విజువల్ సెర్చ్ నవతరాన్ని ఆకర్షిస్తున్నది. మొబైల్ సెర్చింగ్‌లో సగానికి సగం యువత వాయిస్, విజువల్ సెర్చ్‌లనే వినియోగిస్తున్నారు.
వెబ్‌సైట్లకు వ్యూస్ తీసుకురావడం, ఉత్పత్తులను మరింతగా మార్కెట్ చేయడం.. ఇప్పుడంతా విజువల్ సెర్చింగ్‌లోనే! వినియోగదారుడికి, ఉత్పత్తిదారుడికి వారధిగా పనిచేస్తూ నేటితరాన్ని విజువలైజ్ చేస్తున్న దృశ్య శోధన గురించి..
అనన్య ఏదో దినపత్రికలో ఒక హ్యాండ్‌బ్యాగ్ ఫొటో చూసింది. వాస్తవానికి దానిగురించి తనకు ఏమీ తెలియదు. కానీ ఎలాగైనా కనిపెట్టి షాపింగ్ చేయాలని అనుకున్నది. గూగుల్ లెన్స్ ద్వారా ఆ ఫొటో తీసుకున్నది. అంతే, అలాంటివే వందలాది చిత్రాలు కనిపించాయి. రంగు, ఆకారం, పరిమాణం తదితర కోణాల్లో తనకు నచ్చిన హ్యాండ్‌బ్యాగ్‌ను బుక్ చేసుకుంది.
శ్రీకృత్ ‘క్లౌడ్ కంప్యూటింగ్’పై ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చింది. చాలా ప్రయత్నించాడు. టెక్ట్స్ ఆధారిత కీవర్డ్ శోధనలో తనకు కావాల్సిన సమాచారం దొరకలేదు. క్లౌడ్ కంప్యూటింగ్ ఫొటో ద్వారా పింటరెస్ట్‌లో ఒక ప్రయత్నం చేశాడు. విజువల్ సెర్చ్‌లో తను ఆశించిన సమాచారం అందుకోగలిగాడు. మొత్తానికి ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తి చేయగలిగాడు.
ఏది కావాలో అది..
టెక్ట్స్ ఆధారిత కీవర్డ్‌తో సెర్చ్ చేయడం వల్ల అన్నిసార్లూ మనం కోరిన సమాచారం దొరక్కపోవచ్చు. కొన్నిసార్లయితే మనకేం కావాలో వివరించడమూ కష్టమే. ఇంకోటి టెక్ట్స్ శోధనతో పోలిస్తే .. దృశ్య శోధన భిన్నంగా ఉంటుంది. ఇది బొమ్మలపై ఆధారపడి ఉంటుంది. చిత్ర శోధనకు పదాలను ఉపయోగిస్తే దృశ్య శోధనకు చిత్రాన్ని ఉపయోగిస్తాం. అంతే తేడా. ఇమేజ్ సెర్చ్ దాదాపు 20 ఏండ్లుగా ప్రజలకు అందుబాటులో ఉంది. గూగుల్ దీన్ని 2001లోనే ప్రవేశపెట్టింది. ఇమేజ్ సెర్చ్‌లో దొరకని పరిష్కారం విజువల్ సెర్చింగ్ ద్వారా దొరుకుతున్నది. దీనివల్ల మనం వెతుకుతున్న వస్తువుకు దగ్గరగా ఉన్నది లేదా సరిగ్గా అలాంటి వస్తువునే కనుక్కోవచ్చు. దృశ్య శోధనలో ప్రతీది చిత్రం ఆధారంగానే ఉంటుంది.
గూగుల్ లెన్స్
ఇంటరాక్టివ్ శోధన వేగాన్ని పెంచింది గూగుల్ లెన్స్. ఇతర దృశ్య శోధన ప్లాట్‌ఫామ్‌ల కంటే ఎక్కువ ఆదరణ పొందింది. గూగుల్ లెన్స్ ఇ-కామర్స్ స్టోర్‌లు, బ్రాండ్లకు చక్కగా ఉపయోగపడుతుంది. తక్కువ కంటెంట్‌తో ఎక్కువ సమాచారాన్ని శోధించే సాధనంగా దీనిని చెప్పుకోవచ్చు. ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రొడక్ట్ పేజీలకు లింక్ చేసిన చిత్రాలను సూచిస్తుంది.