నిద్రపోయేటప్పుడు కలలు రావడం సహజం. కొందరు తమకు వచ్చిన కలలను గుర్తుంచుకుంటారు. కొందరికి ఆ కలలను గుర్తించుకునే శక్తి ఉండదు.
ఏ కలకు కూడా ఒక ప్రత్యేకమైన ముగింపు ఉండదు. మధ్యలో అర్థాంతరంగా ఆగిపోతాయి. కొన్ని సార్లు మన జీవితంలో మర్చిపోయిన వ్యక్తులు కూడా కలలో వస్తూ ఉంటారు. కలలపై మానసిక నిపుణులు, యోగా శాస్త్ర నిపుణులు ఎప్పుడూ పరిశోధనలు చేస్తూనే ఉంటారు. అలాగే కొందరికి కలలో దృశ్యాలు రంగుల్లో కనిపిస్తాయి. కొందరికి బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తాయి. అసలు కలలు ఎందుకు వస్తాయి. ఎలా వస్తాయి. కలలు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనే దానిపై మానసిక నిపుణులు, యోగ శాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
యోగ శాస్త్ర ప్రకారం మనిషి నిద్రిస్తున్నప్పుడు లేదా శవాసన సమయంలో మనిషికి ఉన్న ఏడు చక్రాలలో కలలకు మూలాధారమైన చక్రాలు ఉన్నాయి. అవి సహస్త్ర చక్ర, ఆగ్య చక్ర, మణిపుర చక్ర, స్వధిష్టాన చక్ర. శరీరం పడుకున్నప్పుడు ఈ సప్త చక్రాలు వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. మెదడుకు సంబంధించిన సహస్ర, ఆగ్య చక్రాలే కలలకు మూలం. నిద్రిస్తున్నప్పుడు మెదడు సుప్తావస్థలోకి జారుకోవడానికి ఈ రెండు చక్రాలే ఉపయోగపడతాయి. కానీ మన ఆత్మ ప్రదేశాలు చుట్టి రావడానికి, వ్యక్తులను కలిసి రావడానికి మాత్రం నాభి ప్రాంతంలో ఉంటే మణిపుర, స్వాధిష్టాన చక్రాలే మూలం.
కలలు
మనిషి నాభి నుండే శరీరాకృతిని పెంచుకుంటాడు. మనిషి ఆత్మకు శరీరానికి మధ్య కలయిక కరెంటు తీగ కనెక్షన్ లాగే ఉంటుంది. ఈ కలయిక ఆత్మకు, నాభికి మధ్యనే ఉంటుంది. కలలు కంటున్నప్పుడు ఈ కనెక్షన్ విడిపోకుండా ఆత్మ ఎంత దూరమైనా ప్రయాణించగలదు. ఒకవేళ గాడ నిద్రలో కలలు కంటున్నప్పుడు మన శరీరాన్ని ఎవరైనా ఉలిక్కి పడేలా లేపితే ఆత్మకు శరీరానికి మధ్య ఉన్న సంబంధం తెగిపోయే ప్రమాదం ఉంది. ఆ సమయంలో శరీరం శ్వాస తీసుకోవడం మానేస్తుంది. అదే ఇక ఆత్మ శరీరానికి కలవపోవడానికి కారణం అవుతుంది. ఈ స్థితిని నిద్రలోనే మరణించిన వారిలో చూడవచ్చు. ఇది యోగ శాస్త్రం ప్రకారం కళ వచ్చే ప్రక్రియ.
ఇక మానసిక నిపుణుల ప్రకారం కలలు మనిషి నిద్ర సమయంలో తన దైనందిన జీవితంలో గడిచిన కొన్ని సందర్భాలు, ఒత్తిడిలే కలలుగా మారుతాయని చెబుతున్నారు. ఒక వ్యక్తి సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటే అదే ఆలోచిస్తూ నిద్రించడం వల్ల మెదడు సుప్తావస్థలో కూడా తన ప్రక్రియ కొనసాగిస్తూ ఉంటుంది. మెదడులో ఉండే కార్టెక్స్ అనే భాగమే ఈ ఆలోచనలకు దారి తీస్తుంది. సమస్యకు పరిష్కారం వెదుక్కునే రూపంలో కొన్ని కలలు మెదులుతూ ఉంటాయి. ఆ కలలకి మన శరీరం స్పందిస్తూ ఉంటుంది కూడా. ఒక వ్యక్తి పడుకున్నప్పుడు మీరు గనుక కనురెప్పలు పైకి లేపి చూస్తే ఆ వ్యక్తి కళ్లు అటూ ఇటూ తిరుగుతూ ఉండడం గమనించవచ్చు. దీనికి కారణం కల కనే వ్యక్తి కలలో ప్రతి దృశ్యాన్ని తన మనో నేత్రంతో చూస్తున్నట్టు.
ఈ మనో నేత్రం కూడా అన్ని వైపులా ఒకేసారి చూడలేదు. కొన్నిసార్లు కొండల మీద నుండి కానీ, ఎత్తైన భవనాల మీద నుండి కానీ లోతుల్లో కానీ పడిపోతున్నట్టు కలలో ఉంటే శరీరం ఖచ్చితంగా ఉలిక్కి పడి లేస్తుంది. ఇలాంటి సందర్భాల్లే మన కలలకు మన శరీరం స్పందిస్తున్నట్టు తెలుపుతాయి. సమస్యలే కాకుండా సంబంధం లేని పీడ కలలు, ప్రేత కలలు కూడా వస్తుంటాయి. ఇలాంటి కలలు సున్నిత మనస్కులకు, చిన్న విషయాలకే ఎక్కువగా భయపడే వారికి వస్తుంటాయి. కొందరి విషయానికి వస్తే కల నిజంగా జరుగుతుందన్న భావనలో ఉండిపోతారు. నిజానికి మానసిక శాస్త్ర నిపుణుల విశ్లేషణ ప్రకారం కొందరికి దీర్ఘ దృష్టి ఉంటుంది.
తమకు జరిగే మంచి చెడులు ముందే ఊహించగలరు. దీన్నే సిక్స్త్ సెన్స్ అంటారు. ప్రతి ఒక్కరికి ఈ సెన్స్ అప్పుడప్పుడు పని చేస్తుంది. కానీ కొందరికి ఈ సెన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారికే జరగబోయేది ఏంటి అనే విషయం తెలుస్తుంది. ప్రతి విషయం స్పష్టంగా కనిపిస్తుంది. మనిషి ఒక విషయాన్ని పదే పదే మననం చేయడం వల్ల లేదా అలవాటు చేసుకోవడం వల్ల జీవితంలో ఎప్పటికి మరిచిపోలేని విషయంగా మారుతుంది. ఇక ఉదయాన్నే వచ్చే కలలు నిజమవుతాయని కొందరు నమ్ముతారు. మొత్తానికి కల అనేది వ్యక్తి జీవితంలో జరిగిన లేదా జరగబోయే విషయాలే. కొందరికి ఆ కల నిజమవుతుంది. కొందరికి ఆ కల కలలాగే మిగిలిపోతుంది.