1600 మందికి పైగా మృతి ప్రకృతి ప్రకోపానికి తుర్కియే , సిరియా దేశాలు అల్లకల్లోలమయ్యాయి. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం పెను విలయం సృష్టించింది. భూకంప తీవ్రతకు వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. అనేక నగరాలు మరుభూమిని తలపిస్తున్నాయి. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు దేశాల్లో 1600 మందికి పైగా దుర్మరణం చెందగా.. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
తుర్కియే కాలమానం ప్రకారం.. తెల్లవారుజామున 4.17 గంటలకు ఈ భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 7.8గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఆగ్నేయ తుర్కియేలోని గాజియాన్‌తెప్ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. దీంతో దక్షిణ తుర్కియే, ఉత్తర సిరియాలోని పలు ప్రాంతాల్లో భూకంపం తీవ్ర ప్రభావం చూపించింది. తుర్కియేలోని దియర్‌బకీర్, సిరియాలోని అలెప్పో, హమా నగరాల్లో వందలాది భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. 7.8 తీవ్రతతో తొలి భూకంపం సంభవించిన తర్వాత గంటల వ్యవధిలో మరో 20 సార్లు శక్తిమంతమైన భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రమాద తీవ్రతగా ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
భారీగా మరణాలు..
తెల్లవారుజామున ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ విలయం చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తుర్కియేలో మొత్తం 10 ప్రావిన్సుల్లో భూకంపం విలయం సృష్టించగా.. ఇప్పటివరకు 912 మంది మరణించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. 5300 మందికి పైగా గాయపడినట్లు తెలిపారు. భూకంప తీవ్రతకు తుర్కియేలో దాదాపు 3వేల భవనాలు ధ్వంసమయ్యాయి.
ఇక సిరియా లోని ప్రభుత్వ నియంత్రణ ఉన్న ప్రాంతాల్లో 237 మంది మరణించినట్లు సిరియా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మరో 639 మంది గాయపడినట్లు తెలిపింది. కాగా.. రెబల్స్ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో కనీసం 450 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. భవనాల శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మోదీ దిగ్భ్రాంతి..
భూకంప విలయంపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆయా దేశాలకు అండగా ఉంటామని తెలిపారు. ఆ దేశాలకు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మోదీ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అటు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కూడా విచారం వ్యక్తం చేశారు.
సాయానికి ముందుకొస్తున్న ప్రపంచ దేశాలు..
తుర్కియే, సిరియా దేశాల్లో ప్రకృతి వైపరీత్యానికి యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆ దేశాలకు ఆపన్నహస్తం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. భారత్ సహా నెదర్లాండ్స్, గ్రీస్, సెర్బియా, స్వీడన్, ఫ్రాన్స్ తదితర దేశాలు సహాయక సామగ్రి, ఔషధాలు వంటివి పంపిస్తామని హామీ ఇచ్చాయి.