు తమ వాణిజ్య ప్రకటనలతోపాటు హానికరమైన కంటెంట్‌ ప్రచురితం అవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఎలన్‌మస్క్‌ డీల్‌ ముగించినప్పటి నుంచి ద్వేషపూరిత సమాచారం పైపైకీ దూసుకెళ్లింది. ఎన్‌-వర్డ్‌ను ట్విట్టర్‌లో 500 శాతం వాడినట్లు నెట్‌వర్క్‌ కాంటాజియన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పేర్కొంది. ఇది సైబర్‌ సోషల్‌ థ్రెట్స్‌కు దారి తీస్తుందని అంచనా వేసింది.

నాక్ప్‌, ఫ్రీ ప్రెస్‌లతోపాటు 40కిపైగా అడ్వొకేసీ సంస్థలకూటమి బహిరంగ లేఖ రాశాయి. కంటెంట్‌లో మార్పులు తెస్తే తమ యాడ్స్‌ తొలగిస్తామని ట్వి్ట్టర్‌ టాప్‌ 20 అడ్వర్టైజర్లు తేల్చి చెప్పారు. ఐపీజీ వంటి యాడ్‌ హోల్డింగ్‌ కంపెనీ యూనిట్‌ మీడియా బ్రాండ్‌.. వచ్చే వారానికి ట్విట్టర్‌లో యాడ్స్‌ను నిలిపేయాలని తమ క్లయింట్లను కోరిందని సమాచారం. వచ్చే వారం ట్విట్టర్‌ విశ్వసనీయత, సేఫ్టీ గురించి తమ ప్రణాళికలు, ఇతర వివరాలు తెలియజేస్తామని తెలిపిందని వినికిడి.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *