భోపాల్: కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటూ వచ్చిన హాట్ టాపిక్.. ఆఫ్రికన్ చీతాస్. ఇప్పుడు మళ్లీ వార్తల్లోకెక్కాయి. నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చీతాలు..
ఇప్పుడు తొమ్మిది కాబోతోన్నాయి. వాటిల్లో ఒకటి గర్భం దాల్చినట్లు మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ అధికారులు వెల్లడించారు. గర్భం దాల్చిన సంకేతాలు ఆ చీతాలో కనిపిస్తోన్నాయని పేర్కొన్నారు. ఆ చీతాను సంరక్షించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.ప్రశాంత్ కిశోర్ ఫాలోస్ జగన్ – మద్దతు ప్రకటించిన ఆ ఎమ్మెల్సీ
కునో నేషనల్ పార్క్‌లో..
నమీబియా నుంచి ప్రత్యేక కార్గో విమానంలో ఈ ఎనిమిది చీతాలను భారత్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇంటర్-కాంటినెంటల్ ట్రాన్స్‌లొకేషన్ ఆఫ్ చీతాస్‌లో ఇది మొట్టమొదటి ప్రాజెక్ట్. తన జన్మదినాన్ని పురస్కరించుకుని కిందటి నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన చేతుల మీదుగా వాటిని కునో నేషనల్ పార్క్‌లో విడుదల చేశారు. ఎన్‌క్లోజర్లల్లో ఉన్న వాటికి స్వేచ్ఛ కల్పించారు. ఈ ఎనిమిదింట్లో అయిదు ఆడ, మూడు మగ చిరుతలు ఉన్నాయి.
మోదీ నామకరణం..
అందులో ఓ ఆడ చీతాకు ఆశా అని నామకరణం చేశారు మోదీ. అదే చీతా ఇప్పుడు గర్భం దాల్చింది. కునో నేషనల్ పార్క్ అధికారులు ఈ చిరుతను అనుక్షణం పరిరక్షిస్తోన్నారు. దాని ప్రవర్తనను నిశితంగా పరిశీలిస్తోన్నారు. దాదాపు 70 సంవత్సరాల తరువాత భారత్‌లో ఓ చిరుతకు జన్మనివ్వడం ఇదే తొలిసారి అవుతుంది. ఈ ఆశా చీతా ప్రవర్తన, ఆహారం తీసుకోవడం, హార్మోన్లకు సంబంధించిన సంకేతాలన్నీ అది గర్భాన్ని ధరించినట్లు సూచిస్తోన్నాయని అధికారులు చెప్పారు.
నెలాఖరులోగా..
గర్భం దాల్చినట్లు ధృవీకరించుకోవడానికి ఇంకొంత సమయం పడుతుందని, ఈ నెలాఖరులోగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయని డాక్టర్ మార్కర్ చెప్పారు. ఇప్పుడున్న ప్రారంభ లక్షణాలను బట్టి చూస్తోంటే- గర్భం దాల్చిందనడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. గర్భం నిలవడానికి కొన్ని ప్రత్యేక చర్యలను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఎండుగడ్డితో చేసిన ప్రత్యేక వసతిని కల్పించనున్నట్లు తెలిపారు.
అదనపు సంరక్షణ చర్యలు..
అప్పుడే పుట్టిన చీతా పిల్లలు 240 నుంచి 425 గ్రాముల బరువును కలిగి ఉంటాయని, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రోజులు తల్లి వద్దే గడుపుతాయని వివరించారు. ఆ తరువాత క్రమంగా తల్లి నుంచి వేరుపడి స్వేచ్ఛగా జీవించడంపై దృష్టి సారిస్తాయని, ఆ సమయంలోనే వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కునో పార్క్ సిబ్బంది ఒకరు చెప్పారు. ఆరు నుంచి ఎనిమిది వారాల వయస్సు వచ్చే వరకు ఏకాంతంగా ఉంటాయని పేర్కొన్నారు.
అంతరంచిపోతున్న జాతుల జాబితాలో.
ఒకప్పుడు భారత్- ఆసియాటిక్ చిరుతలకు నిలయంగా ఉండేది. 1952 నాటికి అవి అంతరించిపోయినట్లు ప్రకటించారు. మిడిల్ ఈస్ట్, మిడిల్ ఆసియా, భారత్ అంతటా విస్తరించిన చిరుతలు ఇప్పుడు అంతరించిపోతున్న ఉపజాతుల జాబితాలో చేరాయి. ఇప్పుడు ఇరాన్లో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉంటోన్నాయి. వాటి సంతతిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఇంటర్-కాంటినెంటల్ ట్రాన్స్‌లొకేషన్ ఆఫ్ చీతాస్ ప్రాజెక్ట్‌ను చేపట్టారు.