ఏటా దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు సీబీఎస్‌ఈ బోర్డు నిర్వహించే పది, 12వ తరగతి పరీక్షలకు బోర్డు హాజరవుతుంటారు. అయితే కరోనా కారణంగా గత సంవత్సరం రెండు సార్లు సీ బీఎస్‌ఈ బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించింది.
ఈ అకడమిక్ ఇయర్ నుంచి పాత పద్దతిలో ఒకసారి మాత్రమే నిర్వహించనుంది. పరీక్షలకు (CBSE) సంబంధించి విద్యార్థుల్లో ఉండే సందేహాలను క్లియర్ చేయడానికి కొన్ని తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.
ఈ సంవత్సరం ఎన్ని బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు?
కరోనా కారణంగా పరీక్షలను రెండుగా విభజించారు. అయితే ఇప్పుడు మహమ్మారి ప్రభావం తగ్గిపోవడంతో బోర్డు తన యాన్యువల్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను తిరిగి ప్రారంభిస్తుంది. వచ్చే ఏడాది జరిగే 10, 12వ తరగతి బోర్డు పరీక్షలు రెండు టర్మ్‌లుగా కాకుండా ఒకే ఎగ్జామ్‌గా నిర్వహించనున్నారు.
సీబీఎస్ఈ ఈ సంవత్సరం బోర్డ్ ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తుంది?
సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి బోర్డు ఎగ్జామ్స్‌ను ఫిబ్రవరి 15 నుంచి నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభమయ్యే 45 రోజుల ముందు ఎగ్జామ్ డేట్ షీట్ విడుదల చేయనున్నారు. ఫైనల్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను డిసెంబర్-చివరిలో ప్రకటించే అవకాశం ఉంది.
బోర్డు సిలబస్‌ను విభిజిస్తుందా?
దాదాపు రెండేళ్లపాటు తక్కువ సిలబస్‌లో 10, 12వ తరగతుల ఎగ్జామ్స్ నిర్వహించింది. అయితే ఈసారి 100 శాతం సిలబస్‌తో ఎగ్జామ్స్ నిర్వహించనుంది. అధికారిక సిలబస్ cbse.nic.inవెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
12వ తరగతికి ఉత్తీర్ణత శాతం ఎంత ?
ఒక విద్యార్థి ఐదు సబ్జెక్టుల్లో కనీసం 33 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
సమాధానాలు రాయడానికి పరీక్షలో అదనపు షీట్‌ను ఇస్తారా?
కచ్చితంగా ఇస్తారు. విద్యార్థులు సమాధానాలు రాయడానికి అదనపు షీట్‌ను పొందే అవకాశం ఉంది.
బోర్డ్ ఎగ్జామ్స్‌కి మళ్లీ ఎలా హాజరుకావచ్చు?
10వ తరగతి లేదా 12వ తరగతి బోర్డు ఎగ్జామ్‌లో ఫెయిల్ అయిన విద్యార్థి ప్రైవేట్ అభ్యర్థిగా లేదా పాఠశాలలో చేరిన సాధారణ విద్యార్థిగా మళ్లీ పరీక్షలు రాయవచ్చు. మరిన్ని వివరాల కోసం విద్యార్థులు www.cbse.nic.inని సందర్శించవచ్చు.
ఇంప్రూవ్‌మెంట్ కోసం ఒక విద్యార్థి ఏకకాలంలో అదనపు సబ్జెక్ట్ పరీక్షకు హాజరుకావచ్చా?
ఒకేసారి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులలో ఇంప్రూవ్‌మెంట్ కోసం పరీక్షలు రాయడానికి విద్యార్థుల
విద్యార్థులను అనుమతించరు.
సీబీఎస్ఈ ముందు సంవత్సరం క్వశ్చన్ పేపర్, శాంపుల్ పేపర్స్ ఎక్కడ లభిస్తాయి?
సీబీఎస్‌ఈ బోర్డ్ ఎగ్జామ్ -2023 కోసం శాంపుల్ పేపర్‌లను విడుదల చేసింది. 10, 12వ తరగతుల శాంపుల్ పేపర్‌లు బోర్డు అధికారిక వెబ్‌సైట్ cbseacademic.nic.inలో అందుబాటులో ఉన్నాయి.
థియరీలో ఫెయిల్ అయిన విద్యార్థి, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్‌ను మరోసారి తప్పనిసరిగా రాయాల్సి ఉంటుందా ?
అలా ఏమీ రాయాల్సిన అవసరం లేదు. విద్యార్థులు థియరీ ఎగ్జామ్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. మునుపటి ప్రాక్టికల్ మార్కులనే క్యారీ చేయనున్నారు.