ఇకపై క్రెడిట్ కార్డుతో యూపీఐ లావాదేవీలు చేయవచ్చు;

ఇకపై క్రెడిట్ కార్డుతో యూపీఐ లావాదేవీలు చేయవచ్చు;

దేశంలో డిజిటల్ చెల్లింపులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరూ డిజిటల్ చెల్లింపులను అనుమతించడంతో గత కొన్ని రోజుల్లో వాటి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కొంత మంది చెల్లింపులు చేయడానికి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ని వినియోగిస్తుందగా, మరికొందరు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుల ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. అయితే తాజాగా యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు లావాదేవీలను ఆమోదించేలా వ్యాపారులను అనుమతించే దిశగా దేశీయ ప్రముఖ ఫిన్ టెక్ ప్లాట్ ఫామ్ అయిన రేజర్ పే మొదటి అడుగు వేస్తున్నట్లు ప్రకటించింది.

రూపే క్రెడిట్ కార్డులు యూపీఐలో ఎనేబుల్ కావడంతో, రేజర్ పే వ్యాపారులు యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు చెల్లింపులను ఆమోదించడం ప్రారంభించవచ్చు. ఎప్పటికప్ప్పుడు వ్యాపారుల అవసరాలను తీర్చడం, చెల్లింపుల విషయంలో వారికి ఎక్కువ సౌలభ్యాన్ని అందించడంపై రేజర్ పే ఎల్లప్పుడూ దృష్టి సారిస్తుందని, యాక్సిస్ బ్యాంకు భాగస్వామ్యంతో ఇది సాధ్యమని కంపెనీ తెలిపింది.

డిజిటల్ రంగంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా ఆవిష్కరణలకు అనుగుణంగా ఈ ఆఫర్ ను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. రూపే క్రెడిట్ కార్డులను భీమ్ యూపీఐ యాప్ తో అనుసంధానించడానికి అక్టోబర్ 4న ఎన్పీసీఐ అనుమతి ఇచ్చింది.

దీనిని అమలు చేయడానికి ఏదైనా చెల్లింపు గేట్ వే అవసరం. ఈ నేపథ్యంలో, మా వ్యాపారుల కోసం యూపీఐలో క్రెడిట్ కార్డు లావాదేవీలను అనుమతించే దిశగా రేజర్ పే మొదటి అడుగు వేసిందని రేజర్ పే ఎండీ, సహ వ్యవస్థాపకుడు శశాంక్ కుమార్ తెలిపారు.

ఈ చర్య రాబోయే రెండు నుంచి మూడు సంవత్సరాల్లో వినియోగదారులు చెల్లింపులు చేసే విధానాన్ని మార్చే అవకాశం ఉందని మేము నమ్ముతున్నామని యాక్సిస్ బ్యాంకు కార్డ్స్ అండ్ పేమెంట్స్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ సంజీవ్ మోఘే తెలిపారు.

హెచ్డీఎఫ్సీ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకుకు చెందిన వినియోగదారులు మొదటగా యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు చెల్లింపులకు సంబంధించిన ప్రయోజనాలను పొందుతారని కంపెనీ తెలిపింది.

దేశంలో నిర్మాణాత్మక క్రెడిట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను విస్తరించాలనే ప్రభుత్వ విజన్ కు అనుగుణంగా వినియోగదారులు దేశంలోని అందరు వ్యాపారులతో సజావుగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా లావాదేవీలు జరపడానికి ఇది వీలు కల్పిస్తుందని ఎన్పీసీఐ కార్పొరేట్ అండ్ ఫిన్టెక్ రిలేషన్షిప్స్ అండ్ కీ ఇనిషియేటివ్స్ చీఫ్ నళిన్ బన్సాల్ తెలిపారు.

సుమారు 250 మిలియన్ల మంది భారతీయులు తమ రోజువారీ లావాదేవీల కోసం యూపీఐని ఉపయోగిస్తుండగా, దేశంలోని దాదాపు 50 మిలియన్ల వినియోగదారులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉన్నారు. గత మూడు సంవత్సరాలలో దేశంలో క్రెడిట్ కార్డుల పరిశ్రమ 30 శాతం చొప్పున స్థిరంగా వృద్ధి చెందిందని ఆర్బీఐ డేటా తెలిపింది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *