మునిగిపోతున్న జోషిమఠ్..? ఈ పట్టణం ఇక కనిపించదా? అసలేం జరుగుతోంది?

త్తరాఖండ్‌ లో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక పట్టణం జోషిమఠ్  ప్రమాదంలో ఉంది. ఈ పట్టణం క్రమంగా మునిగిపోతోంది. ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయి.
భూమి అంతకంతకూ కిందకు కుండిపోతోంది. భూకంపం వచ్చినట్లుగా నెర్రలు చాస్తోంది. ఆ పగుళ్ల నుంచి నీళ్లు బయటకు వస్తున్నాయి. ఆ నీటితో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోజు రోజుకూ పరిస్థితి దిగజారుతుండడంతో.. అక్కడి ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇళ్లకు పెద్ద ఎత్తున పగుళ్లు ఏర్పడుతుండడంతో భయంతో వణికిపోతున్నారు. పట్టణం మొత్తం భూమిలో కలిసిపోతుందని.. నీటిలో మునిగిపోతుందని టెన్షన్ పడుతున్నారు. ఇళ్లల్లో ఉండాలంటేనే జంకుతున్నారు. ఇప్పటికే పలు కుటుంబాలు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. అటు అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. పట్టణ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్‌ కు జోషిమఠ్ గేట్ వేగా ఉంది. బద్రీనాథ్‌కు చేరుకోవాలంటే ఈ పట్టణం నుంచే వెళ్లాలి. అలాంటి జోషిమఠ్ ఇప్పుడు ప్రమాదపు అంచుల ఉంది. ఇక్కడ దాదాపు 700 ఇళ్లకు పగుళ్లు వచ్చాయని జోషిమఠ్‌ మున్సిపాలిటీ చైర్మన్‌ శైలేంద్ర పన్‌వార్‌ తెలిపారు. ఇళ్లకు పగుళ్లు పడిన ప్రాంతాలను చమోలి జిల్లా పరిపాలన అధికారులు బుధవారం సందర్శించారు. పట్టణం క్రమంగా మునిగిపోయే అవకాశం ఉన్నందున.. ప్రజలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. బుధవారం చమోలీ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ , డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, జియాలజిస్ట్‌లు, స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ , ఫైర్సర్వీస్, స్థానిక పోలీసుల బృందంతో కలిసి మార్వాడీ, మనోహర్ బాగ్ మరియు సింఘ్‌ధార్ వార్డులలో ఉన్న ఇళ్లు మరియు భూములను పరిశీలించారు.

జోషిమఠ్‌లో పగుళ్లపై సాధువులు, రుషులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదో జరగరానిది కీడు జరుగుతోందని అభిప్రాయపడుతున్నారు. నిన్న జోషిమఠ్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు కాగడాలు చేతబట్టి ఆందోళన చేశారు. వీధుల్లో తిరుగుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జోషిమఠ్‌లో ఏం జరుగుతుందో ప్రభుత్వం చెప్పాలని..తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

జోషిమఠ్‌లో తాజా పరిస్థితిపై సీఎం పుష్కర్ సింగ్ ధామి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఎనిమిది మంది సభ్యులతో కూడిన నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం గురువారం నుంచి జోషిమఠ్‌లో విడిది చేసి రెండు రోజుల పాటు కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను పరిశీలిస్తుంది. సమస్యను పరిష్కరించడానికి చేపట్టాల్సిన సలహాలు, సూచలను ప్రభుత్వానికి ఇస్తుంది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *