ఇండియాలో చాలా మంది విద్యార్థులకు ఐఐటీ కల ఉంటుంది. ఐఐటీ ఇన్స్టిట్యూట్లలో సీటు సంపాదించడానికి సంవత్సరాలపాటు కష్టపడుతారు.
ఐఐటీలో అడుగుపెడితే బంగారు భవిష్యత్తు సొంతమవుతుందని భావిస్తారు. కానీ ఇందుకు గౌరవ్ యాదవ్ పూర్తిగా విభిన్నం. తన ఉన్నతమైన ఆశయం కోసం ఐఐటీ సీటును వదులుకున్నాడు. అయితేనేం అనేక సవాళ్లను దాటి బుధవారం జరిగిన ఎన్డిఏ పాసింగ్ అవుట్ పరేడ్‌లో స్టార్‌గా నిలిచాడు. తన కలను నిజం చేసుకున్నాడు. ఈ ఎన్డీఏ క్యాడెట్‌కు సంబంధించిన
కథనాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాజస్థాన్, అల్వార్‌లోని ఓ రైతు కుటుంబానికి చెందిన గౌరవ్ యాదవ్ ఐఐటీ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించాడు. సాధారణంగా ఇంకొకరైతే ఎగిరి గంతేసి.. పది మందితో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటారు. కానీ ఐఐటీ ఎంట్రన్స్ క్లియర్ చేసిన విషయాన్ని గౌరవ్ యాదవ్ తన సొంత కుటుంబానికి కూడా చెప్పలేదు. ఆర్మీలో చేరాలనే తన కలను నిజం చేసుకునేందుకు.. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) ఎగ్జామ్ ప్రిపరేషన్లో మునిగిపోయాడు.
రాష్ట్రపతి గోల్డ్ మెడల్ అందుకున్న గౌరవ్
పూణేలోని ఖడక్వాస్లాలోని ఖేత్రపాల్ పరేడ్ గ్రౌండ్లో 143వ కోర్సుకు సంబంధించిన ఎన్డీఏ పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ పరేడ్‌ను సమీక్షించారు. ఎన్డిఏ పాసింగ్ అవుట్ పరేడ్‌లో గౌరవ్ యాదవ్ ఒక స్టార్. అతను రాష్ట్రపతి గోల్డ్ మెడల్‌ను అందుకున్నాడు. అంతే కాకుండా పరేడ్‌ను కూడా లీడ్ చేశాడు. అతను ఎన్నడూ ఊహించని గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు.
రెండుసార్లు ఎన్డిఏ ఇంటర్వ్యూలో విఫలం
భారత సైన్యం, నేవీ, వైమానిక దళంలో చేరాలనుకునే అభ్యర్థులు ఎన్డిఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. పరీక్షలో అర్హత సాధించిన తర్వాత.. ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఉంటాయి. ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత ఎన్డీఏలో మూడేళ్లు ట్రైనింగ్ ఉంటుంది. గౌరవ్ యాదవ్ తన కలను సాకారం చేసుకునే క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. రెండుసార్లు ఎన్డిఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు కానీ ఇంటర్వ్యూ రౌండ్లలో విజయం సాధించలేకపోయాడు. అతను చివరకు అకాడమీకి చేరుకున్నప్పుడు, కఠినమైన ట్రైనింగ్ ఒత్తిళ్లను అధిగమించడానికి చాలా కష్టపడ్డాడు.
చాలా గర్వంగా ఉంది: కుటుంబ సభ్యులు
గౌరవ్ యాదవ్ గురించి ఆర్మీలోనే ఉన్న అతని సోదరుడు వినీత్ యాదవ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడారు. గౌరవ్ యాదవ్ మానసిక ఆరోగ్యం గురించి ఆందోళన చెందానని చెప్పారు. అయితే ఇప్పుడు అతను సాధించిన అసాధారణ విజయానికి గర్వపడుతున్నానని అన్నారు. ఇది యాదవ్ సైనిక వృత్తికి అద్భుతమైన ప్రారంభమని తెలిపారు. గౌరవ్ యాదవ్ ఎన్డీఏ కవాతుకు నాయకత్వం వహించడంపై అతని తల్లిదండ్రులు బల్వంత్, కమలేష్ హర్షం వ్యక్తం చేశారు. గౌరవ్ యాదవ్ విజయం సాధిస్తాడనే నమ్మకం ఎప్పుడూ ఉండేదని, అతను ఇష్టపడేదాన్ని చేయకుండా ఎప్పుడూ ఆపలేదని తెలిపారు.
ట్రౌనింగ్ పూర్తి చేసిన 300 మంది
అవుట్గోయింగ్ బ్యాచ్‌లోని 300 మంది క్యాడెట్లలో 207 మంది ఆర్మీ క్యాడెట్లు, 54 మంది వైమానిక దళం, 39 మంది నావికాదళానికి చెందినవారు ఉన్నారు. యాదవ్, ఇతర క్యాడెట్లు ఇప్పుడు ఒక సంవత్సరం ప్రీ-కమిషనింగ్ ట్రైనింగ్ తీసుకుంటారు. సైన్యంలో చేరాలనుకునే వారు ఉత్తరాఖండ్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో శిక్షణ పొందుతారు. నావల్, ఎయిర్ ఫోర్స్ శిక్షణ కోసం, క్యాడెట్లు కేరళలోని ఇండియన్ నేవల్ అకాడమీ, తెలంగాణలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీకి వెళ్తారు.