కిక్ సినిమా తరహాలో.. దొంగతనాలు చేసిన డబ్బుతో మంచి పని చేస్తున్న యువకుడు..!వివరాలు;

కిక్ సినిమా తరహాలో.. దొంగతనాలు చేసిన డబ్బుతో మంచి పని చేస్తున్న యువకుడు..!వివరాలు;

దొంగతనాలు చేస్తూ పోలీసుల కళ్లు గప్పి తిరిగే హీరో.. క్లైమాక్స్‌లో పేదలను ఆదుకుంటూ గుండెలను పిండేసే సీన్లు సినిమాల్లో చాలానే చూసుంటారు. నిజ జీవితంలోనూ అలాంటి ఓ వ్యక్తిని చెన్నై (Chennai Thief) పోలీసులు అరెస్టు చేశారు. ఎగ్మో ర్‌కు చెందిన అంబురాజ్ (33) ఐదేళ్లుగా ఇళ్లలో దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నాడు. పగలు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసే అంబురాజ్.. రాత్రిళ్లు దొంగ అవతారం ఎత్తుతున్నాడు. అలా చోరీలు చేసిన సొమ్ముతో అతడు ఆహారం, బట్టలు కొనుగోలు చేసి, ఫుట్‌పాత్‌లపై, రైల్వే స్టేషన్లలో పడుకునే నిరాశ్రయులకు అందిస్తున్నాడు. అంబురాజ్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతడి వద్ద నుంచి బంగారాన్ని, నగదును స్వాధీనం చేసుకున్నారు. అతడిని జ్యుడీషియల్ కష్టడీకి తరలించారు.

33 ఏళ్ల అంబురాజ్‌.. అన్నార్థుల ఆకలి వెతలకు చలించి ఆధునిక కాలపు ‘రాబిన్ హుడ్’ అవతారం ఎత్తాడు. చెన్నై నగర శివార్లలో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలు చేసేవాడు. అల్మారాలు పగులగొట్టి నగదు, నగలు ఎత్తుకెళ్తున్నాడు. నగలు అమ్మగా వచ్చిన సొమ్ముతో ఎగ్మోర్ పరిసర ప్రాంతాల్లోని పేదలకు అన్నం, దుస్తులు పంచిపెడుతున్నాడు. ఇన్నేళ్లుగా తప్పించుకొని తిరుగుతున్నా, బుధవారం (నవంబర్ 16) మాత్రం అంబురాజ్ అదృష్టం తలకిందులైంది.

పీర్‌కంకరనైకి చెందిన వరదరాజన్ (55) ఇంట్లో కొన్ని రోజుల కిందట దొంగతనం జరిగింది. ఇటీవల చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు వరదరాజన్. ఆ సమయంలో తన ఇంటికి తాళం వేశారు. నవంబర్ 4న ఇంటికి తిరిగి వచ్చేసరికి బెడ్రూమ్‌లో అల్మారా పగులగొట్టి ఉంది. 8 సవర్ల బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు.

సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు.. ఎగ్మోర్‌కు చెందిన భవన నిర్మాణ కార్మికుడు అంబురాజ్ ఆ దొంగతనం చేసినట్లుగా గుర్తించారు. పక్కా ప్రణాళికతో వల పన్ని అతడిని అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో తాను చేసిన చోరీల గురించి అంబురాజ్ వివరించాడు. దొంగిలించిన బంగారు ఆభరణాలను విక్రయించి, ఆ డబ్బుతో రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న నిరాశ్రయులు, నిరుపేదల ఆకలి తీరుస్తున్నట్లు తెలిపాడు.

ఆర్థిక పరిస్థితుల కారణంగా హైస్కూల్ విద్యను మధ్యలోనే ఆపేసిన అంబురాజ్.. పొట్ట కూటి కోసం కూలీ అవతారం ఎత్తాడు. పేదల ఆకలి కష్టాలను అతి దగ్గరగా చూసిన అతడు వారికి ఏదైనా చేయాలని అనుకునేవాడు. చేసేదేంలేక ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. పెరుగులత్తూరు, కట్టంకులత్తూరు, సింగపెరుమాళ్ కోయిల్ లాంటి ప్రాంతాలకు లోకల్ రైళ్లలో వెళ్లి ఇళ్లలోకి చొరబడేవాడు. పని పూర్తి చేసుకొని రైళ్లలో తిరిగి ఎగ్మోర్ వచ్చేవాడు. ఎగ్మోర్ రైల్వే స్టేషన్‌ సమీపంలో పేవ్‌మెంట్‌పై ఉన్న కొంత మందికి అంబురాజ్ తరచూ ఆహార పదార్థాలను పంచిపెట్టడం తాము చూశామని పోలీసులకు కొంత మంది స్థానికులు తెలిపారు.

 

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *