మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు అన్న సామెత ఆ యువతి విషయంలో అక్షరాలా నిజం.. పాపం అసలే పిల్లి కరచి బాధపడుతోంది.. రేబిస్ వ్యాక్సిన్ ప్రభుత్వ ప్రజారోగ్య కేంద్రానికి వెళ్ళింది..
తీరా అక్కడ వ్యాక్సిన్ తీసుకోలేదు సరికదా.. వీధి కుక్క కరచిపారిపోయింది.. ఈ విచిత్ర ఘటన కేరళ రాజధాని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
అపర్ణ (31) అనే మహిళ పిల్లి కాటుకు గురైంది. దీంతో ఆ మహిళ తన తండ్రితో కలిసి రాజధాని నగర శివార్లలోని విజింజం వద్ద అదానీ పోర్ట్ సమీపంలోని పబ్లిక్ హెల్త్ సెంటర్ కు యాంటి రేబిస్ ఇంజెక్షన్ ను తీసుకోవడం కోసం వెళ్ళింది. అక్కడ సిబ్బంది కోసం ఎదురుచూస్తోంది. అప్పుడు అపర్ణని వీధి కుక్క కరిచింది. అవును ప్రభుత్వ ప్రజారోగ్య కేంద్రంలో పిల్లి కాటుకు యాంటి రేబిస్ డోస్ కోసం ఎదురు చూస్తున్న అపర్ణ వీధికుక్క కాటుకు గురైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అయితే అపర్ణ పిల్లి కరిచిన తర్వాత మూడవ డోస్ ఇంజెక్షన్ కోసం ఆరోగ్య కేంద్రంలో ఉంది.
ఇదే విషయంపై అపర్ణ తండ్రి మాట్లాడుతూ..తాము ఉదయం 8 గంటలకు ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నామని చెప్పారు. అపర్ణ తన వంతు కోసం ఒక కుర్చీపై కూర్చుని ఉంది. అయితే ఆ కుర్చీ కింద ఉన్న కుక్క హఠాత్తుగా తన కూతుర్ని కరిచిందని తెలిపారు. మేము అలారం మ్రోగించిన వెంటనే హెల్త్ సెంటర్ సిబ్బంది వచ్చారు.. మొదట అపర్ణ గాయాన్ని పట్టించుకోలేదు. అయితే ఇతర రోగులు కోపం వ్యక్తం చేశారు. తాను పక్కన ఉన్న వ్యక్తి దగ్గర ఉన్న సబ్బును తీసుకొని తన కుమార్తె గాయాన్ని శుభ్రం చేసినట్లు అపర్ణ తండ్రి చెప్పారు. అనంతరం ఆ మహిళను 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరంలోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. సరైన వైద్యం అందించారు. కేరళలో వీధికుక్కల బెడద ప్రమాదకర స్థాయికి చేరుకుంది. వీటి నుంచి తమను కాపాడడానికి ప్రభుత్వం పెద్దగా కృషి చేయడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు