వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై గ్రూపులో 1024 మందికి అనుమతి.. త్వరలోనే అందుబాటులోకి;
ఇతర మెసేజింగ్ యాప్‌లతో పోటీ పడేందుకు వాట్సాప్ ఒకేసారి 1024 మంది గ్రూప్ చాటింగ్‌కు వీలుగా కొత్త ఫీచర్ తేనున్నది.
ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్..
తన యూజర్ల కోసం కొత్త ఫీచర్లు తీసుకొస్తున్నది. ఇతర మెసేజింగ్ యాప్‌లతో పోటీ పడేందుకు ఒకేసారి గ్రూప్ చాటింగ్‌లో పాల్గొనే వారి సంఖ్య పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నది. సుదీర్ఘ కాలం వాట్సాప్ గ్రూప్‌ల్లో 256 మంది సభ్యులు మాత్రమే ఒకసాగే వారు. ఇది కుటుంబ సభ్యులు, వారి బంధు మిత్రులతో చాటింగ్‌కు సరిపోతుంది. కానీ, ఒక పెద్ద సంస్థలో పని చేస్తున్న వారికి, పెద్ద గ్రూప్‌లో ఉన్న వారికి పరిమితులు ఉన్నాయి. ఇటీవలే గ్రూప్ చాటింగ్ సభ్యుల సంఖ్యను 512కు పెంచిన వాట్సాప్.. భవిష్యత్‌లో 1024 మందికి అవకాశం కల్పించే ఫీచర్ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. అదే జరిగితే ఒకేసారి వెయ్యి మందికి పైగా చాటింగ్‌లో పాల్గొనవచ్చు.
ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సాప్ బీటా యూజర్లు ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. త్వరలో దీన్ని యూజర్లందరికీ అందుబాటులోకి తేనున్నది వాట్సాప్. అలాగే వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లుగా చేరేందుకు కొత్త అప్రూవల్ సిస్టమ్ తీసుకురాబోతున్నది. ఈ ఫీచర్ వచ్చాక అడ్మిన్ గ్రూప్‌లో చేరడానికి రిక్వెస్ట్ పంపాక.. పెండింగ్ పార్టిసిపెంట్స్ జాబితాలో కనిపిస్తుంది. గ్రూప్‌లో చేర్చుకోదలిచిన సభ్యులను అనుమతిస్తే సరిపోతుంది. పెద్ద గ్రూప్‌ల నిర్వహణకు ఇది సులువుగా ఉంటుందని వాట్సాప్ అంచనా వేస్తున్నది.
యూజర్ల ప్రైవసీని కాపాడేందుకు వాట్సాప్ మరికొన్ని ఫీచర్లు తీసుకు రానున్నట్లు సమాచారం. యూజర్లకు మరింత దగ్గరయ్యేందుకు కాల్ లింక్స్, వాయిస్ స్టేటస్ వంటి ఫీచర్లు అందించబోతున్నదని వినికిడి. ప్రత్యేకించి యూజర్ల ప్రైవసీని కాపాడటానికి వ్యూవన్స్‌లో `స్క్రీన్‌షాట్ బ్లాక్` అనే ఫీచర్ తేబోతున్నది. అదే జరిగితే వాట్సాప్ స్టేటస్‌లను ఇతరులు స్క్రీన్ షాట్ తీసుకోలేరు.
జూమ్, గూగుల్ మీట్ తరహాలో వాట్సాప్ కాల్ లింక్స్ ఫీచర్ పని చేస్తుంది. ఎవరైనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడానికి కాల్ లింక్ క్రియేట్ చేసి, ఇతరులకు పంపుతారు. ఇతరులు ఆ లింక్‌ను క్లిక్ చేసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనే వెసులుబాటు కలుగుతుంది. వాయిస్ స్టేటస్ ఫీచర్ వచ్చాక యూజర్లు తమ ఆడియో మెసేజ్‌ను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకునే వీలు ఉంది.