న్యూఢిల్లీ : నకిలీ పత్రాలు, ఫేక్ ఎక్స్‌పీరియన్స్ లెటర్స్‌తో ఉద్యోగాలను పొందిన పలువురిని తొలగించినట్టు యాక్సెంచర్ వెల్లడించగా తాజాగా కాగ్నిజెంట్ సైతం బ్యాక్‌గ్రౌండ్ చెక్‌లో విఫలమైన సిబ్బందిపై వేటు వేసినట్టు తెలిపింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో తప్పుడు పత్రాలతో ఉద్యోగాల్లో చేరినట్టు తేలిన 6 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్టు కాగ్నిజెంట్ ఇండియా వెల్లడించింది. బ్యాక్‌గ్రౌండ్ చెక్‌లతో అభ్యర్ధి నేపధ్య వివరాలు వెల్లడవడంతో మోసపూరిత పద్ధతుల్లో విధుల్లో చేరిన వారిని సాగనంపామని కంపెనీ ఇండియా హెడ్ రాజేష్ నంబియార్ తెలిపారు.
బ్యాక్‌గ్రౌండ్ చెక్‌లో ఫెయిల్ అయిన వారిని తాము ఎంతమాత్రం ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. ఇక కంపెనీలో ఉద్యోగం పొందేందుకు నకిలీ ఎక్స్‌పీరియన్స్ లెటర్, ఇతర తప్పుడు పత్రాలను సమర్పించిన ఉద్యోగులను తొలగించామని యాక్సెంచర్ ఇటీవల పేర్కొంది. తాము కఠిన వాణిజ్య నైతిక విలువలను అనుసరిస్తామని, వీటికి అనుగుణంగా వ్యవహరించని వారిని ఉపేక్షించబోమని యాక్సెంచర్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. భారత్‌లో యాక్సెంచర్ ఉద్యోగం కోసం తప్పుడు కంపెనీల నుంచి కొందరు నకిలీ ఎంప్లాయ్‌మెంట్ లెటర్స్, నకిలీ పత్రాలను సమర్పించిన విషయం తమ దృష్టికి వచ్చిందని, తమ క్లైంట్లకు సేవలందించే క్రమంలో ఆ సామర్ధ్యంపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేందుకు చర్యలు చేపట్టామని తెలిపింది.
యాక్సెంచర్‌లో జాబ్ నిమిత్తం కొందరు వ్యక్తులు, నిర్ధిష్ట ఎంప్లాయ్‌మెంట్ ఏజెన్సీలు ప్రజలను డబ్బు అడుగుతున్నట్టు తమకు సమాచారం అందిందని పేర్కొంది. యాక్సెంచర్‌లో ఉద్యోగం ఇచ్చే క్రమంలో డబ్బు వసూలు చేయాలని తాము ఏ సంస్ధకు, వ్యక్తికి అధికారం ఇవ్వలేదని తేల్చిచెప్పింది. నకిలీ జాబ్ ఆఫర్ల పట్ల అభ్యర్ధులు అప్రమత్తంగా ఉండాలని బ్లాగ్ పోస్ట్‌లో యాక్సెంచర్ హెచ్చరించింది.