ఇంట్లో పని చేయమని భార్యకు చెప్పడం గృహహింస కాదు..వివాహిత పిటీషన్ ను కొట్టివేసిన హైకోర్టు

ఇంట్లో పని చేయమని వివాహితకు అత్తింటి వారు చెప్పడం క్రూరత్వం కాదని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది.

దీనిపై మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా భాగ్యనగర్ పోలీస్ స్టేషన్ లో మహిళ వేసిన పిటీషన్ ను కొట్టివేసింది. సదరు వివాహిత భర్త, అత్తామామలపై గృహహింస కేసు పెట్టింది. పెళ్లి చేసుకున్న నెల రోజుల వరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత అత్తింటి వారు పనంతా తనతోనే చేయించుకుంటున్నారని, పని మనిషిలా పని చేయించుకుంటున్నారని మహిళ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే అత్తమామలు, భర్త రూ.4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని మహిళ ఆరోపించింది. ఈ మొత్తాన్ని ఇవ్వకపోతే తన భర్త కొట్టాడని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని మహిళ ఆరోపించింది. ఆ మహిళ భర్త, కుటుంబసభ్యులపై సెక్షన్ 498Aతో పాటు, IPC సెక్షన్లు 323 (గాయపర్చడం), 504 (ఉద్దేశ్యపూర్వకంగా అవమానించడం), 506 (నేరపూరిత బెదిరింపు) సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.

ఇక మహిళ పిటీషన్ పై విచారణ చేసిన బాంబే హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. పెళ్లి అయిన మహిళను ఇంటి పని చేయాలనడం ఇంటి పని మనిషితో సమానంగా చూడడం కాదని, అది మహిళల పట్ల క్రూరత్వం కాదని బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. ఒకవేళ ఇంటి పని చేయకూడదనుకుంటే ఆ విషయాన్ని పెళ్ళి ముందే చెప్పాలని కోర్టు పేర్కొంది. సదరు వివాహిత భర్తపై, అత్తామామలపై దాఖలు చేసిన గృహహింస కేసును జస్టిస్ విభా కంకన్ వాడి, జస్టిస్ రాజేష్ పాటిల్ లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. వివాహితను పని చేయమని కుటుంబం ఖచ్చితంగా అడుగుతారని దానిని పని మనిషిలా చూస్తున్నారని చెప్పలేమని బెంచ్ పేర్కొంది. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే పెళ్లికి ముందే పని చేయమని చెప్పాలని అప్పుడు ఇలాంటి సమస్యలు తలెత్తవని పేర్కొంది. దీనిపై ఫిర్యాదు చేసిన మహిళ ఎలాంటి ఆధారాలు చూపలేదని బెంచ్ అభిప్రాయపడింది. కుటుంబం కోసం పని చేయడం పని మనిషిలా చూడడం ఎందుకవుతుందని ప్రశ్నించింది. కేవలం కేసు పెట్టడమే కాదు దానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలను ప్రవేశపెట్టాలని కోర్టు  స్పష్టం చేసింది.

కాగా ఆ మహిళా మొదటి భర్తపై కూడా అలాంటి ఆరోపణలు చేసినట్లు తెలుస్తుంది. ఓ వివాహిత ఇంట్లో పని చెబితే గృహహింస కేసు పెట్టడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *