నిద్రలోకి త్వరగా వెళ్లిపోవాలంటే ఇవి చేయండి

ఇప్పుడు మనం సాంకేతిక యుగంలో ఉన్నాం. ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతున్నా అరచేతిలో ఉన్న ఫోన్ ద్వారా తెలుసుకునే స్థాయిలో అభివృద్ధి చెందాం.

దీనికి తోడు స్మార్ట్ యుగంలో వెల్లువలా దూసుకు వచ్చిన యాప్స్ వల్ల మన జీవితం మరింత సుఖమయం అయిపోయింది. మంచి వెనుక చెడు ఉన్నట్టు.. అదేపనిగా ఫోన్ కు బానిస కావడం వల్ల కళ్ళ మీద ఒత్తిడి పెరిగిపోతుంది. ఫలితంగా కునుకు కరువు అవుతుంది. ఒకప్పుడు రాత్రి 8:00 కల్లా ముసుగు తన్నేవారు. ఇప్పుడు రాత్రి 12 దాటినా స్మార్ట్ ఫోన్ తోనే కాలక్షేపం చేస్తున్నారు. దీనివల్ల కళ్ళకు, శరీరానికి విశ్రాంతి లేకపోవడంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. మానసిక సమస్యలు కూడా ఇబ్బంది పెడుతుండడంతో అనివార్యంగా వైద్య నిపుణుల సూచన మేరకు నిద్ర కలిగించే మాత్రలు వేసుకోవాల్సి వస్తోంది. అయితే దీర్ఘ కాలం ఈ మాత్రలు వేసుకోవడం వల్ల ఆరోగ్యం పై వాటి ప్రభావం తీవ్రంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో పడుకున్న వెంటనే నిద్ర లోకి జారుకోవాలి అంటే ఏం చేయాలంటే.

వ్యాయామం తప్పనిసరి

ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం, రాత్రి భోజనం… ఇన్నిసార్లు ఆహారం తీసుకున్నాకా అది వెంటనే కరగాలి.. శరీరానికి శక్తినివ్వాలి. అది కరగాలంటే అరిగేదాకా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. అప్పుడే శరీరానికి శ్రమ కలుగుతుంది. దేహం అలిసిపోతుంది. ఫలితంగా వెంటనే నిద్ర వచ్చేస్తుంది. ఉదయం, సాయంత్రం వ్యాయామం చేస్తే వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఉండదని నివేదికలు చెబుతున్నాయి. రోజూ ఒకే సమయానికి పడుకోవడం వల్ల శరీరం ఒక టైం టేబుల్ కు అలవాటు పడుతుంది. మొదట్లో కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ సమయానికి నిద్ర ముంచుకొస్తుంది. నిద్రకి కనీసం మూడు గంటల ముందు భోజనం చేస్తే బాగుంటుంది. దానివల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. తిన్నది పూర్తిగా జీర్ణం అయిపోయి తొందరగా నిద్ర పడుతుంది.

లైట్స్ ఆఫ్ చేయండి

బెడ్ రూమ్ లో చాలామంది లైట్స్ ఆన్ లో ఉంచుతారు. ఆ విద్యుత్ దీపాల కాంతి మన కళ్ళను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల త్వరగా నిద్ర పట్టదు. అలాంటప్పుడు బెడ్ రూమ్ లో లైట్స్ వెంటనే ఆఫ్ చేయండి. మొబైల్ ఫోన్ పక్కన పెట్టండి. దానిని చూస్తూ ఉంటే నిద్ర పట్టదు. పైగా సమయం అంతా వృధా అవుతుంది.. చాలామందికి పడుకునే ముందు టీ లేదా కాఫీ తాగడం అలవాటు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. టీ లేదా కాఫీలో కెఫిన్ ఉండటంవల్ల నిద్ర భంగం కలుగుతుంది.

అందుకే రాత్రి పడుకునే ముందు కనీసం నాలుగు గంటల ముందు వరకు వీటిని తాగొద్దు. ఒత్తిడిని దూరం చేసుకుంటే నిద్ర హాయిగా పడుతుంది. మీరు నిద్రకు ఉపక్రమించే ముందు హాయిగా ఉండేందుకు ప్రయత్నించండి. శరీరంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు నిద్ర ముంచుకొస్తుంది. స్నానం చేసి ఒంట్లో వేడిని తగ్గించుకుంటే నిద్ర మరింత బాగా పడుతుంది. ఇప్పుడు పనివేళలు పూర్తిగా మారిపోయాయి కాబట్టి పొద్దంతా పడుకోవడం.. రాత్రంతా పనిచేయడం పరిపాటిగా మారింది. మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదే. కానీ ఎక్కువసేపు నిద్రపోతే రాత్రి నిద్ర పట్టదు. అందుకే పగటిపూట నిద్ర పోకపోవడం మంచిది. ఇన్ని చేసినప్పటికీ నిద్ర రాకపోతే పుస్తకం చదవడాన్ని అలవాటు చేసుకోండి. దీనివల్ల త్వరగా నిద్ర ఆవహించేస్తుంది. మరి ముఖ్యంగా పడుకునే ముందు ధ్యానం చేస్తే మరింత ఫలితం ఉంటుంది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *