ఆ డబ్బుతో సెకండ్ హ్యాండ్ సెల్‌ఫోన్ కొన్నాడు. స్టార్టప్‌లు స్టార్ట్ చేసి కోటీశ్వరుడిగా ఎదిగి, ఎంతోమందికి రోల్‌మోడల్ కావడానికి అవసరమైన ప్రయాణం ఈ సెకండ్ హ్యాండ్ సెల్‌ఫోన్ నుంచే మొదలైంది!
కుటుంబ నేపథ్యం :
ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పుర్ అనే చిన్నగ్రామంలో పుట్టి పెరిగాడు సౌరభ్ మౌర్య. పేదరికంలో ఉన్నప్పటికీ తన పిల్లలను అప్పు చేసైనా పెద్ద చదువులు చదివించాలనుకునేవాడు తండ్రి. సౌరభ్ ఇద్దరు అన్నలు చదువులో మందుండేవారు. పై చదువుల కోసం వారిని బెనారస్‌కు పంపాడు తండ్రి. మొదటి ప్రయత్నంలో ఇద్దరు ‘జేఈఈ’లో ఉత్తీర్ణులయ్యారు.
ముగ్గురు పిల్లలు పెద్ద చదువులు చదివి, పెద్ద ఉద్యోగాలు చేయాలని కలలు కనేవారు తల్లిదండ్రులు. అయితే సౌరభ్ పరిస్థితి వేరు. తనకు పెద్ద ఉద్యోగం చేయడం కంటే సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనేది కల. కంప్యూటర్ స్టోర్ అనేది ఆ కలలలో ఒకటి. మొదటి ప్రయత్నంలో ‘జేఈఈ’లో ఫెయిలయ్యాడు సౌరభ్.
‘నేను ఫెయిలయ్యాను అనే బాధ కంటే తల్లిదండ్రులను బాధ పెట్టాను అనే ఆలోచన నన్ను ఎక్కువగా బాధ పెట్టింది’ అంటున్న సౌరభ్ కష్టపడి చదివి రెండో ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. ఐఐటీ-బెనారస్ కాలేజీలోకి వెళ్లిన తరువాత తనకొక కొత్త ప్రపంచం పరిచయం అయింది. తనలాగే ఆలోచించే ఎంతోమందితో పరిచయం ఏర్పడింది. మరో వైపు ఏదైనా సొంతంగా చేయాలనే ఆలోచనలు మనసులో సుడులు తిరుగుతున్నాయి.
నా జేబు ఖర్చుల కోసం..
జేబు ఖర్చుల కోసం 6-8 తరగతులకు ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టాడు. జేబు ఖర్చుల మాట ఎలా ఉన్నా పోను పోను ‘బోధన’ అనేది తనకొక ప్యాషన్‌గా మారింది. తల్లి పంపించిన అయిదువేలతో సెకండ్‌హ్యాండ్ సెల్‌ఫోన్ కొనడంతో తన కెరీర్ మొదలు పెట్టడానికి మొదటి అడుగు పడింది. కొద్దిరోజులకు యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. జేఈఈ పరీక్షలో విఫలమైన తాను రెండో ప్రయత్నంలో ఎలా విజయం సాధించింది మొదలు ఐఐటీకి సంబంధించిన ఎన్నో విషయాలను ఈ యూట్యూబ్ చానల్ ద్వారా చెప్పడం మొదలుపెట్టాడు. ఈ చానల్‌కు మంచి ఆదరణ లభించడంతో సౌరభ్‌లో ఉత్సాహం వెల్లువెత్తింది.
ఈ ఐడీయాతో.. 22 కోట్ల క్లబ్‌లోకి..
నాలుగు సంవత్సరాల అనుభవం తరువాత స్టాక్ మార్కెట్ ట్రేడర్‌గా సక్సెస్ అయ్యాడు. ‘ఐఐటీయన్ ట్రేడర్’ పేరుతో ట్రేడింగ్ స్ట్రాటజీస్, టెక్నికల్ ఎనాలసిస్.. మొదలైన ఆన్లైన్ కోర్సులు ప్రారంభించి సక్సెస్ సాధించాడు. చిన్న వ్యాపారమైనా సరే, సొంతంగా మొదలుపెడితే చాలు అనుకున్న సౌరభ్ 11-12 తరగతుల విద్యార్థులు ‘జేఈఈ’ లక్ష్యాన్ని ఛేదించడానికి అవసరమైన బలమైన పునాదిని ఏర్పాటు చేయడానికి ప్రారంభించిన ‘రైట్-ర్యాంకర్స్’ స్టార్టప్, ఆన్లైన్ స్టాక్‌మార్కెట్ ఎడ్యుకేషన్ స్టార్టప్ ‘ఐఐటీయన్ ట్రేడర్స్’ సక్సెస్ సాధించి తనను 22 కోట్ల క్లబ్‌లోకి చేర్చాయి. ఏదైనా సాధించాలనే పట్టుదల ఉన్నప్పుడు డబ్బు, వనరుల కొరత ఎప్పుడూ అడ్డంకి కాదు. ఒకసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి’ అంటున్నాడు 22 సంవత్సరాల సౌరభ్ మౌర్య.