జనాల్లో ఫేమస్ కావడం కోసం కొంతమంది కొత్త కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారు. ట్రెండింగ్ లో నిలిచేందుకు సరికొత్త ఐడియాలతో ముందుకెళ్తున్నారు.
ఎవరైన ఏదైనా వాహనం కొనాలంటే..ముందుగా సెలక్ట్ చేసుకున్న కంపెనీ షోరూమ్ కు వెళ్లి డబ్బులు లేదా చెక్కులు చెల్లించి వాహనాన్ని బుక్ చేసుకుంటారు. కానీ, కొంతమంది మాత్రం కాయిన్స్ ను తీసుకెళ్లి తమకు నచ్చిన, ఇష్టమైన కలల వాహనాన్ని సొంతం చేసుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది.
ఉత్తరాఖండ్ లో ఓ వ్యక్తి కేవలం 10 రూపాయల నాణేలతో బైక్ కొన్నాడు. రుద్రపూర్ కు చెందిన ఓ వ్యక్తి 10 రూపాయల నాణేలను తీసుకెళ్లి.. టీవీఎస్ షోరూమ్ కు వెళ్లాడు. తనకు ఎంతో ఇష్టమైన జుపీటర్ బైక్ డీటెయిల్స్ అడిగాడు. దీంతో షోరూమ్ సిబ్బంది ఆయనకు పూర్తి వివరాలు చెప్పారు. అయితే.. తన దగ్గర కాయిన్స్ మాత్రమే ఉన్నాయని, వాటితోనే టూవీలర్ కొనాలని అనుకుంటున్నానని చెప్పడంతో షోరూమ్ సిబ్బంది అవాక్కయ్యారు. తర్వాత కాయిన్స్ ను తీసుకోవడానికి షోరూమ్ సిబ్బంది
ఒప్పుకోవడంతో 10 రూపాయల నాణెలను (50000 విలువ చేసే కాయిన్స్) షోరూమ్ సిబ్బందికి ఇచ్చాడు. ఉత్సాహంగా కాయిన్స్ ను లెక్కించడం మొదలుపెట్టినా.. ఆ తర్వాత సిబ్బంది కొద్దిగా ఇబ్బంది పడ్డారు.
సంచుల్లో తీసుకొచ్చిన కాయిన్లను సిబ్బంది అంతా కూర్చొని లెక్కపెట్టడం ప్రారంభించారు. ముందుగా వాటిని ఓ డెస్క్ పై కుప్పగా పోసి పది కాయిన్ల చొప్పున ఒక్క దగ్గర పెట్టి లెక్కించడం మొదలు పెట్టారు. రూ.50 వేల కాయిన్లు లెక్కించాలంటే సిబ్బంది చాలా ఇబ్బంది పడ్డారు. ఇలా వారు కాయిన్లు లెక్కపెడుతూ ఉంటే స్కూటీ కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి అన్ని కాయిన్స్ ను లెక్కించి… సదరు వ్యక్తికి జుపిటర్ బైక్ ను అందించి ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. టీవీఎస్ జూపిటర్ ధర రుద్రాపూర్ ఆన్ రోడ్ పై రూ. 85,210గా ఉంది. రూ.50 వేలను కాయిన్ల రూపంలో చెల్లించగా.. మిగిలిన డబ్బును ఎలా చెల్లించాడో మాత్రం వీడియోలో స్పష్టంగా లేదు.
రూపాయి, ఐదు రూపాయల నాణేలతో వాహనాలను కొనుగోలు చేసిన సంఘటనలు గతంలో చాలానే వెలుగుచూశాయి. తమిళనాడు సేలం ప్రాంతానికి చెందిన భూపతి అనే యూట్యూబర్ తనకు ఇష్టమైన బజాజ్ డామినార్ బైక్ ను రూ.1 నాణేలు చెల్లించి కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్ గా మారింది.
* ఫేమస్ యూట్యూబర్ హర్ష సాయి కూడా గతంలో ఇలాగే లక్షల్లో కాయిన్లను చెల్లించి తనకు ఇష్టమైన కారును కొనుగోలు చేశారు.
* అస్సాంకు చెందిన మరో వ్యక్తి కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను పొదుపు చేసుకున్న రూ.22,000 నాణేలతో డౌన్‌పేమెంట్ చేసి స్కూటర్‌ను కొనుగోలు చేశాడు. కొత్త స్కూటర్‌ను కొనుగోలు చేసేందుకు 7 నెలల పాటు ఆదా చేసిన నాణేలతో కూడిన సంచిని సదరు వ్యక్తి షోరూమ్‌కి తీసుకెళ్లి ఇచ్చాడు. మిగిలిన డబ్బును క్యాష్ రూపంలో చెల్లించాడు.