మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ఎలన్ మస్క్, దానితో ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త ట్వీట్లతో ఆకట్టుకునే టెస్లా అధినేత తాజాగా తన పేరు మార్చుకున్నారు.
ట్విట్టర్ అకౌంట్ కు ఎలన్ మస్క్ అనే పేరు ఉండగా ఇప్పుడు దాన్ని ‘మిస్టర్ ట్వీట్’గా మార్చేశారు. పేరు మార్చుకున్న తర్వాత ఆయన ఓ ట్వీట్ చేశారు. “నా ట్విట్టర్ అకౌంట్ పేరును మిస్టర్ ట్వీట్ అని మార్చుకున్నాను. కానీ, తిరిగి మార్చాలి అనుకున్నా ట్విట్టర్ అనుమతించడం లేదు” అంటూ ఫన్నీ ఎమోజీని పోస్టు చేశారు. ఆయన ట్వీట్ పై నెటిజన్లను చెలరేగిపోతున్నారు. పలువురు ఆయనను ఆటాడేసుకుంటున్నారు. ఎందుకు పేరు మార్చారంటూ ఫన్నీ ట్వీట్లు చేస్తున్నారు.
ఎలన్ మస్క్ పై నెటిజన్ల సటైర్లు
ఎలన్ మస్క్ వ్యవహారం ట్విట్టర్ ను కామెడీ చానెల్ గా మార్చేస్తున్నట్లు అనిపిస్తోందని నెటిజన కామెంట్ చేశారు. మార్చేసినట్లు అనిపించడం కాదు, నిజంగానే కామెడీ చానెల్ గా ఉందంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు. పేరు మార్చుకున్న వాళ్లంతా బ్లూ టిక్ కోల్పోయారు. మరి మీ అకౌంట్ ఎందుకు బ్లూ టిక్ కోల్పోలేదు? అంటూ మరో నెటిజన్ క్వశ్చన్ చేశారు. ఇకపై నా అకౌంట్ పేరును ఎలన్ మస్క్ అని పెట్టుకుంటాను అంటూ మరో నెటిజన్ బదులిచ్చాడు. వరుస ట్వీట్లతో మస్క్ పై జోకులు పేల్చుతున్నారు.
మస్క్ చేతికి చిక్కి నష్టపోతున్న ట్విట్టర్
గత సంవత్సరంలో ట్విట్టర్ ను కోనుగోలు చేసిన తర్వాత మస్క్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తను అనుకున్న విధంగా ట్విట్టర్ లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. నష్టాల్లో ఉన్న ట్విట్టర్ ను లాభాల బాట పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే సుమారు సగానికి పైగా ఉద్యోగులను తొలగించారు. పలు దేశాల్లోని ట్విట్టర్ కార్యాలయాలను అమ్మకానికి పెట్టారు. ఇన్నీ చేసినా ఆయన అనుకున్నట్లుగా లాభాల్లోకి రాకపోగా మరింత నష్టాల్లో కూరుకుపోతోంది. మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన నాటి నుంచే ట్విట్టర్ షేర్ వ్యాల్యూ పడిపోతూ వస్తోంది. తాజాగా వెల్లడైన నివేదిక ప్రకారం 75 శాతం వరకు నష్టాలు వచ్చినట్లు తేలింది. ‘స్టాండర్డ్ మీడియా ఇండెక్స్’ రిపోర్టు ప్రకారం ట్విట్టర్ మస్క్ చేతికి వెళ్లిన తర్వాత ప్రకటనదారులు ట్విట్టర్ కు ఇచ్చే యాడ్స్ నిధులను భారీగా తగ్గించారని తెలిపింది. గత డిసెంబర్లో ఆదాయం 71 శాతం తగ్గిపోయినట్లు వెల్లడించింది. అయితే, ప్రకటనదారులను ఆకట్టుకునేందుకు ట్విట్టర్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.