లక్షాధికారుల్ని చేసిన మల్టీబ్యాగర్.. ఏకంగా 300 శాతం రిటర్న్స్.. మీ దగ్గరుందా?
మల్టీబ్యాగర్ స్టాక్స్ గురించి వినే ఉంటారు. చాలా తక్కువ కాలంలో షేరు అసలు విలువకు ఎన్నో రెట్లు పెరిగి ఇన్వెస్టర్లను లక్షాధికారుల్ని చేస్తుంటాయి. అయితే చాలా వరకు మల్టీబ్యాగర్ స్టాక్స్ అవి గరిష్ట విలువకు చేరాకే ఆ విషయం అర్థమవుతుంటుంది చాలా మందికి. వాటి కనిష్ట విలువల వద్ద షేర్లను కొని హోల్డింగ్ చేసినవారికి మంచి లాభాలు వస్తాయి. అయితే ఇలాంటి మల్టీబ్యాగర్ స్టాక్స్‌ను ముందుగా గుర్తించడం కూడా పెద్ద కష్టమేం కాదు. మార్కెట్లను జాగ్రత్తగా పరిశీలిస్తూ.. ఆయా కంపెనీల ప్రతి క్వార్టర్స్ ఫలితాలు, ప్రకటనలను విశ్లేషిస్తుంటే ఈజీగా పట్టేయొచ్చు. అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు సొంతమవుతాయి. అలాంటి ఒక మల్టీబ్యాగర్ స్టాక్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.
భారత్ గేర్స్ లిమిటెడ్ (B.G.L) . విభిన్న రకాల రింగ్ గేర్స్, ట్రాన్స్మిషన్ గేర్స్, షాఫ్ట్స్ వంటి వాటిని తయారుచేస్తుంటుంది. ఇవి ఎక్కువగా ఆటోమొబైల్ రంగంలో వినియోగిస్తారు. భారత్‌లో గేర్ మాన్యుఫాక్చరర్‌లో అతిపెద్ద కంపెనీల్లో ఒకటి (B.H.L). ఆటోమోటివ్ గేర్స్‌ను పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి చేస్తుంటుంది. ముంబయి, ఫరీదాబాద్, సతారా వంటి ప్రాంతాల్లో దీని మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా విస్తృత నెట్వర్క్ దీని సొంతం. 26 రాష్ట్రాల్లో మొత్తంగా 70 డీలర్షిప్స్ ఉన్నాయి. అశోక్ లేల్యాండ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, జాన్ డీర్ UK, ZF USA ఈ కంపెనీ క్లైంట్స్.
అయితే ఈ స్టాక్‌కు మంచి డిమాండ్ ఉండటం వల్ల ఇటీవలి కాలంలో భారీగా పెరిగింది. ఏకంగా రెండేళ్ల వ్యవధిలోనే 300 శాతానికిపైగా రిటర్న్స్ వచ్చాయి. ప్రస్తుతం భారత్ గేర్స్ లిమిటెడ్ షేరు ధర రూ.127.70 వద్ద ఉంది. 2020 నవంబర్ 23న ఈ స్టాక్ ధర రూ.33.89 కావడం గమనార్హం. అంటే ఈ రెండేళ్ల కాలంలో దీనిని హోల్డింగ్ చేసిన వారికి భారీగా లాభాలొచ్చాయి అన్న మాట.
2022-23 రెండో త్రైమాసికంలో కంపెనీ ఫలితాలను చూస్తే.. ఆదాయం భారీగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే 14.42 శాతం పెరిగి రూ.213.55 కోట్లుగా నమోదైంది. PAT రూ.5.76 కోట్లు. అయితే ఇదే క్రమంలో ఖర్చులు కూడా భారీగా పెరిగిపోయాయి. కంపెనీ ROE, ROCE వరుసగా 25.5, 24.1 శాతంగా ఉంది. భారత్ గేర్స్ లిమిటెడ్ మార్కెట్ విలువ రూ.195 కోట్లుగా ఉంది.
గురువారం సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంచి లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 120 పాయింట్లకుపైగా లాభంలో ట్రేడవుతోంది. బ్యాంకింగ్ ఇండెక్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు రాణిస్తుండగా.. మెటల్, టెలికాం షేర్లు పడిపోతున్నాయి.