అన్నీ ఉండి సివిల్స్ కొట్టడం కష్టం కాకపోవచ్చు. కానీ ఏమీ లేకుండా సివిల్స్ లో ర్యాంక్ సాధించారు. ఈయనే శివగురు ప్రభాకరన్ ఐఏఎస్. ఈ నేపథ్యంలో ఈయన సక్సెస్ స్టోరీ మీకోసం..
చిన్న చిన్న పనులు చేస్తూ..
ఈయన జీవితంలో అన్నీ సినిమా కష్టాలే. కానీ లక్ష్యాన్ని వదలలేదు. యుపిఎస్సీ పరీక్షల్లో ర్యాంక్ కొట్టేశాడు. అతను తమిళనాడుకు చెందిన ఎం.శివగురు ప్రభాకరన్.
సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్ నుంచి ఐఐటి మద్రాసుకు చెరుకున్నాడు. యుపిఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో అతను మంచి ర్యాంక్ సాధించి ఐఏఎస్ అయ్యాడు.
కుటుంబ నేపథ్యం :
శివగురు ప్రభాకరన్ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. తండ్రి తాగుబోతుగా మారి కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో భారమంతా తల్లిపైనా సోదరిపైనా పడింది. దాంతో కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండడానికి శివగురు చిన్న చిన్న పనులు చాలా చేశాడు. రెండేళ్ల పాటు కట్టెకోత యంత్రం ఆపరేటర్ గా పనిచేశాడు. పొలం పనులు చేశాడు. వచ్చినదాంట్లో కొంత కుటుంబానికి ఇస్తూ కొంత తన చదవు కోసం దాచిపెడుతూ వచ్చాడు. ఆర్థిక పరిస్థితి వల్ల పన్నెండో తరగతి తర్వాత విద్యను కొనసాగిస్తాననే నమ్మకం అతనికి లేదు.
శిక్షణ పొందుతూ.. వారాంతాల్లో..
2008లో తమ్ముడి ఇంజనీరింగ్ చదువుకు, సోదరి పెళ్లికి సాయం చేశాడు. ఆ తర్వాత వెల్లూరులోని తాంతియా పెరియార్ సాంకేతిక ప్రభుత్వ సంస్థలో సివిల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. ఇంగ్లీష్ సరిగా రాదు, విద్య అంతా తమిళ భాషలో నడిచింది. పైగా, మధ్యలో గ్యాప్. ఐఐటి కొట్టాలనే లక్ష్యంతో చెన్నై చేరుకున్నాడు. పేద పిల్లలకు శిక్షణ ఇచ్చే సెయింట్ థామస్ మౌంట్ లోని ట్యూటర్ వద్దకు వెళ్లాడు. ట్యూటర్ వద్ద శిక్షణ పొందుతూ వారాంతాల్లో రాత్రుళ్లు సెయింట్ థామస్ రైల్వే స్టేషన్లో పడుకునేవాడు. ఆ తర్వాత వెల్లూరు వెళ్లి అక్కడ మొబైల్ షాపులో పనిచేసేవాడు. తర్వాత ఐఐటి ప్రవేశ పరీక్ష రాసి ఐఐటి మద్రాసులో ఎంటెక్ చేశాడు. మధ్య మధ్యలో యుపిఎస్సీ పరీక్ష రాస్తూ వచ్చాడు. నాలుగో ప్రయత్నంలో శివగురు ప్రభాకరన్ సివిల్స్‌లో ర్యాంక్ కొట్టాడు. ఈయన ఐఏఎస్ అధికారిగా.. తిరునెల్వేలి సబ్ కలెక్టరుగా.. బాధ్యతలు నిర్వర్తించాడు.ఈయన వివాహం.. నలుగురికి ఆదర్శం..
వారిద్దరూ ఉన్నత వ్యక్తులు. ఉన్నత విద్యావంతులైనంత మాత్రన ఉన్నత వ్యక్తులు కాలేరు. ఉన్నతమైన భావాలు, తమ వంతు సేవాభావంతో మాత్రమే మనుషుల్లో అణిముత్యాలుగా మిగిలిపోతారు. సినీకవులు ఎప్పుడో చెప్పినట్లుగా కృషి వుంటే మనుషులు రుషులవుతారు.. మహాపురుషులవుతారు.. అన్నట్లుగానే ఈ జంట కూడా ఆ పరిగణలోకే వస్తుంది. ఈయన ఓ వైద్యురాలితో వివాహం జరిగింది.అయితే ఆయన నేరుగా తనకు కాబోయే భార్యనే వరకట్నం అడిగాడు. అదేంటి.. వరకట్నం ఇచ్చిపుచ్చుకోవడం తప్పని.. అలా చేస్తే తప్పకుండా శిక్షార్హమని.. ఐఏఎస్ చదువుకున్న వ్యక్తులకు తెలియదా.? అంటే.. తెలుసు. అయినా.. వరకట్నం లేకుండా ఎన్ని పెళ్లిళ్లు జరుగుతున్నాయ్. నో డౌర్రీ అన్న ప్రచారం ఇంకా గర్భస్థ సాయిలోనే వుంది. ఈ విషయాన్ని పక్కనబెడితే.. ఐఏఎస్ అధికారి అడిగిన కట్నం విన్న తరువాత.. అతనికి కాబోయే భార్య కూడా కొంత ఆశ్చర్యానికి గురై.. ఆ తరువాత తేరుకుందట. కాబోయే భర్త అడిగిన వరకట్నం ఇచ్చందుకు సమ్మతించింది.
ఇంతకీ ఆ కట్నంమెంటో తెలుసా.?
తన కాబోయే భార్య వారంలో రెండు రోజులు పేదలకు ఉచిత వైద్య సేవలందించాలని షరతు పెట్టారు. అదే అమె తనకిచ్చే వరకట్నంగా కోరుకుంటున్నాడు. ఇదే విషయాన్ని ఆయన అమెతో చెప్పాడు. దీంతో ఆమె కొంత విస్మయానికి గురైంది. ఆ తరువాత వెంటనే తేరుకుని.. ఇంతటి ఉన్నత భావాలు వున్న వ్యక్తి తనకు భర్తలా లభించడం పట్ల అమె ఎంతో సంతోషించింది. చెన్నైకి చెందిన ఓ గణిత అధ్యాపకుడి కుమార్తె డాక్టర్ కృష్ణభారతితో తనకు వివాహం నిశ్చయైన తరువాత.. కట్నకానులక ప్రస్తావన సమయంలో నేరుగా కాబోయే భార్యనే ఈ కలెక్టర్ ఈ మేరకు తన వరకట్నం ఇవ్వాల్సిందిగా కోరడం.. అందుకు అమె సమ్మతించడం.. దీంతో వీరి పెళ్లి కూడా ఘనంగా జరిగింది.సేవలోను ముందు..
వారంలో రెండు రోజులు ప్రభాకరన్ స్వగ్రామమైన ఒట్టంకాడు, పరిసర గ్రామాల్లోని ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలన్న షరతు అమలు జరుగుతుంది.
ప్రభాకరన్ తొలుత రైల్వేలో ఉద్యోగం చేశారు. అనంతరం పట్టుదలతో ఐఏఎస్ చేశారు. ఆయన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరిట ‘డాక్టర్ ఏపీజే గ్రామ అభివృద్ధి బృందం’ ఏర్పాటు చేసి పలు రకాల సేవలు అందిస్తున్నారు. ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ, శ్రమదానం కింద చెరువుల పూడికతీత వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు.