రక్తదానం చేయడం.. గొప్ప దానంగా పరిగణిస్తారు. ఒకరు రక్తదానం చేయడం వల్ల ముగ్గురి ప్రాణాల్ని కాపాడవచ్చు.
అందుకే రక్తందానం చేసే వారిని ప్రాణదాతలుగా పేర్కొంటారు. రక్తదానం చేయడం వల్ల.. ప్రమాదంలో ఉన్న వారి ప్రాణాన్ని కాపాడవచ్చు. అయితే.. రక్తదానం చేసినవారికి కూడా ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. రక్తదానం చేసినప్పుడు రక్తంతో పాటు, ఆర్‌బీసీ, ప్లాస్మా కూడా వేర్వేరు వ్యక్తులకు దానం చేయవచ్చు. అంటే, రోగి అవసరానికి అనుగుణంగా మనం రక్తాన్ని అందించి ప్రాణాన్ని కాపాడవచ్చన్నమాట.
అయితే.. రక్తదానానికి సంబంధించి మన దేశంలో అనేక రకాల ఊహాజనిత ప్రచారాలు జరుగుతున్నాయి. దీనివల్ల.. రక్తదానం చేసేవారిలో ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. దీనివల్ల ఇప్పటికీ రక్తం రోగుల అవసరానికి అనుగుణంగా లభ్యం కావడం లేదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. రక్తదానం విషయంలో ప్రజల్లో వ్యాపించిన అపోహలే ఇందుకు కారణం. దీనితో పాటు, రక్తదానం చేసిన తర్వాత మన శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి కూడా తగినంత ప్రచారం జరగడం లేదు. ఓ వ్యక్తి రక్తదానం చేయడం ఎలాంటి ప్రయోజనాలు పొందుతాడు.. ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుంది..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రక్తదానం శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..?
ఒక వ్యక్తి రక్తదానం చేస్తే అతని శరీరంలో రక్తానికి లోటు ఉండదు. ఎందుకంటే రక్తదానం చేసే ముందు వైద్యులు హిమోగ్లోబిన్, బ్లడ్ యూనిట్, దాత రక్తపోటు వంటి అన్ని విషయాలను తనిఖీ చేస్తారు. మీరు రక్తదానం చేసినప్పుడు శరీరం ఈ ప్రయోజనాలను పొందుతుంది.
ఐరన్ లెవెల్ మెయింటైన్ అవుతుంది..
రక్తంలో ఐరన్ లోపిస్తే అది శరీరానికి ఇబ్బంది కలిగించే విషయమే. కానీ ఐరన్ పరిమాణం పెరిగినా మనిషిని అనేక వ్యాధులు చుట్టుముడతాయి. వీటిలో మొదటి సమస్య కణజాలం దెబ్బతినడం. కాలేయం దెబ్బతినడం, శరీరం ఆక్సీకరణ జీవితం పెరగడం. అంటే, దాని ప్రభావాలు చాలావరకు నష్టం చేకూర్చుతాయి. పరిస్థితి మరింత దిగజారినప్పుడు మనకు ఆలస్యంగా తెలుస్తుంది. కానీ క్రమం
తప్పకుండా రక్తదానం చేసే వారి శరీరంలో ఐరన్ స్థాయి మెయింటెయిన్‌గా ఉంటుంది.
గుండెపోటు నివారణ..
రక్తంలో ఐరన్ పెరగడం కూడా గుండెపోటుకు కారణం అవుతుంది. ఎందుకంటే ఐరన్ కారణంగా కణజాలం పెరిగిన ఆక్సీకరణ రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉన్నట్లయితే మీ హృదయాన్ని జీవితాంతం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రక్తదానం గురించి ఆలోచించాలి.. రక్తదానం చేయాలని నిపుణులు పేర్కొంటున్నారు.
ఆరోగ్యకరమైన కాలేయం కోసం..
కాలేయ సంబంధిత సమస్యలను నివారించడంలో రక్తదానం కూడా సహాయపడుతుంది. ఎందుకంటే రక్తంలో ఐరన్ స్థాయి పెరగడం వల్ల కాలేయ కణజాలం దెబ్బతింటుంది. కాలేయ క్యాన్సర్‌కు కాలేయ
సంక్రమణ ప్రమాదం పెరుగుతుంది.
మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది..
ప్రతి ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. మీరు ఒకేసారి రక్తదానం చేయడం ద్వారా 3 నుంచి 4 మంది జీవితాలను రక్షించవచ్చు. మీరు ఎదుటివారికి సహాయం చేసినందుకు ఈ అనుభూతి మిమ్మల్ని సంతోషంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఒకరి ప్రాణాన్ని రక్షించడం వల్ల కలిగే ఆనందం మీలో ఆత్మ సంతృప్తిని నింపుతుంది. ఇది మీ మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే అలా చేయడం ద్వారా గౌరవం కూడా లభిస్తుంది. ఇది మీ అన్ని పనులలో ప్రతిబింబిస్తుంది.
రక్తదానం చేయడానికి ఎవరు అర్హులు..
- రక్తదానం చేసే వారి వయస్సు 18 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉండాలి.
- దాత బరువు 45 కిలోల కంటే ఎక్కువ ఉండాలి.
- ప్రతిసారి రక్తదానం చేయడానికి కనీసం 3 నెలల విరామం ఉండాలి.
- తీవ్రమైన అనారోగ్యాలు లేని వ్యక్తులందరూ రక్తదానం చేయవచ్చు.