తాగివచ్చి నిత్యం వేధిస్తున్నాడంటూ.. భర్తను ఓ మహిళ హతమార్చింది. అయితే జారిపడి తలకు గాయమైందని అంతకుముందు కథ అల్లింది.
భర్త ఉద్యోగం తనకు కావాలని.. చంపేసిన భార్య
భర్త వేధింపులతో ఆ ఇల్లాలు విసిగిపోయింది. ఇక భరించే ఓపిక లేక ఏదో ఒకటి చేాయాలనుకుంది. భర్తను చంపితే.. వేధింపులు తప్పడంతో పాటు, కారుణ్య నియామకం కింద భర్త ఉద్యోగం తనకు దక్కుతుందని ఆశ పడింది. ప్లాన్ ప్రకారమే అతడిని హతమార్చింది. జారిపడి తలకు గాయమైందని కట్టుకథ అల్లింది. కానీ, తండ్రి మృతిపై అనుమానం వచ్చి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.
పోలీసుల విచారణలో అసలు విషయం వెల్లడైంది. వేధింపులు తప్పడంతో పాటు, కారుణ్య నియామకం కింద భర్త ఉద్యోగం తనకు దక్కుతుందన్న ఆలోచనతో హత్య చేసినట్లు అంగీకరించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలను చుంచుపల్లి ఎస్సై కె.సుమన్ బుధవారం వెల్లడించారు. ఇక్కడి గాంధీకాలనీకి చెందిన కొమ్మరబోయిన శ్రీనివాస్(50) కొత్తగూడెం కలెక్టరేట్లో అటెండర్‌గా పనిచేస్తున్నారు.
గత నెల 29న అర్ధరాత్రి ఆయన వంటింట్లో జారిపడ్డాడని, తలకు తీవ్ర గాయమైందని భార్య సీతామహాలక్ష్మి (43) మర్నాడు ఉదయం కొత్తగూడెంలోని జిల్లా ఆసుపత్రిలో చేర్పించింది. కొద్దిగంటల చికిత్స అనంతరం ఆయన మృతి చెందాడు. తండ్రి మృతిపై అనుమానం ఉన్నట్లు కుమారుడు సాయికుమార్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. భర్తను ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత కనిపించకుండా పోయిన సీతామహాలక్ష్మిపై నిఘా పెట్టారు.
మంగళవారం రాత్రి హైదరాబాద్ వెళ్లేందుకు ఆమె కొత్తగూడెం రైల్వేస్టేషన్‌కు రాగా అదుపులోకి తీసుకుని విచారించారు. ”ఆ రోజు నా భర్త తాగిన మైకంలో ఇంటికొచ్చాడు. నిద్రలోకి జారుకున్నాక కర్రతో తలపై కొట్టా. వంటగదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టా.” అని నిందితురాలు అంగీకరించినట్లు ఎస్సై తెలిపారు.