మానవ జీవితంలో శ్రమకు చాలా ప్రాధాన్యం ఉంది. శ్రమించకుండా మన జీవితంలో అభివృద్ధి సాధ్యపడదు. శ్రమ… వికాసానికి వెన్నెముక.
ఈ రోజు ప్రపంచంలో మనం చూస్తున్న ఈ వికాసమంతా మానవ జాతి నిరంతర శ్రమ ఫలితం. ప్రకృతిలోని ప్రతి కదలికలోనూ… జీవులు శ్రమించాలనే సందేశం దాగి ఉంది.
సందేశం
మానవ జీవితంలో శ్రమకు చాలా ప్రాధాన్యం ఉంది. శ్రమించకుండా మన జీవితంలో అభివృద్ధి సాధ్యపడదు. శ్రమ… వికాసానికి వెన్నెముక. ఈ రోజు ప్రపంచంలో మనం చూస్తున్న ఈ వికాసమంతా మానవ జాతి నిరంతర శ్రమ ఫలితం. ప్రకృతిలోని ప్రతి కదలికలోనూ… జీవులు శ్రమించాలనే సందేశం దాగి ఉంది. చిన్న చీమ చాలా దూరాలు తిరిగి తన ఆహారాన్ని సమకూర్చుకుంటుంది. తేనెటీగలు ఎన్నో పూలమీద వాలుతూ తేనెను సేకరిస్తాయి. అటువంటి చిన్న జీవులను ఆదర్శంగా తీసుకొని… మానవులు ఎల్లప్పుడూ శ్రమించాలి. కష్టపడి పనిచేసేవారు ఎన్నటికీ ఓడిపోరు. విజయం వారి పాదాలను తాకుతుంది.
పూర్వకాలంలో… ఒక వ్యక్తి వేరే ప్రాంతంలో కష్టపడి పని చేశాడు. కొన్నాళ్ళకు స్వస్థలానికి వెళ్ళాలనే ఆలోచన కలిగింది. కొన్ని వస్తువులనూ, ఆహారాన్నీ ఒక ఒంటె మీద వేసుకొని బయలుదేరాడు. దారిలో ఎడారి ఎదురయింది. ప్రయాణంలో ఎంతో అలసిపోయిన అతనికి ఒక చెట్టు కనిపించింది. దాని కింద విశ్రమించిన అతను నిద్రలోకి జారిపోయాడు. కొద్దిసేపటికి కళ్ళు తెరిచి చూస్తే… ఒంటె కనిపించలేదు. అతని ఆహారం, వస్తువులు ఆ ఒంటెమీదే ఉండడంతో… దాని కోసం వెతుకుతూ ఎడారంతా తిరగడం మొదలుపెట్టాడు. ఎక్కడా ఒంటె కనిపించలేదు.
ఎండలో తిరిగి తిరిగి, అలసిపోయిన అతను… మళ్ళీ అదే చెట్టు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. విపరీతమైన ఆకలితో, దాహంతో నీరసించిపోయాడు. ‘నేను చివరి ఘడియల్లో ఉన్నాను. మృత్యువు రాక తప్పదు’ అనుకున్నాడు. అల్లాహ్‌ను ప్రార్థిస్తూ ”నేను కష్టపడి పని చేశాను. నీతిగా సంపాదించాను. ఎవరినీ మోసం చెయ్యలేదు. ఇప్పుడు నా మరణం సమీపించింది. నా అంతిమ సంస్కారాల కోసం ఎవరినైనా పంపించు” అని సాష్టాంగపడ్డాడు. కొద్ది సేపటికి అతను లేచి చూస్తే, ఎదురుగా సామానుతో సహా ఒంటె నిలబడి ఉంది. అతను సంతోషంతో దైవానికి కృతజ్ఞతలు తెలుపుకొన్నాడు. కష్టపడేవారి సంపాదన ఎన్నటికీ వృధా పోదు. అల్లాహ్ దాన్ని రక్షిస్తాడు. కష్టం చేసి సంపాదించేవాణ్ణి ఆయన ఎక్కువగా ప్రేమిస్తాడు.
ఒకసారి దైవ ప్రవక్త మహమ్మద్ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. ”నా దగ్గర తినడానికి ఏమీ లేదు. ఏదైనా ఉంటే సహాయం చెయ్యండి” అని అడిగాడు.
దృఢంగా, ఆరోగ్యంగా ఉన్న అతణ్ణి చూసి”నీవు అడవికి వెళ్ళి, కట్టెలు ఏరి, కట్ట కట్టి తీసుకురా” అని చెప్పారు దైవ ప్రవక్త. ఆ వ్యక్తి అడవికి పోయి, కట్టెలు కొట్టి తెచ్చాడు.
”వీటిని నువ్వు బజార్లో అమ్ము. వచ్చిన డబ్బుతో ఒక గొడ్డలి కొనుక్కో. రోజూ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి, వాటిని అమ్ముకో. నీ భార్యాపిల్లలను పోషించు. దీనివల్ల కష్టపడే తత్త్వం నీలో ఏర్పడుతుంది. డబ్బు విలువ, జీవితం విలువ తెలుస్తాయి. ఇతరులను సహాయం కోరడం కన్నా… స్వశక్తి మీద జీవించడంలోని ఆనందం అనుభవంలోకి వస్తుంది” అని చెప్పారు దైవప్రవక్త.
ఆయన మాటలను ఆ వ్యక్తి పాటించాడు. అతను ఆర్థికంగా స్థిరపడ్డాడు. కొంతకాలం తరువాత దైవ ప్రవక్త దగ్గరకు వచ్చాడు. ”శ్రమలోని సంతోషాన్ని నేను అనుభవిస్తున్నాను. ఎంతో ఆత్మసంతృప్తి కలుగుతోంది” అంటూ ఆయనకు ప్రణామాలు అర్పించాడు.