‘ఐ లవ్‌ యూ’ చెప్తే సరిపోదండోయ్‌.. ఈ అయిదూ పాటిస్తే లవ్‌ లైఫ్‌ లక్కీనే..

 ‘ఐ లవ్‌ యూ’ చెప్తే సరిపోదండోయ్‌.. ఈ అయిదూ పాటిస్తే లవ్‌ లైఫ్‌ లక్కీనే..

అన్యోన్యంగా ఉండే దంపతుల బంధాన్ని ‘స్వచ్ఛమైన ప్రేమ’ అంటారు. ఎటువంటి పొరపొచ్చాలు.. అనుమానాలు.. అపార్థాలు రానివ్వకుండా.. కలకాలం పట్టి ఉంచుతుంది. కానీ నేటి తీరికలేని డిజిటల్‌ లైఫ్‌స్టైల్‌ వల్ల ఎంతో దృఢమైన బంధాల్లో సైతం బీటలు ఏర్పడుతున్నాయి. ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు, పెద్దలు కలిపిన పరిణయ జంటలు ఎన్నో అపార్థాలతో అన్యమనస్కంగా ‘ఎడముఖం పెడ ముఖం’గా ఉంటున్నాయి. బంధం ఏర్పడిన కొద్దికాలానికే విడాకులతో విచ్ఛిన్నమవుతున్నాయి. అతి చిన్న కారణాలకే తెగిపోతున్న అనుబంధాలను నిలబెట్టుకోవడానికి ‘లవ్‌ లాంగ్వేజ్‌’లు వారధిగా నిలుస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఒకప్పుడు.. ‘‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’’, ‘‘నువ్వంటే నాకు చాలా ఇష్టం’’ అని చెప్పి అవతలి వ్యక్తి మీద తమకు ఉన్న అపారమైన ప్రేమను వ్యక్తం చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రేమను వ్యక్తం చేయడానికి ‘ఐ లవ్‌ యూ’ అన్న ఒక్క పదం సరిపోవడం లేదు. అంతకు మించి కావాలనిపిస్తుంది. పార్టనర్‌కు ప్రేమను అందించడానికి, పార్టనర్‌ అలిగినప్పుడు, కోప్పడినప్పుడు, అనుమానపడినప్పుడు.. అపోహలు తొలగించి ఇద్దరి మధ్య సఖ్యత కుదిరేందుకు ఈ ‘లవ్‌లాంగ్వేజ్‌’లు భరోసాను ఇస్తున్నాయి.

ఆత్మీయ మాటలు:

మనకు ఇష్టమైన వారిని కలిసినప్పుడు ముచ్చటించే పలకరింపులు ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. పార్టనర్‌తో మాట్లాడే ప్రతిసారి అప్యాయత, ఆత్మీయ అనురాగాన్ని కనపరచాలి. వారు చేసే పనులు, తీసుకునే నిర్ణయాలను మెచ్చుకుంటూనే లోటుపాటులను కూడా సున్నితంగా తెలియజెబుతుండాలి. ప్రతిపనిని నువ్వు చేయగలవని ప్రోత్సహించాలి. విమర్శ మీ మధ్య దూరాన్ని పెంచితే అభినందన బంధాన్ని మరింత బలపరుస్తుంది.

చేదోడుగా:

మీ పార్టనర్‌ చేస్తోన్న పని కష్టమైనదిగా ఉండి ఇబ్బంది పడుతుంటే ఆ పనిలో సాయం చేసి వారి పని భారం తగ్గించాలి. ఈ విధంగా వారి మీద మీకున్న ప్రేమను వ్యక్తం చేయవచ్చు. రోజూ పార్టనర్‌ చేసే పనిని అప్పుడప్పుడు మీరు చేసి ఆశ్చర్యపరచాలి.

ఇచ్చిపుచ్చుకోవడం :

ఏదైనా ఇచ్చిపుచ్చుకుంటే ఎంతో బావుంటుంది. ఇది కూడా ప్రేమను వ్యక్తం చేయడానికి మంచి మార్గం. సందర్భం ఉన్నా లేకపోయిన స్థోమతకు తగ్గట్టుగా బహుమతులు, చిన్నపాటి సర్‌ప్రైజ్‌లు ఇస్తూ పార్టనర్‌ను ఆనంద పరచాలి.

పోతే రానిది :

ఈ ప్రపంచంలో ఎంతో విలువైనది ఏంటీ? అడిగితే టక్కున చెప్పేది సమయం. జరిగిపోయిన కాలం తిరిగి రాదు. అందుకే బిజీలైఫ్‌లో దొరికే కాస్త ఖాళీ సమయాన్ని పార్టనర్‌తో గడపడానికి కేటాయించాలి. అతిముఖ్యమైన సమయాల్లో కొన్ని పనులు పక్కనపెట్టాలి లేదంటే వాయిదా వేసి మరీ పార్టనర్‌తో గడపాలి. ఇలా చేయడం ద్వారా ‘‘జీవితంలో నువ్వే నాకు ముఖ్యం.. నీ తర్వాతే ఏదైనా’’ అనే భావన కలుగుతుంది. పార్టనర్‌ పదేపదే ఒకే విషయాన్ని చెబుతూ విసిగిస్తున్నారని దూరంగా వెళ్లకూడదు. వారితో కాస్త సమయం గడిపేందుకు ప్రయత్నించి వారిని ఆ మూడ్‌ నుంచి బయటకు తీసుకు రావాలి. ఇలా చేయడం వల్ల బలహీన సమయాల్లో పార్టనర్‌ తీసుకునే అపాయకరమైన నిర్ణయాల నుంచి వారిని కాపాడగలుగుతారు.

చేతలతో :

కొన్నిసార్లు మౌనమే అన్నింటికి సమాధానం చెబుతుంది అంటారు. ఈ మౌనానికి స్పర్శ జోడిస్తే పార్టనర్‌ మీద మనకున్న అపారమైన ప్రేమను వ్యక్తం చేయవచ్చు. ప్రేమను పంచడంలో స్పర్శకూడా ముఖ్యమైనదే. ఆత్మీయ స్పర్శ ద్వారా పార్టనర్‌ మానసికంగా, భౌతికంగా తనతోనే ఉన్న అనుభూతి కలిగి బంధం మరింత గట్టిపడుతుంది.

ఈ ఐదింటిలో పార్టనర్‌ మనస్తత్వాన్ని బట్టి కనీసం రెండైనా అనుసరించి ప్రేమను వ్యక్తం చేయవచ్చు. ఒక్కొక్కరు ఒక్కో భాషను ఇష్టపడతారు కాబట్టి వారి అభిరుచికి తగ్గట్లు వ్యవహరించి అనుబంధాన్ని దృఢపరుచుకోవాలి.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *