బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు… ఎప్పటినుంచో చెప్పిన కేంద్ర మంత్రి;
1. దేశంలో 5జీ నెట్వర్క్ ఎంపిక చేసిన కొన్ని నగరాల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది.
వీడియోలను అతి తక్కువ సమయంలో డౌన్ లోడ్ చేసుకోవడం, అంతరాయం లేని ఆన్లైన్ స్ట్రీమింగ్ వంటి మరెన్నో సౌకర్యాలను ఈ నెట్వర్క్ ద్వారా పొందవచ్చు. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం సంస్థలు 5జీ సేవలను అందించనున్నాయి.
2. మరి ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) 5జీ సేవలను అందిస్తుందా లేదా అని చాలా మందిలో ఉన్న డౌట్. ఈ విషయంపై కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలను అందించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు.
3. దేశంలో 5జీ సేవలను అందించడంలో మూడు ప్రైవేట్, ఒక పబ్లిక్ టెలికాం కంపెనీలు కీలక పాత్ర పోషిస్తాయని, 5G ప్లాన్లు కూడా సబ్‌స్క్రైబర్స్‌కు అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు. బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం దేశంలో 2G, 3G సేవలను అందిస్తోంది.
4. అదే సమయంలో దేశంలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లోని వినియోగదారులకు బ్రాడ్‌బ్యాండ్ సొల్యూషన్లను కూడా అందిస్తుంది. అయితే ఈ టెల్కో సబ్స్క్రైబర్స్ పెద్ద సంఖ్యలో లేరు. ఇలాంటి పరిస్థితుల్లో 4G, 5G సేవలను అందిస్తే.. టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్ తన స్థానాన్ని తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
5. మార్కెట్లో ఇప్పటికీ బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను అందించడం లేదు. మరోపక్క 5జీ మారడానికి ఎక్కువ సమయం లేదు. దీంతో 5జీలోకి ట్రాన్స్ఫామ్ కావడానికి గవర్నమెంట్ టెల్కోకు ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమవుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానం ఇలా ఇచ్చారు.
6. ‘4G నుంచి 5Gకి మారడం ఎక్కువ కాలం పట్టదు. బీఎస్ఎన్ఎల్ 5G సేవలను నాన్-స్టాండలోన్ ఆర్కిటెక్చర్ (non-standalone architecture) ద్వారా అందించనుంది. దీని ద్వారా కొత్త సెటప్లలో ఎక్కువ పెట్టుబడి పెట్టకుండానే 5G సేవలను అందించడానికి ఇప్పటికే ఉన్న నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగించుకోవచ్చు’ అని వైష్ణవ్ చెప్పుకొచ్చారు.
7. ప్రైవేట్ టెలికాం సంస్థలు 5జీ సేవలను వీలైనంత త్వరలో దేశ వ్యాప్తంగా అందించాలని ప్రణాళికలు వేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా 2024 నాటికి భారతదేశం మొత్తాన్ని తమ 5G నెట్‌వర్క్‌తో కవర్ చేస్తామని ఎయిర్టెల్ పేర్కొంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశంలోని చాలా ప్రాంతాలను 5G సేవలను కవర్ చేయాలని జియో యోచిస్తోంది. ఇక, వొడాఫోన్ ఐడియా 5G లాంచ్ ప్లాన్లను కూడా రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే అవి ఎప్పుటి నుంచి యూజర్లకు లభ్యమవుతాయో అధికారికంగా పేర్కొనలేదు.