ట్విన్ సిస్టర్స్‌కు బోన్‌మ్యారో దానం.. ఫ్యామిలీకి సూపర్ హీరోగా మారిన తొమ్మిదేళ్ల బాలుడు

క తండ్రి తన కుమారుడికి రోజూ సూపర్‌మ్యాన్, స్పైడర్‌మ్యాన్ వంటి సూపర్ హీరోల కథలు చెబుతుండేవాడు.

ఆ కథలను శ్రద్ధగా వింటూ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలనే స్ఫూర్తి పొందాడు బాలుడు. ఇప్పుడు ఆ పిల్లాడి వయసు తొమ్మిదేళ్లు. ఇంత చిన్న వయసులోనే తన శరీరంలోని ఓ అవయవం దానం చేసి ఇద్దరి ప్రాణాలు కాపాడాడు ఆ బాలుడు. ఇలా మొత్తం ఫ్యామిలీకే సూపర్ హీరో అనిపించుకున్నాడు ఆ బుడతడు. ఇంతకీ ఆ పిల్లాడు ఎవరు, ఎవరి ప్రాణాలను నిలబెట్టాడో తెలుసుకుందాం. మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని చౌక్ గ్రామానికి చెందిన అమిత్‌ జాదవ్-అపర్ణ దంపతులకు రాజ్ జాదవ్ అనే కుమారుడు ఉన్నాడు. వీరికి స్వరాలి, స్వరాంజలి అనే ఇద్దరు కవల పిల్లలు కూడా ఉన్నారు.

అమిత్ ఓ ట్రాన్స్‌ఫోర్ట్ సంస్థలో ఉద్యోగం చేస్తుండేవాడు. స్వరాలి, స్వరాంజలి నెలలు నిండకుండానే పుట్టారు. దీంతో వారు తరచూ అనారోగ్యం బారిన పడుతుండేవారు. దీంతో కంటి ఇన్ఫెక్షన్స్, ముఖం వాపు వంటి సమస్యలు వీరిని వెంటాడాయి. వీరు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారని నాలుగున్నరేళ్ల వయసులో వైద్యులు గుర్తించారు. అప్పటి నుంచి వారికి 12 ఏళ్లు వచ్చేవరకు ప్రతి నెలా రక్తమార్పిడి, ఐరెన్ మందుల కోసం అమిత్ చాలా ఖర్చు చేశారు. పిల్లల ఆరోగ్యం కోసం బంధువుల దగ్గర అప్పు చేశారు.

* ఆశ చిగురించిన వేళ

అమిత్ దంపతులు ఈ ఏడాది జనవరిలో తన పిల్లల చికిత్స కోసం నవీ ముంబైలోని ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లారు. అయితే ఎస్ఆర్సిసి చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో తలసేమియాతో బాధపడుతున్న ఓ పాపకు చేసిన బోన్ మ్యారో (ఎముక మజ్జ) సర్జరీ సక్సెస్ అయిందని వారు అక్కడ తెలుసుకున్నారు. ఈ విషయం అమిత్ దంపతులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. అయితే బోన్ మ్యారో ఇవ్వడానికి దాత దొరక్క సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.

* రాజ్ బోన్ మ్యారో 100 శాతం మ్యాచ్

దాత బోన్ మ్యారో, గ్రహీతకు పూర్తిగా పరిపోతేనే ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేస్తారు. ఇందుకు అయితే అమిత్ దపంతులు తన కుమారుడితో కలిసి హ్యూమన్ ల్యూకోసైట్ యాంటిజెన్స్  టెస్ట్ చేయించుకున్నారు. అదృష్టం కొద్దీ రాజ్ బోన్ మ్యారో తన అక్కల ఎముక మజ్జతో 100 శాతం మ్యాచ్ అయింది. ఇలా గత ఆగస్టులో ఆ కవల పిల్లలకు ఆపరేషన్ చేయించారు. ఇప్పుడు వారు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు.

* కొడుకును సిద్ధం చేయడానికి ఆరు నెలల సమయం

బోన్ మ్యారో దానానికి అవసరమైన సర్జరీ కోసం తమ కుమారుడిని సిద్ధం చేయడానికి తమకు చాలా సమయం పట్టిందని అమిత్ దంపతులు చెప్పుకొచ్చారు. ఆపరేషన్‌కు సహకరిస్తే సూపర్ మ్యాన్ అవుతావని తమ కుమారుడితో చెప్పామన్నారు. ఇది ఎంతో బాధగా ఉంటుందన్న విషయాన్ని కూడా రాజ్‌తో చెప్పినట్లు వారు తెలిపారు. చివరికి ఆ పిల్లాడిని ఆపరేషన్‌కు మానసికంగా సిద్ధం చేయడానికి వారికి ఆరు నెలల సమయం పట్టింది. ఇలా చిన్నప్పటి నుంచి తన తండ్రి చెబుతున్న సూపర్ మ్యాన్ కథలను నిజం చేసిన రాజ్ జాదవ్.. నిజంగా తన కుటుంబానికి సూపర్ మ్యాన్‌గా మారాడు. తన అక్కలతో పాటు తల్లిదండ్రుల సంతోషానికి అతడు కారణమయ్యాడు.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *