పండుగలు వచ్చినప్పుడు ఇ-కామర్స్ సైట్లకు ప్రజలు గుర్తుకురావడం సహజం. ఒక్క దసరా, దీపావళి అనే కాదు.. ఏ పండుగ వచ్చినా ఆఫర్లు దర్శనమిస్తుంటాయి.
ఫలానా ఉత్పత్తులపై 50 శాతం తగ్గింపు.. ఫలానా ప్రొడక్ట్స్ పై 70 శాతం వరకు డిస్కౌంట్ అంటూ ఆఫర్లతో వినియోగదారుల్ని ఊరిస్తుంటాయి. సాధారణంగా ఈ సేల్స్ లో చాలా వరకు ఉత్పత్తులను తగ్గింపు ధరకే అందిస్తున్నా, కొన్నింటిపై మాత్రం పెద్దగా తగ్గింపు ఉండదు. కానీ వాటినీ తక్కువకే ఇస్తున్నామని ఆయా సంస్థలు ప్రకటించడంతో.. తక్కువ ధరకే కొన్నామని కొనుగోలుదారులు సంబరపడుతుంటారు. కానీ, అక్కడ జరిగే వాస్తవం వేరు. అదెలాగో చూద్దాం..
గతేడాది ప్రారంభంలో ఓ దిగ్గజ కంపెనీ నుంచి హైఎండ్ మొబైల్ విడుదలయ్యింది అనుకుందాం.. అప్పట్లో దాని ధర రూ. 60 వేలు అనుకోండి. అయితే, దాన్ని తాజా సేల్ లో రూ.30వేలకే విక్రయిస్తామని చెబుతుంటాయి.. ఇ-కామర్స్ కంపెనీలు. వాస్తవానికి ఆ ఫోన్ గతేడాది ప్రారంభంలో విడుదలయ్యింది కనుక.. ఓ మూడు నెలల కిందటే దాని ధర తగ్గించి ఉండొచ్చు. ఒకవేళ మీరు ఈ సేల్ లో ఆ ఫోన్ ను కొనుగోలు చేస్తే.. తక్కువకు ధరకు కొనుగోలు చేశామన్న సంతోషమే తప్ప వాస్తవంగా మీరు డిస్కౌంట్ లో కొన్నట్లు కాదు. అందువలన ఏదైనా వస్తువును కొనుగోలు చేసే ముందు దాని ప్రెస్ హిస్టరీ తెలుసుకోవడం మంచిది. మరి, ప్రైస్ హిస్టరీ ఎలా
తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ఒక వస్తువు యొక్క ప్రైస్ హిస్టరీ తెలుసుకోండిలా..
మీరు కొనాలనుకుంటున్న వస్తువు యొక్క ప్రెస్ హిస్టరీని సులువుగానే తెలుసుకోవచ్చు. కాకుంటే.. ఇందుకోసం ఎక్స్టెన్షన్ ను వాడాల్సి ఉంటుంది. ఇవి ఆయా ఇ-కామర్స్ సైట్లకు వేరు వేరుగా ఉంటాయి. ఒకసారి ఈ ఎక్స్టెన్షన్ ను మీ బ్రౌజర్ కు యాడ్ చేశాక.. సైట్ ఓపెన్ చేసినప్పుడు ఆ ప్రొడక్ట్ కింద ఆ వస్తువు ప్రెస్ హిస్టరీ తెలుసుకోవచ్చు. అయితే, డెస్క్ టాప్/ల్యాప్ టాప్ లో మాత్రమే హిస్టరీ తెలుసుకునే వీలుంటుంది.
ఫ్లిప్ కార్ట్ లో ప్రైస్ హిస్టరీ తెలుసుకోవడం..
ఫ్లిప్ కార్ట్ లో ఒక వస్తువు యొక్క ప్రెస్ హిస్టరీ తెలుసుకోవాలంటే.. ప్రైస్ ట్రాకర్ (Price.tracker) అనే ఎక్స్టెన్షన్ ఉపయోగించాల్సి ఉంటుంది. గూగుల్ క్రోమ్ యూజర్లు దీన్ని వాడుకోవచ్చు. ఒకసారి ఎక్స్టెన్షన్ యాడ్ చేశాక.. సైన్ ఇన్ అయ్యి మీకు కావాల్సిన వస్తువు ప్రెస్ హిస్టరీని తెలుసుకోవచ్చు. ఏయే రోజు ఎంత ధరతో అందుబాటులో ఉన్నది అన్న వివరాలు గ్రాఫ్ రెప్రెసెంటేషన్ లో కనిపిస్తాయి.
అమెజాన్ లో ప్రైస్ హిస్టరీ తెలుసుకోవడం..
అమెజాన్ లో ఒక వస్తువు యొక్క ప్రెస్ హిస్టరీ తెలుసుకోవాలంటే.. కీపా (keepa) అనే ఎక్స్టెన్షన్ ఉపయోగించాల్సి ఉంటుంది. మొజిల్లా ఫైర్ ఫాక్స్, గూగుల్ క్రోమ్ బ్రౌజర్లకు ఈ ఎక్స్టెన్షన్ అందుబాటులో ఉంది. వీటిని ఒకసారి మీ బ్రౌజర కు యాడ్ చేసిన తర్వాత.. సదరు ప్రొడక్ట్ ను ఓపెన్ చేసినప్పుడు.. దిగువ భాగంలో ఓ ఛార్జ్ దర్శనమిస్తుంది. అందులో ఏ రోజు ఎంతెంత ధర ఉందో తెలుసుకోవచ్చు.
ఈ రెండూ కాకుండా ప్రైస్ హిస్టరీ. కామ్ అనే వెబ్ సైట్ ద్వారా కూడా ప్రెస్ హిస్టరీ తెలుసుకోవచ్చు. ఆ వెబ్ సైట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వస్తువు లింక్ ను అక్కడి సెర్చ్ బాక్స్ లో వేస్తే.. అక్కడ గతంలోని ధరల వివరాలు దర్శనమిస్తాయి. ఈ విధంగా ధరలను తెలుసుకోవడం ద్వారా, అసలు ధర ఎప్పుడు, ఎలా ఉంది? ఈ సేల్ లో నిజంగానే ఆఫర్ ఉందా? అన్న విషయాలపై అవగాహన పెంచుకోవచ్చు.