ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. బడ్జెట్‌ తర్వాత పెరగనున్న జీతం.. ఎంతంటే?

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పనుంది. వచ్చే బడ్జెట్‌లో వీరికి వేతనాలను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్ అనంతరం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

అదే జరిగితే ఉద్యోగుల వేతనాల్లో భారీగా మార్పులు జరగనున్నాయి. ఈ నెల 31న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు.

ఉద్యోగుల జీతాల్లో కీలకమైనది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్. ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగానే ఉద్యోగి మొత్తం వేతనం ఫైనలైజ్ అవుతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2.57శాతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలవుతోంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది ఒక సాధారణ విలువ. అలాగే, కనీస వేతనం 18,000(బేసిక్ పే)గా ఉంది.

ఉద్యోగుల డిమాండ్

ప్రస్తుతం ఉన్న 2.57శాతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.68శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ముసాయిదాను కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు. కేంద్రం కూడా 3శాతం వరకు పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ.18 వేల నుంచి రూ.26వేలకు పెరిగే అవకాశం ఉంటుంది. ఫలితంగా మొత్తం వేతనంలోనూ పెరుగుదల ఉండనుంది.

ఎలా లెక్కిస్తారు?

ఉద్యోగి మొత్తం వేతనం నిర్ణయించడంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఉద్యోగి బేసిక్ పేతో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను గుణిస్తే వచ్చేదే మొత్తం వేతనం. ఉదాహరణకు ఒక ఉద్యోగికి రూ.15,500 బేసిక్ పే ఉందని అనుకుందాం. ప్రస్తుతం ఉన్న ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతంతో గుణిస్తే 15,500*2.57= 39,835 అవుతుంది. అంటే 15,500 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి మొత్తంగా రూ.39,835 జీతం వస్తుందన్నమాట.

ఫిట్‌మెంట్ పెరిగాక ఇలా..

ఒకవేళ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 నుంచి 3.68శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంటే మొత్తం వేతనం పెరుగుతుంది. మరొక ఉదాహరణ తీసుకుందాం. 18,000*2.57= 46,260 గా మొత్తం వేతనం ఉంటుంది. 3.68 శాతానికి పెంచితే ఇది 26,000*3.68= 95,680 అవుతుంది. ఇలా కాకుండా కేంద్రం అనుకుంటున్న ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3శాతం పెంచితే 21,000*3= 63,000 అవుతుంది.

డీఏ , డీఆర్ లు కూడా..

7వ వేతన సంఘం ప్రకారం వేతనం పొందుతున్న ఉద్యోగులకు కరువు భత్యం లేదా డియర్‌నెస్ అలవెన్స్ను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో డీఏ లో హైక్‌ చేసేం దుకు కేంద్రం రెడీ అవుతోందట. ఒకవేళ కరువు భత్యం పెరిగితే.. అది ఈ ఏడాది జనవరి 1 నుంచే అమలవుతుంది. పెన్షనర్లకు కూడా డియర్‌నెస్ రిలీఫ్ను పెంచేందుకు సిద్ధమవుతుందట. వీటితో పాటు 18 నెలల డీఏ బకాయిలు విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఏడాదికి రెండు సార్లు

ఏడాదికి రెండు సార్లు కేంద్రప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్‌లను సవరిస్తుంటుంది. ఇలా సవరించిన రేట్లను జనవరి 1 లేదా జులై 1 నుంచి అమలు చేస్తుంది. చివరిసారిగా గతేడాది సెప్టెంబరులో డీఏ , డీఆర్ లను కేంద్రం పెంచింది. అప్పుడు 4శాతం మేర పెంచి 38శాతానికి డీఏ ను తీసుకొచ్చింది. ఫలితంగా 48లక్షల మంది ఉద్యోగులు, 68లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందారు.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *