పట్టుదలతో చదివి ఇంటర్ పూర్తికాగానే జూనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. కూలి పనులు చేసుకుంటూ ఐపీఎస్‌కు ఎంపికైన బాలస్వామి సక్సెస్ జర్నీ సాగిందిలా….
రెండేళ్లు జాబ్ చేసి… ఆపై పై చదువులు
నిరుపేద కుటుంబానికి బాలస్వామి జాబ్ ఓ పెద్ద ఊరటగా నిలిచింది. ఓ రెండేళ్లు కొలువు చేసిన తర్వాత ఆర్థికంగా కొంచెం మెరుగుపడ్డాక పెద్ద చదువులు చదవాలనే కోరిక బాలస్వామికి మెదిలింది. దీంతో జాబ్ వదిలేసి హైదరాబాద్ వచ్చేశాడు. పని చేయకపోతే ఇల్లు గడవని పరిస్థితి. ఒకవైపు కూలి పనులకు వెళ్తూనే దూరవిద్యలో చేరాడు. డిగ్రీ, పీజీ పూర్తి చేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా జాయిన్ అయ్యాడు.
ఉస్మానియా మార్చింది
ఓయూకి వచ్చేదాకా బాలస్వామికి సమాజంపై అవగాహన లేదు. కాలేజీకి వెళ్లడం, పాఠాలు చెప్పడం.. ఇదే జీవితం. అదే సమయంలో చాలా పేద కుటుంబం నుంచి వచ్చి, ఎన్నో కష్టాలు పడి సివిల్స్ సాధించిన వారి సక్సెస్ స్టోరీలు అతడ్ని కదిలించాయి. సరికొత్త సంస్కరణలతో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఐఏఎస్, ఐపీఎస్‌ల గురించి చదివి స్ఫూర్తి పొందాడు. సివిల్ సర్వెంట్ అయితే ప్రజలతో నేరుగా సంబంధాలు నెరపొచ్చు. పేదల జీవితాల్లో మార్పు తీసుకురావొచ్చు అని అర్థమైంది. సివిల్స్ సాధించడమే లక్ష్యంగా మారింది.
నాలుగో సారి ఐఆర్ఎస్….
సివిల్స్ సాధించాలనే తపనతో బాలస్వామి సొంతంగా ప్రిపరేషన్ ప్రారంభించాడు. ఉదయం పిల్లలకు పాఠాలు బోధించడం, సాయంత్రం గ్రంథాలయానికి వెళ్లి చదవడం. సివిల్స్ నోటిఫికేషన్ వెలువడగానే అప్లై చేసి, పరీక్షకు సన్నద్ధమవడం. ఇదే అతని దినచర్చ. వరుసగా మూడుసార్లు నిరాశే ఎదురైంది. ‘తెలుగు మీడియం, పెద్దగా కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు.. నేను సివిల్స్ సాధించగలనా?’ అనే నిస్పృహ ఆవరిస్తూ ఉండేది. మళ్లీ తనకు ఇన్ఫిరేషన్‌గా నిలిచే వారి స్ఫూర్తిదాయక కథనాలు చదివి… మళ్లీ రెట్టించిన పట్టుదలతో పుస్తకం అందుకునేవాడు.
ఆరోసారి ఐపీఎస్….
ఎలాంటి తప్పులకు తావివ్వకుండా పరీక్షకు సిద్ధమవడంతో నాలుగో ప్రయత్నంలో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్)కు ఎంపికయ్యాడు. కానీ బాలస్వామిది సర్దుకుపోయే మనస్తత్వం కాదు. తన లక్ష్యం ఐఏఎస్, ఐపీఎస్. ఆరో ప్రయత్నంలో 2018 బ్యాచ్ యూపీఎస్సీ ఫలితాల్లో ఐపీఎస్‌గా ఎంపికయ్యాడు. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత 2020లో తెలంగాణలోని మెదక్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్‌గా నియమితులయ్యారు.
చిన్ననాటి కల ఐపీఎస్…
శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత బాలస్వామి సాక్షితో మాట్లాడుతూ … ” చిన్నప్పటి నుంచి ఐపీఎస్ నా కల. మాది మహబూబ్‌నగర్‌లో చిన్న వ్యవసాయ కుటుంబం. ఇంటర్‌లోనే జాబ్ రావడంతో చేరాను. అయినా కల మీద మమ కారంతో దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేశా. తరువాత ఓయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరా. నిజాం కాలేజీలోనూ పాఠాలు బోధించా. అంతిమంగా ఐపీఎస్‌గా ఎంపికయ్యా ” అని చెప్పారు.