హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేట్ రాకెట్ తయారీ కంపెనీ ‘స్కైరూట్ ఏరోస్పేస్ ‘ అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించనుంది. భారత్‌లో ఏవియేషన్ రంగంలోనూ కేంద్రం ప్రైవేట్ పెట్టుబడులకు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కి చెందిన స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అనే సంస్థ ఏరోస్పేస్ రంగంలోకి ప్రైవేట్ ప్లేయర్‌గా ప్రవేశించబోతోంది. అప్పర్ స్టేజ్ రాకెట్ ఇంజిన్-రామన్ టెస్టును విజయవంతంగా పూర్తి చేసినట్లు తాజాగా స్కైరూట్ కంపెనీ ప్రకటించింది. భారత్‌లో ఈ మైల్ స్టోన్‌ని చేరిన మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ ప్లేయర్ స్కైరూట్ కావడం గమనార్హం.
భారతదేశంలో ఇప్పటివరకు ఏ ప్రైవేట్ కంపెనీ రాకెట్ కూడా అంతరిక్షంలోకి వెళ్లలేదు. కాగా స్కైరూట్ ఏరోస్పేస్ చెందిన ‘విక్రమ్-ఎస్ ‘ లేదా ‘విక్రమ్-1’ ఆ ఘనత సాధించనుంది. విక్రమ్-ఎస్ రాకెట్ మూడు పేలోడ్స్‌తో ఇస్రో రాకెట్ పోర్ట్ అయిన శ్రీహరికోట నుంచి నవంబర్ 12 నుంచి 16 మధ్య తేదీల్లో నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ తేదీల్లో ఒక తేదీని లాంచింగ్‌కు ఖరారు
చేయనున్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి శాస్త్రవేత్తలు లాంచింగ్ విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు.
స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ తన రాకెట్ మిషన్ పేరును “ప్రారంభ్ ” అని ఎంచుకుంది. ఈ పేరు ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమకు కొత్త శకాన్ని సూచిస్తుంది. ప్రారంభ్ అనేది అంతరిక్షంలో సదరు కంపెనీ తొలి అడుగుకు గుర్తుగా మారుతుంది. “అంతరిక్షంలోకి ప్రయోగించనున్న తొలి ప్రైవేటు రాకెట్ విక్రమ్-ఎస్ సింగిల్-స్టేజ్ సబ్-ఆర్బిటాల్ లాంచ్ వెహికల్” అని ముఖ్య కార్యనిర్వహణ అధికారి, స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు నాగ భరత్ డాకా తెలిపారు. ఈ రాకెట్ మూడు కస్టమర్ పేలోడ్స్‌ను స్పేస్‌లోకి మోసుకెళ్తుంది. కాగా విక్రమ్-ఎస్ రాకెట్ మోసుకెళ్లే కస్టమర్ పేలోడ్స్‌లో ఎవరి శాటిలైట్స్ ఉన్నాయో స్కైరూట్ ఏరోస్పేస్ వెల్లడించలేదు.
విక్రమ్-ఎస్ తర్వాతి విక్రమ్ సిరీస్ స్పేస్ లాంచ్ వెహికల్స్‌లోని మెజారిటీ టెక్నాలజీలను టెస్ట్ చేయడానికి, వెరిఫై చేయడానికి హెల్ప్ అవుతుందని నాగ భరత్ పేర్కొన్నారు. తమ తొలి రాకెట్ ప్రయోగం కోసం శ్రీహరికోటలోని ఇస్రో స్పేస్‌పోర్ట్‌లో ప్రపంచ స్థాయి ప్రయోగ మౌలిక సదుపాయాలను వినియోగించుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ తొలి మిషన్‌తో ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ కంపెనీగా స్కైరూట్ ఏరోస్పేస్ భారతదేశంలో రాకెట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. ఈ ప్రయోగం ప్రైవేట్ రంగ భాగస్వామ్యానికి మార్గం సుగమం చేయనుంది.
మాకున్న టెక్నాలజీ టాలెంట్.. ఇస్రో, ఇన్-స్పేస్ నుంచి మాకు లభించిన అమూల్యమైన మద్దతు వల్లే మేం మా విక్రమ్-ఎస్ రాకెట్ మిషన్‌ను ఇంత తక్కువ సమయంలో బిల్డ్ చేసి మిషన్‌కు రెడీ చేయగలిగాం” అని స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన అన్నారు. స్పేస్ రెగ్యులేటర్ ఇన్-స్పేస్నుంచి టెక్నికల్ లాంచ్ అప్రూవల్ పొందిన తర్వాత, ఇస్రో ఛైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్ స్కైరూట్ ఏరోస్పేస్ తొలి మిషన్‌ను 2022, నవంబర్ 7న బెంగళూరులో ప్రారంభించారు. భారత అంతరిక్ష పితామహుడు, ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ గౌరవార్థం, స్కైరూట్ ప్రయోగ వాహనాలకు “విక్రమ్” అనే పేరును పెట్టారు. మోదీ ప్రభుత్వం జూన్ 2020లో అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ పరిశ్రమ భాగస్వామ్యం కోసం ఓపెన్ చేసింది. ఆ చొరవతో హైదరాబాద్ కంపెనీ ఈ దిశగా అడుగులు వేస్తోంది.