సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్: ది ఇండియా స్టోరీ” పేరుతో ఆక్స్ఫామ్ తాజా నివేదికను విడుదల చేసింది. దేశంలోని 100 మంది అత్యంత ధనవంతుల సంపద ఏకంగా రూ.54.12 లక్షల కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది.
ఇదే సమయంలో టాప్-10 అత్యంత సంపన్నుల సంపద రూ.27.52 లక్షల కోట్లుగా ఉందని పేర్కొంది. వీరి సంపద 2021 నుంచి 32.8 శాతం పెరిగిందని తెలిపింది.వారి వద్దే సంపద..
2021లో దేశంలోని మెుత్తం సంపదలో 40.6 శాతం కేవలం ఒక్క శాతం మంది ధనికుల వద్దే ఉందని ఆక్స్ఫామ్ తెలిపింది. ఇదే సమయంలో దిగువ ఆదాయ వర్గాలకు చెందిన 50 శాతం మంది ప్రజలు మెుత్తంగా కలిపి దేశంలో కేవలం 3 శాతం సంపదను కలిగి ఉన్నట్లు వెల్లడించింది. ఇది దేశంలో పెరుగుతున్న సంపద అసమానతలకు అద్దం పడుతోందని నివేదిక పేర్కొంది
అసమానతకు కారణం..
సంపద పంపిణీలో అసమానతలు కరోనా మహమ్మారి వల్ల మాత్రమే పెరిగినట్లు ఆక్స్ఫామ్ నివేదిక పేర్కొంది. 2019లో మహమ్మారి తరువాత జనాభాలో దిగువన ఉన్న ఆదాయవర్గాల వారు సంపదను కోల్పోవడాన్ని చూస్తూనే ఉన్నారు. 2020 నాటికి వారి ఆదాయ వాటా జాతీయ ఆదాయంలో కేవలం 13 శాతంగా ఉంది. మహమ్మారి ప్రభావంతో అప్పుల పెరుగుదల, ఆహారం, మరణాలు కారణాలుగా నిలిచినట్లు నివేదిక పేర్కొంది.
అగ్ర కుబేరులు..
దేశంలో అగ్రస్థానంలో ఉన్న టాప్ 10 శాతం మంది వద్ద మెుత్తం 80 శాతం కంటే ఎక్కువ సంపద ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. అగ్రశ్రేణి 5% మంది దాదాపు 62% కలిగి ఉన్నారు. అలాగే అగ్రశ్రేణి 1% మంది దాదాపు 40.6% సంపదను కలిగి ఉన్నారు. ప్రపంచంలో అత్యధికంగా 228.9 మిలియన్ల మంది పేదలు ఉండగా.. భారతదేశంలో మొత్తం బిలియనీర్ల సంఖ్య 2020లో 102 నుంచి 2022 నాటికి 166 పెరిగిందని తేలింది.