ఆధునిక ప్రపంచంలో మనిషి జీవితం చాలా వరకు టెక్నాలజీ మీదే ఆధారపడి ముందుకు సాగుతుంది. ఆన్ లైన్, ఇంటర్నెట్ అనే పదాలు లేకుండా సమాజం ముందుకు సాగలేకపోతోంది.
చాలా మంది నెట్టింట్లోనే గడుపుతున్నారు. వైఫై సాయంతో ఆన్ లైన్‌లోనే పనులు చక్కదిద్దుకుంటున్నారు. టెక్నాలజీ పుణ్యమా అని రోజు రోజుకు మెరుగైన సేవలు అందుకుంటున్నారు. అందులో భాగంగానే వైఫై సైతం రకరకాలుగా అప్ డేట్ అవుతూ వస్తోంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న వైఫై 6 స్థానంలో.. అత్యాధునిక ఫీచర్లతో వైఫై 7 రాబోతుంది. ఈ విషయాన్ని వైఫై 7ను డెవలప్ చేస్తున్నట్లు మోబైల్ ప్రాసెసర్ తయారీ సంస్థ క్వాల్ కోమ్ వెల్లడించింది. ప్రస్తుత వైఫైతో పోల్చితే వైఫై 7 డబుల్ స్పీడ్ తో ఇంటర్నెట్ సేవలు అందించనుంది.
వైఫై 7 గురించి క్వాల్ కోమ్ కీలక విషయాలు వెల్లడించింది. వేగంగా ఇంటర్నెట్ అందుబాటులోకి రావడమేకాకుండా, లో-లాటెన్సీ ఫెర్మామెన్స్‌ను మరింత పెంపొందింపజేసినట్లు తెలిపింది. ఆధునీకరించి వైఫై 7తో ఎక్స్‌ఆర్, మెటావర్స్, సోషల్ గేమింగ్, ఎడ్జ్ కంప్యూట్ సహా పలు సేవలను అత్యంత వేగంగా, అత్యంత క్వాలిటీగా పొందే వెసులుబాటు ఉంటుందని తెలిపింది. పవర్ ఫుల్ ఎమ్‌ఎల్‌ఓ ఫీచర్ తో పాటు మరెన్నోనూతన సేవలు వైఫై 7తో యూజర్ల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు.
వైఫై 7తో 3 రెట్లు వేగవంతమైన సేవలు
ప్రీమియం మొబైల్, ట్యాబ్ తో పాటు ఇతర గ్యాడ్జెట్‌లను కొనుగోలు చేసినప్పుడు టెక్ ఫీచర్లను గమనిస్తే వైఫై 6ను సపోర్ట్ చేస్తుందని రాసి ఉంటుంది. మనలో చాలా మంది ఓఎస్, బ్యాటరీ, కెమెరా, ప్రాసెసర్ వంటి వాటి గురించి తెలుసు. కానీ, డివైజ్‌లోని ఇతర టెక్నికల్ విషయాల గురించి పెద్దగా తెలుసుకోం. అయితే ఇప్పటి వరకు వైఫై6 అని ఉన్న చోట రాబోయే రోజుల్లో వైఫై7 అని ఉండబోతుంది. వైఫై 7లో వైర్‌లెస్ కనెక్టివిటీ స్టాండర్డ్ ట్రాన్సిమిషన్ రేట్ 30 జీబీపీఎస్ వరకు ఉండవచ్చని తెలిసింది. ప్రస్తుతం ఉపయోగం లో ఉన్న వైఫై 6లో ఈ ట్రాన్సిమిషన్ రేట్ కేవలం 9.6 జీబీపీఎస్ ఉంది. అంటే వైఫై 6తో పోల్చితే వైఫై 7 సుమారు మూడు రెట్లు వేగంగా ఇంటర్నెల్ సేవలను అందించే అవకాశం ఉందన్నమాట.
పెరగనున్న బ్యాండ్ విడ్త్
అటు వైఫై 7లో 320 మెగాహెర్జ్ సిగ్నల్ ఛానెల్ బ్యాండ్ విడ్త్ ఉంటుంది. ప్రస్తుతం వాడుతున్న వైఫై 6లో ఇది కేవలం 160 మెగాహెర్జ్ మాత్రమే ఉంది. బ్యాండ్ విడ్త్ పెరగడం మూలంగా ఒకేసారి ఎక్కువ డివైజ్‌లను వైఫైకి అనుసంధానం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆఫీస్, పబ్లిక్ ప్లేసెస్ లో ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అటు వైఫై 7లో మల్టీ లింక్ క్యాపబిలిటీస్, మాడ్యులేషన్ ఎవల్యూషన్, ఫ్లెక్సిబుల్ ఛానల్ యుటిలైజేషన్ సహా ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. మల్టీ లింక్ ఫీచర్ తో వైఫై 7 యూజర్ కు ఒకేసారి వేర్వేరు ఛానల్స్ ఉపయోగించే వెసులుబాటు కలుగుతుందని తయారీ కంపెనీ తెలిపింది.