చాలా మంది డాక్టర్లు కామన్ గా చెప్పే మాట.. ఎక్కువ సేపు టీవీ, స్మార్ట్ ఫోన్ చూడటం మూలంగా కంటి సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
అవును.. ఈ రోజుల్లో పిల్లలు గంటల తరబడి టీవీల్లో కార్టూన్ ఛానెల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. కంప్యూటర్లలో జోరుగా వీడియో గేమ్స్ ఆడుతారు. ఒక్కోసారి ఎక్కువ సేపు ఆ స్క్రీన్లను చూడటం వల్ల పిల్లలకు ఐ సైట్ తో పాటు మానసిన ఇబ్బందులు కూడా ఎదురవ్వుతాయి. అయితే, జపాన్ పరిశోధకులు అందుబాటులోకి తెచ్చిన ఓ వింత వీడియో గేమ్ మాత్రం చాలా భిన్నంగా పనిచేస్తుంది. ఈ మొబైల్ వీడియో గేమ్ ఆడటం వల్ల కంటి చూపు మెరుగవుతుందట!
METEOR BLASTERతో గ్లాకోమా గుర్తింపు
తోహోకు యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లోని శాస్త్రవేత్తలు జపనీస్ టెలివిజన్ కంపెనీ సెండాయ్ బ్రాడ్‌కాస్టింగ్ కో లిమిటెడ్‌తో కలిసి METEOR BLASTER అనే వీడియో గేమ్ రూపొందించారు. ఇది దృష్టిని మెరుగుపరచడంలో
సహాయపడుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ వీడియో గేమ్ ఆడేవారి కళ్ల పని తీరును పరిశీలించే అవకాశం ఉంటుంది. గ్లాకోమా యొక్క ప్రారంభ లక్షణాలను ఈ గేమ్ గుర్తిస్తుంది. దీంతో సంభావ్య అంధత్వాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
జపాన్ లో 4.65 మిలియన్లమందికి గ్లాకోమా
జపాన్‌లో అంధత్వానికి మొదటి కారణం గ్లాకోమా అని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఆ దేశంలో దాదాపు 4.65 మిలియన్ల మంది ప్రజలు గ్లాకోమాతో బాధపడుతున్నారని అంచనా వేయబడింది. వారిలో 90% మంది సమస్య తీవ్రం అయ్యే వరకు ఆస్పత్రికి వెళ్లకపోవడం మూలంగానే అంధత్వం ఏర్పడినిట్లు తేలింది. అదే ప్రారంభ దశలో గుర్తించినప్పుడు.. గ్లాకోమాను మందులతో నయం చేసే అవకాశం ఉంటుంది.
వాస్తవానికి గ్లాకోమా ఉందా? లేదా? అని తెలుసుకునేందుకు పరీక్షలు జరపాలని ప్రభుత్వం అనుకున్నా.. జనాలు ఆసక్తి చూపించలేదు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు కంటి సమస్యను గుర్తించడానికి ఈ వీడియో గేమ్ రూపొందించారు. వీడియో గేమ్‌లు సాధారణంగా మానవ కంటి చూపుకు హానికరం. ఎక్కువ సమయం ఆడినప్పుడు కంటి సంబంధ ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ, ఈ ప్రత్యేక మొబైల్ గేమ్ మినహాయింపుగా చెప్పుకోవచ్చు.
గేమ్ స్కోర్ ఆధారంగా కంటి పరీక్షలు
METEOR BLASTER అనేది స్పేస్ షూటర్. వైట్ లైట్ ఆర్బ్స్ రూపంలో పవర్ అప్‌లను సేకరిస్తూ ఇన్‌కమింగ్ ఉల్కలను పేల్చడం టార్గెట్. ఈ గేమ్ ఆడేవారు ఫోన్‌ను కళ్ళకు 30 సెంటీమీటర్ల దూరంలో ఉంచాలి. వీలైనన్ని ఎక్కువ ఉల్కలను పేల్చడానికి ప్రయత్నించాలి. నాలుగు దశల్లో, 16 విభాగాలు ఆడిన తర్వాత.. గేమ్ మీ పని తీరుకు ఒకటి నుంచి ఐదు వరకు స్కోర్ ను కేటాయిస్తుంది. స్కోర్ ఒకటి నుంచి 3 వస్తే కంటి చూపు బాగున్నట్లు లెక్క. నాలుగు, ఐదు స్కోర్ చేసిన వారిని గ్లాకోమా పరీక్షల కోసం పంపుతారు. ఈ రోజుల్లో మొబైల్ వీడియో గేమ్‌లు బాగా ప్రాచుర్యం పొందుతున్నందున, METEOR BLASTER వంటి వినోదాత్మక యాప్‌లు తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులను నివారించడంలో సహాయపడతాయని నిపుణులు భావిస్తున్నారు…