కింద పోలీస్ స్టేషన్.. పైన ఇళ్లు.. మోదీ సార్ ప్లాన్ అదుర్స్

ఇక నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న పోలీసులకు ఒకే రకమైన యూనిఫాం ఉండనుందా ? ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో పోలీసులకు భిన్నరకాల యూనిఫాంలు ఉన్నాయి. అయితే ఇది మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. అన్ని రాష్ట్రాల హోం మంత్రులతో నిర్వహిస్తున్న ‘‘చింతన్ శివిర్’’కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ తన అభిప్రాయాన్నివ్యక్తం చేశారు.

దేశ వ్యాప్తంగా పోలీసులకు ఒకే రకమైన యూనిఫాం ఉంటే బాగుంటుందని మోదీ అన్నారు. దేశ వ్యాప్తంగా పోస్ట్ బాక్స్ ను ఎలా గుర్తు పట్టగలమో… అదే విధంగా పోలీస్ యూనిఫాంను కూడా గుర్తించగలిగేలా ఉండాలన్నారు.

హరియాణాలోని ఫరీదాబాద్ లో శుక్రవారం రాష్ట్రాల హోంమంత్రులు, డీజీపీలతో నిర్వహించిన చింతన్ శిబిరంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీస్ స్టేషన్లను బహుళ అంతస్తుల్లో నిర్మించాలని సూచించారు. కింద అంతస్తులో పోలీస్ స్టేషన్ ను నిర్వహించాలని… పై అంతస్తుల్లో పోలీసుల నివాస సముదాయాలు ఉండేలా చూసుకోవాలని చెప్పారు. అప్పుడు పోలీసులు నగరాలకు దూరంగా ఉండటం తగ్గుతుందని తెలిపారు. పాత వాహనాలను పోలీసులు ఉపయోగించకూడదని… ప్రభుత్వ తుక్కు విధానం ప్రాకారం పాత వాహనాల వినియోగానికి దూరంగా ఉండాలని చెప్పారు.

దేశంలో ఉన్నా నక్సలిజాన్ని ఓడించాలని ప్రధాని పిలుపునిచ్చారు. నక్సల్స్ గన్నులు పట్టుకోగలరు, పెన్నులు పట్టుకోగలరని… యువతను పక్కదోవ పట్టించగలరని చెప్పారు. యువత భావోద్వేగాలను వాడుకుని దేశ సమైక్యతను దెబ్బ తీసేందుకు యత్నించేవారిని ఓడించేందుకు మన బలగాలు మేధోశక్తిని పెంచుకోవాలని చెప్పారు. చట్టాలు, రాజ్యాంగం గురించి మాట్లాడుతూ నక్సల్స్ అమాయకపు ముఖం పెడతారని చెప్పారు. భద్రతా దళాలు అటువంటి శక్తులను గుర్తించాలన్నారు.

ప్రతి రాష్ట్రం ఒకదాని నుంచి మరొకటి నేర్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఒక రాష్ట్రం నుంచి మరొకటి స్ఫూర్తిని పొందాలని అలాగే అంతర్గత భద్రత కోసం కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్గత భద్రతతో పాటు దేశం పట్ల బాధ్యతగా రాష్ట్రాలు కలిసి పనిచేయడం రాజ్యాంగపరమైన ఆవశ్యకత అని చెప్పారు. కేంద్రంలో లేదా రాష్ట్రాల్లోని అన్ని ఏజెన్సీలు ఒకదానికొకటి సహకరించుకోవాలని సూచించారు. దీని వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని, సాధారణ ప్రజలకు భద్రత లభిస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. యువతను తీవ్రవాదం వైపు నెట్టడానికి, రాబోయే తరాల మనస్సులను వక్రీకరించడానికి తమ మేధో రంగాన్ని పెంచుతున్న శక్తులపై హెచ్చరించారు. దేశంలోని యువతను తప్పుదోవ పట్టించకుండా నిరోధించేందుకు నక్సలిజం ప్రతి రూపాన్ని తుపాకీలతోనైనా, పెన్నులతోనైనా పెకిలించి వేయాలని అన్నారు.  దేశం ఐక్యత, సమగ్రత కోసం సర్దార్ పటేల్ స్ఫూర్తితో మన దేశంలో అలాంటి శక్తులను విజృంభించడానికి తాము అనుమతించలేమని అన్నారు. అలాంటి శక్తులకు అంతర్జాతీయంగా గణనీయమైన సహాయం లభిస్తోందని చెప్పారు.

శాంతిభద్రతలకు అభివృద్ధితో సంబంధం ఉంటుందని ప్రధాని అన్నారు. అందువల్ల శాంతిభద్రతలను కాపాడుకోవడం అందరి బాధ్యత అని చెప్పారు. దేశ బలం పెరిగినప్పుడే ప్రతీ పౌరుడిలో, ప్రతీ కుటుంబంలో శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. మొత్తం శాంతిభద్రతల వ్యవస్థ విశ్వసనీయంగా ఉండటం చాలా ముఖ్యమని ప్రధాని మోడీ అన్నారు. దీని కోసం సామాన్య ప్రజలతో పోలీసులకు సంబంధాలు, కమ్యూనికేషన్ మెరుగ్గా ఉండాలని తెలిపారు. దీని వల్ల పోలీసులపై ప్రజలకు మంచి అభిప్రాయం ఏర్పడుతుందని మోదీ అన్నారు.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *