విదేశాలను తలపించే పర్యాటక అందాలు మన దేశంలోనూ ఉన్నాయ్!
అందమైన ప్రకృతిని ఆస్వాదించాలని చాలా మందికి ఉంటుంది.అందుకోసం ప్రాచుర్యం పొందిన ప్రదేశాల కోసం నిత్యం అన్వేషిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా మన దేశంలోనే విదేశాల్లో పేరుపొందిన ప్రాంతాలు ఉన్నాయి. అచ్చం విదేశీ పర్యాటక ప్రదేశాలను పోలిన అనుభూతులను ఇక్కడ పొందొచ్చు.
అంతేకాదు, విదేశాలలో ఉన్న ప్రకృతి అందం భారతదేశంలో రెట్టింపు అయినట్లు ఫీలవుతారు. మరెందుకు ఆలస్యం మన దేశంలోనే ఉన్న అలాంటి పర్యాటక ప్రదేశాలలో కొన్నింటిని పలకరిద్దామా!
హిమాచల్ ప్రదేశ్:
స్కాట్లాండ్ అందాలను చూసి, ప్రతి ఒక్కరూ స్కాట్లాండ్ ఒక్కసారైనా వెళ్ళాలి అని ఆశపడతారు. అలాంటివారు ఒక్కసారి హిమాచల్ ప్రదేశ్ వెళ్లి చూడండి. ఎత్తయిన పర్వత శిఖరాలతో మిమ్మల్ని ఆత్మీయంగా పలకరిస్తాయి ఇక్కడి ప్రదేశాలు. చుట్టూ పచ్చదనం కమ్మేసిన ఈ ప్రాంతం నిత్యం పర్యటకులను ఆకర్షిస్తూ ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ వారాంతాల్లో జరిగే స్థానిక మార్కెట్‌లు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. విదేశాల్లో గడిపిన అనుభూతులను ఇక్కడ గడిపే ప్రతిక్షణం ఫీలవుతారు.
కేరళలోని మున్నార్:
మీకు మలేషియా వెళ్లి అక్కడి గార్డెన్స్‌లో టీ తాగాలని కల ఉంటే కేరళలోని మున్నార్ చేరుకోండి. ఎందుకంటే, ఇక్కడే మీ కల నిజమవుతుంది. గుబురుగా పెరిగిన టీ తోటల్లో తాజాగా సేకరించిన తేయాకుల నుంచి పొగలుకక్కే టీ కోసం పర్యాటకులు ఇక్కడకు క్యూ కడతారు. ఆ రుచుల అనుభూతిని మాటల్లో వర్ణించడం కాస్త కష్టమే లేండి. అందుకే కాబోలు సీజన్‌తో సంబంధం లేకుండా మున్నార్ వెళ్లేందుకు ఔత్సాహిక పర్యాటకులు ఉత్సాహం చూపుతారు.
కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్:
చాలా మంది స్విట్జర్లాండ్ వెళ్లాలని కలలు కంటారు. కానీ ఖరీదైన టిక్కెట్ల కారణంగా ఇది సాధ్యం కాకపోవచ్చు. అయితే, మీకు అలాంటి కోరికే ఉంటే, తక్కువ బడ్జెట్‌లో కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌కు వెళ్లండి. అక్కడ అడుగుపెడితే, స్విట్జర్లాండ్‌లో అందాలను ఆస్వాదించినట్లు ఫీలవుతారు. మంచుదుప్పటి కప్పిన ప్రకృతి సోయగాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. కాశ్మీర్‌కు కాకపోతే, హిమాచల్‌లోని ఖజ్జియార్‌లోనూ స్విట్జర్లాండ్ లాంటి అనుభూతిని పొందుతారు.
లడఖ్:
ఆస్ట్రేలియాలోని ఎత్తయిన పర్వతాలను ఆస్వాదించాలని మీ కల అయితే, మీరు ఖచ్చితంగా భారతదేశంలోని లడఖ్‌కు వెళ్లాలి. లడఖ్‌లో ఆస్ట్రేలియాతో సమానమైన అనుభవాలను పొందుతారు. ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా తక్కువ బడ్జెట్‌లో లడఖ్ అందాలను ఆస్వాదించవచ్చు. బైక్ రైడర్స్‌కు ఈ ప్రాంతం స్వర్గధామం లాంటిదనే చెప్పాలి. ఒంపులు తిరిగే ఇక్కడి పర్వత మార్గాలలో ప్రయాణం చాలా ప్రమాదకం. అయినప్పటికీ ఈ రైడ్‌లను బైకర్స్ ఎంజాయ్ చేస్తారు. బృందాలుగా ఇక్కడికి చేరుకునే రైడర్స్ నిత్యం ఇక్కడ తారసపడతారు.
అండమాన్:
మీరు స్పెయిన్ వెళ్లి సముద్రపు లోతులలో చేపలు మరియు ఇతర ఈత జీవుల అందాలను చూడాలనుకుంటున్నారా? భారతదేశంలోని అండమాన్‌కి వెళ్లడం ద్వారా మీరు దీన్ని ఆస్వాదించవచ్చు. ఎన్నో ప్రకృతిసిద్ధమైన తీర ప్రాంతాలు చాలా ఉన్నాయి. సముద్రపు లోతులలో నీటి జీవులను ఆస్వాదించేందుకు ఇది అనువైన ప్రదేశం. ఇక్కడి పగడపు దీవుల్లో విహారం జీవితంలో మర్చిపోలేని అనుభవమనే చెప్పాలి. విదేశాలలో ఉన్నట్లు కాకుండా పరిమితులు లేని ప్రయాణం అండమాన్ సొంతం.