మన మనసులో ఏదైతే ఉంటుందో అదే మెదడులోకి రావాలి. అక్కడి నుంచి మాట ద్వారా బయటకు రావాలి. మనసులో ఒకటి, మెదడులో మరొకటి, బయటకు చెప్పేది ఇంకొకటిగా ఉండకూడదు.
మాట అనేది భగవంతుడిచ్చిన వరం. అందుకే చెప్పిన మాటలకు కట్టుబడి ఉండాలి అంటారు అలా కుదరనప్పుడు మాట ఇవ్వకూడదు. కానీ రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీకన్నా అప్పుడు హామీ ఇచ్చిన బీజేపీ చేస్తుందే ఎక్కువ నష్టంగా ఉంటోందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
పోటీలు పడి మరీ హామీలిచ్చిన బీజేపీ?
విలువైన హామీలిచ్చేటప్పుడు తర్వాత చూసుకుందాంలే అన్నట్లుగా పెద్దన్న హోదాలో అసలు ఇవ్వకూడదు. కానీ కేంద్రంలోఅధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించే సమయంలో కాంగ్రెస్ పార్టీతో పోటీలు పడి మరీ హామీలిచ్చింది. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎయిమ్స్ ఏర్పాటు చేయగలిగింది. ప్రత్యేక హోదాకానీ, పోలవరంకానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైను కానీ.. ఇలా విభజన హామీల్లో పొందుపరిచినదాంట్లో ఏ ఒక్కటీ చేయలేదు. ఈ విషయంలో బీజేపీకన్నా రాష్ట్రాన్ని అడ్డంగా విభజించిన కాంగ్రెస్ పార్టీనే నయమనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.
విశాఖను ఒడిసాలో కలిపేశారు!!
విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేసే ఉద్దేశం ఉంటే నగర పరిధిలో ఉన్న రైల్వే లైను తీసుకువెళ్లి ఒడిసా కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వేలో కలిపివుండేవారే కాదు. వారికి ఇవ్వాలన్న ఉద్దేశం లేదు. కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ మాట్లాడుతూ పుకార్లను నమ్మవద్దని, జోన్ ఏర్పాటు చేస్తామని మీడియా సముఖంగా చెప్పారు. దక్షిణకోస్తా రైల్వేజోన్ ఏర్పాటుకోసం ఓఎస్డీ ఇచ్చిన నివేదికపై సమీక్ష జరుగుతున్నట్లు తూర్పుకోస్తా రైల్వే జోన్ తెలిపింది. అయితే.. రెండున్నర సంవత్సరాలుగా ఈ మాటను రైల్వేశాఖ చెబుతూనే ఉంది.. మనం వింటూనే ఉన్నాం.
32 నెలల నుంచి అదే చెబుతున్నారు!
2020 మార్చి 18వ తేదీన తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్నాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీవీ మిథున్‌రెడ్డి కొత్త జోన్ ఏర్పాటు గురించి లోక్ సభలో అడిగారు. అప్పుడు మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. రైల్వేబోర్డు కార్యాలయంలో డీపీఆర్ పరిశీలనలో ఉందని చెప్పారు.
ఈ సమాధానం ఇచ్చి ఇప్పటికి 31నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పుడు కూడా మంత్రులు, అధికారులు అదే మాట చెబుతున్నారు. విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ అన్నది కాగితాలకే పరిమితమవుతోంది. రైల్వేశాఖ పరిశీలన కోసం జోనల్ ప్రధాన కార్యాలయ ఆర్కిటెక్చరల్ ప్లాన్‌ను ఆర్కిటెక్ట్ సమర్పించారు అని తూర్పుకోస్తా రైల్వే చెబుతోంది. జోన్ ఏర్పాటవుతుందా? లేదా? అనేది కేంద్రానికి, తూర్పు కోస్తా రైల్వేఅధికారులకే తెలియాలి. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలానే మాటలు చెబుతూ రోజులు గడిపేస్తారని ఏపీ ప్రజలు అడుగుతున్నారు. వాటికి సమాధానం మాత్రం రావడంలేదు.