ఒక్కో షేరుకు 5 ఉచిత షేర్లు.. బోనస్ ప్రకటించిన రెండు కంపెనీలు ఇవే..
మార్కెట్లో ప్రస్తుతం కంపెనీలు వరుసగా రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో చాలా కంపెనీలు మంచి ఆదాయాలతో పాటు తమ ఇన్వెస్టర్లకు డివిడెండ్, బోనస్ షేర్లను అందిస్తున్నాయి. అయితే ఈ నెలలో రెండు కంపెనీలు భారీగా బోనస్ షేర్లను ఇస్తున్నాయి.
ఉచిత షేర్లు:
మంచి లాభాలను ఆర్జించే కంపెనీలు తమ ప్రస్తుత వాటాదారులకు ఉచిత షేర్లను అందిస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. కంపెనీలు లాభాలను నేరుగా ఇన్వెస్టర్లకు చెల్లించటానికి బదులుగా.. షేర్ల రూపంలో సంపాదనలో కొంత భాగాన్ని అందిస్తున్నాయి. రికార్డు తేదీ తర్వాత ఎక్స్ బోనస్‌తో ట్రేడ్ అవనున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Nykaa కంపెనీ:
ఇటీవల ఆన్ లైన్ కాస్మెటిక్స్ విక్రయదారు నైకా మంచి త్రైమాసిక లాభాలను ప్రకటించింది. ఒక్కో షేరుకు 5 బోనస్ ఈక్విటీ షేర్లను ఇవ్వాలని కంపెనీ బోర్డు అక్టోబర్ 3న నిర్ణయించింది. దీనికి నవంబర్ 11న రికార్డు తేదీగా కంపెనీ ప్రకటించింది. దీంతో ఈ స్టాక్ నవంబర్ 10న ఎక్స్-బోనస్‌గా ట్రేడ్ అవుతుంది. గత సంవత్సరం నవంబర్ లో ఈ షేర్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. సోమవారం కంపెనీ షేర్లు 2.48% పెరిగి రూ.1,132 వద్ద ముగిసింది.
పునిత్ కమర్షియల్స్.. స్మాల్ క్యాప్ కంపెనీ అయిన పునిత్ కమర్షియల్స్ లిమిటెడ్ సైతం తన పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను ప్రకటించింది. ఈ కంపెనీ సైతం తన ఇన్వెస్టర్లకు ఒక్కో ఈక్విటీ షేరుపై 5 ఉచిత బోనస్ షేర్లను అందిచాలని అక్టోబర్ 4న నిర్ణయించింది. అయితే ఇందుకు నవంబర్ 9ని రికార్డు తేదీగా కంపెనీ ప్రకటించింది. BSE సమాచారం ప్రకారం పునీత్ కమర్షియల్స్ షేర్లు నవంబర్ 9, 2022 నుంచి ఎక్స్-బోనస్ ట్రేడింగ్‌ను ప్రారంభిస్తాయి. నవంబర్ 7న మార్కెట్ ముగిసే సమయంలో కంపెనీ షేర్ విలువ రూ.51.25గా బీఎస్ఈలో నమోదైంది