ఈ రోజుల్లో టెక్నాలజీ ని సరైన పద్ధతుల్లో వాడేవారి కంటే అక్రమాల కోసం వాడుకునే వారే ఎక్కువగా ఉన్నారు. దీనిపై ఎప్పటి నుంచో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఆర్టిఫిషియల్ టూల్ చాట్ జిజిపిటి వాడకంపై ఇదే తరహా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కామన్ ట్యుటోరియల్స్, ల్యాబ్ సెషన్లకు చాట్ జిజిపిటి ని ఉపయోగించటంపై గతంలోనే ఆందోళనలు వ్యక్తం చేసిన విద్యా సంస్థలు, ఇప్పుడు దీన్ని బ్లాక్ చేసేందుకు కూడా వెనుకాడట్లేదు. తాజాగా బెంగళూరులోని ఆర్వీ యూనివర్సిటీ తమ క్యాంపస్‌లో చాట్ జిజిపిటి ని బ్యాన్ చేసింది. పరీక్షలు, ల్యాబ్ ఎగ్జామ్స్, అసైన్‌మెంట్స్ సహా ఎడ్యుకేషన్ సంబంధిత కార్యకలాపాల్లో దీన్ని ఉపయోగించవద్దని విద్యార్థులను ఆదేశించింది.
చాట్ జిజిపిటి అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్-జనరేటింగ్ యాప్. ఓపెన్ ఏఐ ద్వారా డెవలప్ అయిన ఈఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విద్యార్థులు దీన్ని మిస్ యూజ్ చేస్తున్నారని ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
విద్యార్థులు మెదడుకు పని చెప్పటం మానేసి ఈ ఛాట్‌జీపీటీతోనే అసైన్‌మెంట్లు చేస్తున్నట్లు గుర్తించారు. అసైన్‌మెంట్‌లు, ల్యాబ్ పరీక్షలు, ఆన్‌లైన్ పరీక్షల్లో కాపీయింగ్‌కు దీన్ని ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ కాపీయింగ్‌ను నిరోధించేందుకు బెంగళూరులోని చాలా కాలేజీలు ఛాట్‌జీపీటీని బ్యాన్ చేశాయి.
* ఆర్వీ యూనివర్సిటీ నిర్ణయం
బెంగళూరులోని ఆర్వీ యూనివర్సిటీ ఛాట్‌జీపీటీని నిషేధించింది. వర్సిటీ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డీన్ జారీ చేసిన అధికారిక నోటీస్ ప్రకారం.. ఇకపై విద్యార్థులు చేతితో రాసిన అసైన్‌మెంట్స్‌నే సమర్పించాలని ఆదేశించారు. ఇందులో కూడా కాపీయింగ్ ఉన్నట్లు తెలిస్తే ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు. విద్యార్థులే స్వయంగా కంటెంట్‌ను రూపొందిస్తే ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు.
అన్ని డిపార్ట్‌మెంట్స్‌కి ఈ ఆదేశాలను జారీ చేసినట్లు వర్సిటీ ప్రకటించింది. చాట్జిజిపిటి నే గాకుండా అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగాన్ని నిషేధించినట్లు స్పష్టం చేసింది. అసైన్‌మెంట్స్ పూర్తి చేసేందుకు వీటిని ఉపయోగించకుండా చేయటమే తమ లక్ష్యమని అధికారులు ప్రకటించారు. చాట్ జిజిపిటి తోపాటు గిట్ హబ్, కో-పైలట్, బ్లాక్ బాక్స్ వంటి ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్‌పై కూడా ఈ నిషేధం ఉందని స్పష్టం చేశారు.
* ఇదే బాటలో మరి కొన్ని కాలేజీలు
ఆర్వీ వర్సిటీ, దయానంద సాగర్ యూనివర్సిటీ, క్రైస్ట్ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – బెంగళూరు సహా చాలా విద్యాసంస్థలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ వినియోగం దుర్వినియోగాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. దయానంద సాగర్ వర్సిటీ అధికారులైతే ఏకంగా మరో అడుగు ముందుకు వేశారు. ఏఐ యాప్స్ వినియోగం పూర్తిస్థాయిలో నిషేధించే అవకాశం లేదు కాబట్టి ఈ సమస్యను పరిష్కరించేందుకు అసైన్‌మెంట్ల స్వరూపాన్ని మార్చాలని యోచిస్తున్నారు. ఏఐని వినియోగించినా కూడా విద్యార్థుల ప్రతిభకు పదునుపెట్టే మార్గాల కోసం అన్వేషిస్తున్నారు