తప్పు ఎవరిది? శిక్ష ఎవరికి?.. రాష్ట్రంలో ఇంటర్​ విద్యార్థుల పరిస్థితి!

తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరు అనుభవిస్తున్నట్లు తయారైంది రాష్ట్రంలోని ఇంటర్మీడియట్‌ విద్యార్థుల పరిస్థితి.

కొన్ని ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల నిర్లక్ష్యం, నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వ జాప్యం ఫలితంగా లక్షన్నర మంది ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ విద్యార్థులు పరీక్ష ఫీజుకు అదనంగా రూ.వెయ్యి చొప్పున ఆలస్య రుసుం చెల్లించాల్సి వస్తోంది

ప్రైవేటు కళాశాలల నిర్లక్ష్యం.. ప్రభుత్వ నిర్ణయంలో అలసత్వంతో ఇంటర్​ విద్యార్థులకు శాపంగా మారింది. గృహ, వాణిజ్య సముదాయాల్లో కొనసాగుతున్న కళాశాలలు అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర ధ్రువపత్రం(ఎన్‌ఓసీ) పొందకుండా ఈసారికి మినహాయింపు ఇవ్వాలని నెలలుగా కోరుతున్నాయి.. నిర్ణయంపై నాన్చుడుధోరణితో ఉన్న ప్రభుత్వం చివరకు విద్యార్థులు పరీక్షఫీజు కట్టే గడువు ముగిశాక మినహాయింపునకు అనుమతి ఇవ్వడంతో విద్యార్థులపై రూ.15 కోట్ల వరకు అదనపు భారం పడుతోంది.

డిసెంబరు 22 నుంచి ఆలస్య రుసుం: గృహ, వాణిజ్య సముదాయాల్లో కొనసాగుతున్న ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలకు భవనం ఎత్తుతో సంబంధం లేకుండా అగ్నిమాపక శాఖ ఎన్‌ఓసీ తప్పనిసరి. ఆ మేరకు 2020 సెప్టెంబరు 24న హోం శాఖ జీఓ 29 జారీ చేసింది. ఎన్‌ఓసీ సమర్పిస్తేనే బోర్డు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్‌) జారీచేస్తుంది. అప్పుడే విద్యార్థులు వార్షిక పరీక్షల ఫీజు చెల్లించడానికి వీలవుతుంది. లేకుంటే ఆ కళాశాలలకు బోర్డు వెబ్‌సైట్‌ లాగిన్‌ కాదు. కరోనా నేపథ్యంలో 2020-21, 2021-22 విద్యా సంవత్సరాలకు ఆ జీఓ అమలులో మినహాయింపు ఇచ్చారు. మరో రెండేళ్లపాటు జీఓ 29ని అమలు చేయవద్దని ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రభుత్వానికి ఆరేడు నెలల నుంచి విన్నవిస్తూ వచ్చింది. చివరకు ప్రస్తుత విద్యా సంవత్సరంతో పాటు వచ్చే ఏడాది (2023-24)కి కూడా జీఓ 29 అమలు నిలిపివేస్తూ డిసెంబరు 23న ప్రభుత్వం జీఓ 72 జారీ చేసింది.

అయితే వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు సాధారణ గడువు డిసెంబరు 21తో ముగిసింది. అదే నెల 22 నుంచి రూ.వెయ్యి ఆలస్య రుసుంతో పరీక్ష ఫీజు చెల్లించే గడువు మొదలైంది. దీంతో గృహ, వాణిజ్య సముదాయాల్లో నడుస్తున్న 346 కళాశాలల్లోని లక్షన్నర మంది విద్యార్థులు అదనంగా రూ.వెయ్యి చెల్లించాల్సి వస్తోంది. మిక్స్‌డ్‌ ఆక్యుపెన్సీ కళాశాలలకు అనుమతి ఇవ్వరాదనుకుంటే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఇంటర్‌ బోర్డు ప్రకటించాలి. లేదంటే.. పరీక్ష ఫీజు గడువునకు ముందుగానే వాటికి అనుమతి ఇవ్వాలి. గడువు ముగిశాక అనుమతులు ఇచ్చిన సందర్భంలో.. అపరాధ రుసుమును కళాశాలల యాజమాన్యాలే చెల్లించాలన్న నిబంధన విధించకుండా.. విద్యార్థులపై భారం మోపడం సరికాదని తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్థుల తప్పు లేనందున ఆలస్య రుసుం వసూలు చేయడం భావ్యం కాదని ఇంటర్‌ విద్య ఐకాస ఛైర్మన్‌ డాక్టర్‌ పి.మధుసూదన్‌రెడ్డి ‘ఈనాడు’తో అన్నారు.

27 ఇంటర్‌ కళాశాలలకు దక్కని అనుమతి: ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలకు రూ.వెయ్యి ఆలస్య రుసుంతో చెల్లించే ఫీజు గడువు శుక్రవారంతో ముగియనుంది. అయినా ఇప్పటి వరకు 27 ప్రైవేట్‌ కళాశాలలకు అనుబంధ గుర్తింపు దక్కలేదు. భవనాల లీజు గడువు ముగియడంతోపాటు మరికొన్ని కారణాల వల్ల ఇంటర్‌బోర్డు వాటికి అనుమతి ఇవ్వలేదని తెలిసింది. ఆ కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ విద్యార్థులు సుమారు 5 వేల మంది ఉన్నారు. ఫీజు చెల్లించకుంటే వారు పరీక్ష రాయడానికి అనర్హులు.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *