శీతాకాలంలో అరకు అందాలు చూసేందుకు వెళ్లే పర్యాటకుల సంఖ్య ఎక్కువ. ఈ చలికాలంలో కూడా ఆంధ్రా ఊటీ అరకు వెళ్లే పర్యాటకుల సంఖ్య ఎక్కువగానే ఉంది.
పర్యాటకుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఓవైపు భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే32 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది భారతీయ రైల్వే. మరోవైపు ఐఆర్సీటీసీ టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందిస్తోంది. విశాఖపట్నం నుంచి అరకుకు వన్ డే టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. అరకు అందాలతో పాటు, బొర్రా గుహలు ఈ టూర్ ప్యాకేజీలో కవర్ అవుతాయి. విశాఖపట్నం-అరకు రైల్ కమ్ రోడ్ ప్యాకేజీ పేరుతో ప్రతీ రోజు ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోండి.
విశాఖపట్నం-అరకు రైల్ కమ్ రోడ్ ప్యాకేజీ వివరాలివే
విశాఖపట్నం-అరకు రైల్ కమ్ రోడ్ ప్యాకేజీ వన్ డే టూర్ మాత్రమే. ఒక్క రోజులో అరకు అందాలు చూసి రావాలనుకునేవారికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. అరకు వన్ డే టూర్ ప్యాకేజీ ప్రతీ రోజూ అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ విశాఖపట్నంలో ప్రారంభమై విశాఖలో ముగుస్తుంది. వైజాగ్వాసులు, విశాఖపట్నం వచ్చే పర్యాటకులు ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు ఉదయం విశాఖపట్నంలో 18551 నెంబర్ గల రైలు ఎక్కాలి. ఈ రైలు విశాఖపట్నం-అరకు రూట్లో ఉన్న సొరంగాలు, వంతెనల్ని దాటుతూ అరకు వెళ్తుంది. దారిలో పచ్చని అందాలు వీక్షించవచ్చు.
పర్యాటకులు అరకు చేరుకున్న తర్వాత ట్రైబల్ మ్యూజియం, టీ గార్డెన్స్, ధింసా డ్యాన్స్ చూడొచ్చు. అరకులో లంచ్ పూర్తి చేసుకున్న తర్వాత అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూపాయింట్, బొర్రా గుహలు చూడొచ్చు. ఆ తర్వాత విశాఖపట్నం తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. పర్యాటకులు విశాఖపట్నం రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత టూర్ ముగుస్తుంది.
విశాఖపట్నం-అరకు రైల్ కమ్ రోడ్ ప్యాకేజీ ధర చూస్తే ఎగ్జిక్యూటీవ్ క్లాస్ పెద్దలకు రూ.3060, పిల్లలకు రూ.2670, స్లీపర్ క్లాస్ పెద్దలకు రూ.2385, పిల్లలకు రూ.2015, సెకండ్ క్లాస్ పెద్దలకు రూ.2185, పిల్లలకు రూ.1815 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో విశాఖపట్నం నుంచి అరకుకు రైలు ప్రయాణం, నాన్ ఏసీ వాహనంలో లోకల్ సైట్ సీయింగ్, అరకు నుంచి విశాఖపట్నం వరకు బస్సు ప్రయాణం కవర్ అవుతాయి. దీంతో పాటు బ్రేక్ఫాస్ట్, లంచ్, టీ, బొర్రా గుహల్లో ఎంట్రీ ఫీజ్ కూడా కవర్ అవుతాయి.