వందలో రూ.20 వడ్డీలకే పోతోంది.. పెట్రోల్ సబ్సిడీలో భారీ కోత… బడ్జెట్‌పై పూర్తి విశ్లేషణ ఇలా..

అవస్థాపనా సౌకర్యాల పెంపునకు అవసరమైన చర్యలు చేపట్టడం ద్వారా అధిక ఉపాధి సృష్టి, పెట్టుబడుల ఆకర్షణకు బడ్జెట్‌ ప్రాధాన్యత ఇచ్చింది. రైతులు, మహిళలు, అధిక నికర సంపద కలిగిన వ్యక్తులు..

చిన్న వ్యాపారాలు, మధ్య తరగతి ప్రజలను సంతృప్తి పరిచేలా ఆయావర్గాలకు తాయిళాలు, పథకాలను ప్రకటించడం బడ్జెట్‌లో గమనించవచ్చు. ద్రవ్యలోటు పూడ్చడానికి అవసరమైన 17.8 ట్రిలియన్‌ రూపాయల సమీకరణ ప్రభుత్వానికి సవాలుగా నిలిచే అవకాశం ఉంది.
అమ్రిత్‌కాల్‌ మార్గానికి పటిష్టమైన పునాది
సమ్మిళిత వృద్ధి, చివరిమైలుకు చేరుకోవడం, అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి, సామర్థ్యాన్ని వెలికితీయడం, హరిత వృద్ధి, యువశక్తి ఆర్థిక రంగాన్ని బడ్జెట్‌లో ప్రాధాన్యతలుగా (సప్తర్షి) ఆర్థికమంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావించారు. 2047 సంవత్సరానికి భారత్‌ 100వ స్వాతంత్య్రదినోత్సవాన్ని జరుపుకోబోతున్న నేపథ్యంలో ”అమ్రిత్‌ కాల్‌” అనే పదాన్ని బడ్జెట్‌లో ప్రస్తావించారు. కేంద్ర బడ్జెట్‌ 2023-24ను రాబోవు 25 సంవత్సరాల కాలంలో పయనించే అమ్రిత్‌కాల్‌ మార్గానికి పటిష్టమైన పునాదిగా భావించవచ్చని ప్రభుత్వం భావించింది.

అవకాశాల కల్పనే లక్ష్యం…
పటిష్టమైన పబ్లిక్‌ ఫైనాన్స్, దృఢమైన ఆర్థికరంగంతో కూడిన సాంకేతిక ఆధారిత, నాలెడ్జ్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థనను సృష్టించడం లాంటి లక్ష్యాలతో ప్రభుత్వం అమ్రిత్‌కాల్‌పై దృష్టిసారించింది. యువత తమ ఆకాంక్షలను సాధించుకునే దిశగా దేశ పౌరులకు అవకాశాల కల్పన, అభివృద్ధి సాధన దిశగా ఉపాధి పెంపు, స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడం అమ్రిత్‌కాల్‌ లక్ష్యాలుగా ప్రభుత్వం పేర్కొంది.
రైల్వేలకు రూ.2.4లక్షల కోట్లు….
కేంద్ర బడ్జెట్‌లో రైల్వేమంత్రిత్వశాఖ వ్యయాన్ని రూ.2.4 లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. 2022-23లో పోల్చినప్పుడు 2023-24లో ఈ మొత్తంలో పెరుగుదల 65.6 శాతంకాగా, 2013-14తో పోల్చినప్పుడు 9 రెట్లు అధికం. గత ఏడాదితో పోల్చినప్పుడు ప్రస్తుత బడ్జెట్‌ ప్రతిపాదిత వ్యయంలో పెరుగుదలను వందేభారత్‌ రైళ్ల ఉత్పత్తికి వినియోగిస్తారు. ప్రస్తుతం వందేభారత్‌ రైళ్లను చెన్నై, సోనిపట్, రాయ్‌బరేలీ, లాతూర్‌లో ఉత్పత్తి చేస్తున్నారు. డిశంబర్‌ 2023నాటికి పూర్తిగా హైడ్రోజన్‌ వినియోగంతో నడిచే రైలు సిద్ధమవుతుందని, మొదటిగా కల్కా-సిమ్లాహెరిటేజ్‌ సర్క్యూట్‌ మధ్య ఈ రైలు నడుస్తుందని బడ్జెట్‌లో ప్రస్తావించారు.

భారత్‌ -100 చేరుకోవడానికి ముందుగానే స్వయంసహాయకబృందాల ద్వారా మహిళలతో ఆర్థిక సాధికారత, పి.ఎం.విశ్వకర్మ కౌశల్‌ సమ్మన్, మిషన్‌ నమూనాలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం, హరితవృద్ధిలాంటి నాలుగు పరివర్తన అవకాశాలను అందిపుచ్చుకోవాలని బడ్జెట్‌లో ప్రస్తావించారు.

రూపాయి రాక:
రాష్ట్రాలకు సంబంధించి పన్నులు, డ్యూటీలను కలుపుకుని కేంద్ర ప్రభుత్వ మొత్తం రాబడులలో వస్తు, సేవల పన్ను, ఇతర పన్నుల వాటా 17 శాతం కాగా, కార్పొరేషన్‌ పన్ను 15 శాతం, ఆదాయ పన్ను 15 శాతం, కేంద్ర ఎక్సైజ్‌ డ్యూటీలు 7 శాతం, కస్టమ్స్‌ సుంకాలు 4 శాతం, పన్నేతర రాబడి 6 శాతం, రుణేతర మూలధన రాబడులు 2 శాతం, రుణాలు, ఇతర లియాబిలిటీస్‌ వాటా 34 శాతంగా ఉంటుంది.
రూపాయి పోక ఇలా….
రాష్ట్రాలకు సంబంధించి పన్నులు, డ్యూటీలను కలుపుకుని మొత్తం వ్యయంలో వడ్డీ చెల్లింపుల వాటా 20 శాతం కాగా, కేంద్ర ప్రభుత్వ పథకాలు(రక్షణ, సబ్సిడీలపై మూలధన వ్యయాన్ని మినహాయించి) 17 శాతం, రక్షణ రంగం 8 శాతం, సబ్సిడీలు 7 శాతం, ఫైనాన్స్‌ కమీషన్‌ ఇతర బదిలీలు 9 శాతం, కేంద్ర ప్రభుత్వ పన్నుల రాబడిలో రాష్ట్రాల పన్నులు, డ్యూటీల వాటా 18 శాతం, పెన్షన్‌ 4 శాతం, కేంద్ర ప్రభుత్వ స్పాన్సర్డ్‌ పథకాలు 9 శాతం ఇతర వ్యయం 8 శాతం వాటా కలిగి ఉంటాయి.

రాబడి – వ్యయ అంచనాలు:
2023-24 బడ్జెట్‌లో మొత్తం రాబడులు(రుణాలు మినహాయించి) రూ.27,16,281 కోట్లగా ప్రతిపాదించారు. ఈ మొత్తంలో రెవెన్యూ రాబడులు రూ.26,32,281 కోట్లు. 2022-23 సవరించిన అంచనాలతో పోల్చినప్పుడు 2023-24లో మొత్తం రాబడులలో(రుణాలు మినహాయించి) పెరుగుదల 11.7 శాతం కాగా, రెవెన్యూ రాబడులలో 12.1 శాతం, మూలధన రాబడులలో 0.6 శాతం పెరుగుదలను ప్రతిపాదించారు.

మొత్తం వ్యయం రూ.45,03,097 కోట్లు
2023-24 కేంద్ర బడ్జెట్‌లో మొత్తం వ్యయంను రూ.45,03,097 కోట్లుగా ప్రతిపాదించారు. ఈ మొత్తంలో రెవెన్యూ వ్యయం రూ.35,02,136 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.10,00,961 కోట్లు. 2022-23 సవరించిన అంచనాలతో పోల్చినప్పుడు 2023-24లో మొత్తం వ్యయంలో పెరుగుదల 7.5 శాతం కాగా, రెవెన్యూవ్యయంలో పెరుగుదల 1.2 శాతం, మూలధన వ్యయంలో పెరుగుదల 37.4 శాతం.

2023-24లో రెవెన్యూలోటు స్థూల దేశీయోత్పత్తిలో(జీడీపీ) 2.9 శాతంగా, ద్రవ్యలోటును జీడీపీలో 5.9 శాతంగా, ప్రాథమికలోటును జీడీపీలో 2.3 శాతంగా ప్రతిపాదించారు. 2022-23లో సవరించిన అంచనాల ప్రకారం జీడీపీలో రెవెన్యూలోటు 4.1 శాతం, ద్రవ్యలోటు 6.4శాతం, ప్రాథమిక లోటు 3 శాతంగా నమోదైంది.

సబ్సిడీలపై వ్యయం ఇలా….
సబ్సిడీలపై మొత్తం వ్యయం 2023-24లో రూ.4,03,084 కోట్లుగా అంచనా. 2022-23 సవరించిన అంచనాలతో పోల్చినప్పుడు 2023-24లో ఈ మొత్తంలో తగ్గుదల 28.3 శాతం. ఆహార సబ్సిడీగా రూ.1,97,350 కోట్లు, ఎరువుల సబ్సిడీ రూ.1,75,100 కోట్లు, పెట్రోలియం సబ్సిడీ రూ.2,257 కోట్లు, ఇతర సబ్సిడీల మొత్తాన్ని రూ.28,377 కోట్లుగా ప్రస్తుత బడ్జెట్‌ 2023-24లో ప్రతిపాదించారు.

 

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *